ఆడియన్స్ ని తప్ప నేను ఎవరినీ మోసం చెయ్యలేదు: పూరీ

Update: 2022-10-30 04:45 GMT
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కెరీర్ లో ఎన్నో హిట్లు ప్లాపులు చూసిన దర్శకుడు.. ఇప్పుడు ఒక్క పరాజయంతో ఎన్నడూ లేనంత నెగెటివిటీని ఫేస్ చేయాల్సి వచ్చింది.. ఒకప్పుడు తన సినిమాల వల్ల లాభపడిన డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మరియు ఫైనాన్షియర్స్ తో వివాదం తెచ్చుకోవాల్సి వచ్చింది.

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ''లైగర్'' సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. భారీ అంచనాలతో వచ్చిన చిత్రం ప్లాప్ అవ్వడంతో అందరూ తీవ్రంగా నష్టపోయారు. సినిమాల్లో నష్టాలొస్తే పరిహారం చేయాలన్న రూలేం లేదు. కానీ పూరీ మాత్రం నైతిక బాధ్యత వహిస్తూ.. తన సినిమా వల్ల నష్టపోయిన వారికి కొంత మేర తిరిగి ఇవ్వడానికి ఒప్పుకున్నారు.

లైగర్ సెటిల్మెంట్ కోసం కాస్త టైం తీసుకున్న పూరీ.. గడువు లోగా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో వివాదం తలెత్తింది. దీంతో బయ్యర్లు ఎగ్జిబిటర్స్ కలిసి పూరీ ఇంటి ముందు ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో పూరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా ఇదే హాట్ టాపిక్ గా నడుస్తున్న నేపథ్యంలో.. పూరీ జగన్నాథ్ రాసిన లెటర్ ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

సక్సెస్ మరియు ఫెయిల్యూర్స్ ఈ రెండూ వ్యతిరేకం అనుకుంటాం కానీ.. అది నిజం కాదని.. రెండూ ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తాయని పూరీ జగన్నాథ్ లేఖలో పేర్కొన్నారు. గుండెల నిండా ఊపిరి పిలిస్తే బతుకుతామని అనుకుంటాం కానీ.. వెంటనే చెయ్యాల్సిన పని ఊపిరి వొదిలెయ్యటమే అని అన్నారు.

ఇక్కడ ఏదీ శాశ్వితం కాదు.. లైఫ్ లో మనకి జరిగే ప్రతి సంఘటనని మనం ఒక అనుభవంలా చూడాలి తప్ప.. ఫెయిల్యూర్ సక్సెస్ లా చూడకూడదు అని పూరీ తెలిపారు. కాపాడినవాడే మోసం చేస్తాడు. లైఫ్ లో జరుగుతుంటాయి. అవన్నీ సీన్లే. అందుకే లైఫ్ ని సినిమాలా చూస్తే, షో అయిపోగానే మర్చిపోవచ్చు. మైండ్ కి తీసుకుంటే మెంటల్ వస్తది అని తనదైన శైలిలో లైఫ్ అంటే ఏంటో చెప్పాడు.

సక్సెస్ ఐతే డబ్బులొస్తాయి.. ఫెయిల్ ఐతే జ్ఞానం వస్తుంది. కాబట్టి ఎప్పుడూ మెంటల్ గా ఫైనాన్షియల్ గా గెయిన్ అవుతూనే ఉంటాం తప్ప.. ఈ ప్రపంచంలో మనం కోల్పోయేది ఏదిలేదు. అందుకే దేన్నీ ఫెయిల్యూర్ గా చూడొద్దని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు.

బ్యాడ్ జరిగితే మన చుట్టూ ఉన్న బ్యాడ్ పీపుల్ మాయమైపోతారు.. వెనక్కి తిరిగి చూస్తే ఎవడు మిగిలాడో తెలుస్తుంది. కానీ ఖాళీగా ఉండకూడదు. ఏదోకటి చెయ్యాలి. అది రిస్క్ అవ్వాలి. లైఫ్ లో రిస్క్ చెయ్యకపోతే అది లైఫే కాదు. ఏ రిస్క్ చెయ్యకపోతే అది ఇంకా రిస్క్ అని అన్నారు.

లైఫ్ లో నువ్వు హీరో ఐతే.. సినిమాలో హీరోకి ఎన్ని జరిగాయో అవన్నీ నీకు కూడా జరుగుతాయి. పొగుడుతారు.. నిందిస్తారు. బొక్కలో వేస్తారు.. మళ్ళీ విడుదల చేస్తారు. అందరూ క్లాప్స్ కొడతారు.. అక్షింతలు వేస్తారు. కాబట్టి ఇవన్నీ మీ లైఫ్ లో జరగకపోతే.. జరిగేలా చూడండి. లేకపోతే మీరు హీరో కాదేమో అనుకొనే ప్రమాదం ఉంది. అందుకే మనం హీరోలా బతకాలి.

బతకాలి అంటే నిజాయితీగా ఉండాలి. నేను నిజాయతీపరుడుని అని చెప్పుకోనవసరంలేదు. నిజాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిజమే కాపాడుకుంటుంది. ఎవరి నుంచి ఏదీ ఆశించకుండా.. ఎవరినీ మోసం చేయకుండా మన పని మనం చేసుకుంటూ పోతే మనలన్ని పీకే వాళ్ళు ఎవరూ ఉండరు. నేను ఎప్పుడైనా మోసం చేస్తే.. దగా చేస్తే అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ఆడియన్స్ ని తప్ప నేను ఎవరినీ మోసం చెయ్యలేదు.

నిజానికి నేను నా ప్రేక్షకులకు బాధ్యత వహిస్తాను. మళ్ళీ ఇంకో సినిమా తీసి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తా. ఇక డబ్బు అంటారా.. చచ్చినాక ఇక్కడ నుండి ఒక్క రూపాయి తీసుకెళ్లిన ఒక్కడి పేరు నాకు చెప్పండి. నేనూ దాచుకుంటా. ఫైనల్ గా అందరం కలిసేది స్మశానంలోనే.. మధ్యలో జరిగేది అంతా డ్రామా అని పూరీ జగన్నాథ్ తన లెటర్ లో చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News