టికెట్ రేట్లపై అగ్ర నిర్మాత‌ల్లో అసంతృప్తి

Update: 2021-11-29 05:57 GMT
ఏపీలో టికెట్ ధ‌ర‌లు ఇటీవ‌ల ప్ర‌జ‌ల్లో హాట్ టాపిక్. స‌వ‌రించిన జీవోతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ఇండ‌స్ట్రీని ముప్పు తిప్ప‌లు పెడుతోంద‌ని ఒక వ‌ర్గం నిర్మాత‌లు ఆరోపిస్తున్నారు. ఇలా అయితే ఇండ‌స్ట్రీ మ‌నుగ‌డ క‌ష్ట‌మేన‌ని పంపిణీ దారులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. టికెట్ రేట్ల పెంపుపై ప‌లువురు సినీపెద్ద‌లు ఇప్ప‌టికే బ‌హిరంగంగా జ‌గ‌న్ ని సాయం కోరారు. ప‌రిశ్ర‌మ‌కు స‌హ‌క‌రించాల‌ని అభ్య‌ర్థించారు. మంత్రి పేర్ని నానీతో భేటీల గురించి తెలిసిందే.

కానీ టికెట్ ధ‌ర‌ల పెంపు విష‌య‌మై దిగి వ‌చ్చేందుకు ఏపీ ప్ర‌భుత్వం సిద్ధంగా లేద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇటీవ‌లే సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన సంగ‌తి తెలిసిందే. ఇక‌పై బెనిఫిట్ షోలు ఎక్స్ ట్రా షోలు కూడా ఉండ‌వు. బ్లాక్ టికెటింగ్ దందాను ఆపేసేందుకు ప్ర‌భుత్వమే ఒక పోర్ట‌ల్ ని ర‌న్ చేస్తోంది.

అయితే అద‌న‌పు షోలు బెనిఫిట్ షోల గురించి సినీపెద్ద‌లు ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. పైగా ప్ర‌భుత్వ పోర్ట‌ల్ గురించిన క‌ల‌త కూడా లేదు. కానీ స‌మ‌యానుకూలంగా టికెట్ ధ‌ర‌ల్ని పెంచ‌క‌పోతే ప‌రిశ్ర‌మ చిక్కుల్లో నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేద‌ని చిరంజీవి స‌హా ప‌లువురు పెద్ద‌లు ప‌రిశ్ర‌మ త‌ర‌పున అభ్య‌ర్థించారు. టికెట్ ధ‌ర‌లు ఇలానే కొన‌సాగితే ఎగ్జిబిష‌న్ రంగం కుదేల‌వుతుంద‌ని ఇప్ప‌టికే సురేష్ బాబు - అల్లు అర‌వింద్ వంటి అగ్ర‌ నిర్మాత‌లు కం ఎగ్జిబిట‌ర్లు ఆందోళ‌న‌గా ఉన్నారు. ఏపీలో టికెట్ ధ‌ర‌లు పెంచాల‌ని వారంతా కోరుతున్నారు. ఇప్ప‌ట్లానే ప‌రిస్థితి కొన‌సాగితే ఏపీలో థియేట‌ర్లు మూత ప‌డ‌తాయ‌ని భవిష్య‌త్ పై జోశ్యం చెబుతుండ‌డం హీటెక్కిస్తోంది.




Tags:    

Similar News