'డాక్టర్ స్ట్రేంజ్' కు తెలుగులో ఏమాత్రం బజ్ లేదే..!

Update: 2022-05-05 06:30 GMT
కరోనా పాండమిక్ నేపథ్యంలో భారతీయ సినీ అభిమానుల అభిరుచిలో చాలా మార్పులు గమనించవచ్చు. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో విరివిగా కంటెంట్ అందుబాటులో ఉండటంతో.. కొన్ని ఎంపిక చేయబడిన చిత్రాలను మాత్రమే వారు బిగ్ స్క్రీన్ మీద చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

గత ఆరు నెలలుగా విడుదలైన సినిమాలను.. వాటిల్లో ఆదరణ దక్కించుకున్న చిత్రాలను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఇటీవల కాలంలో 'పుష్ప: ది రైజ్' - 'ఆర్.ఆర్.ఆర్' - 'కేజీఎఫ్: చాప్టర్ 2' వంటి లార్జర్ థెన్ లైఫ్ సినిమాలు విశేషమైన ప్రేక్షకాదరణ అందుకున్నాయి.

దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ సత్తా చాటి, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేశాయి. అలానే 'అఖండ' 'శ్యామ్ సింగరాయ్' 'బంగార్రాజు' 'డీజే టిల్లు' 'భీమ్లా నాయక్' వంటి తెలుగు చిత్రాలు కూడా ఆడియన్స్ ను అలరించాయి. అదే సమయంలో వచ్చిన పలు హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు తిరష్కరణకు గురయ్యాయి.

'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' వంటి హాలీవుడ్ సినిమా థియేటర్లలో ఉన్నప్పుడు వచ్చిన 'పుష్ప' సినిమా కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందని పలువురు అభిప్రాయ పడ్డాయి. అయితే అలాంటిదేమీ జరగలేదు. అనేక రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూలు - ఆక్యుపెన్సీ పరిమితులు ఉన్నప్పటికీ 'పుష్ప' సినిమాకు ఆదరణ దక్కింది.

తెలుగులో 'స్పైడర్ మ్యాన్' కొత్త సిరీస్ కు ఆశించిన స్థాయిలో ఆదరణ రాలేదనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన కొన్ని హాలీవుడ్ మూవీస్ ని కూడా పట్టించుకోలేదు. నిజానికి ఒకప్పుడు హాలీవుడ్ చిత్రాలకు.. ముఖ్యంగా సూపర్ హీరో మూవీస్ కు ఇండియాలోనూ మంచి క్రేజ్ ఉండేది. మార్వెల్ స్టూడియోస్ వారి 'అవెంజర్స్: ఎండ్ గేమ్' మరియు 'అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్' సినిమాలు మన దగ్గర కూడా మంచి వసూళ్ళు రాబట్టాయి.

కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలుగు ప్రేక్షకులు ఆంగ్ల చిత్రాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. సూపర్ హీరోల సినిమాలంటే బోర్ గా ఫీల్ అవుతున్నారు. ఓటీటీలో వచ్చాక చూద్దాంలే అనే ధోరణిలో ఉంటున్నారు. ఇలాంటి టైంలో హాలీవుడ్ సినీ ప్రియుల్లో బాగా ఫేమస్ అయిన 'డాక్టర్ స్ట్రేంజ్' సిరీస్ లో కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

మార్వెల్ స్టూడియోస్ నిర్మాణంలో 'డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌ నెస్' అనే టైటిల్‌ తో రూపొందిన ఈ చిత్రం మే 6న విడుదలకు సిద్ధంగా ఉంది. మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సూపర్ హీరో సినిమాపై ఏమాత్రం బజ్ లేదు. తెలుగు రాష్ట్రాల్లోని అర్బన్ ఆడియన్స్ సైతం ఈ హాలీవుడ్ చిత్రం పట్ల ఆసక్తి చూపించకపోవడం గమనార్హం.

కొన్ని మీడియాలలో హాలీవుడ్ సినిమాని చూసి తెలుగు మరియు హిందీ చిత్రాలు భయపడుతున్నాయని హడావిడి చేస్తూ.. 'డాక్టర్ స్ట్రేంజ్' న్యూ సిరీస్ కు బజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ రియాలిటీలో జనాలు ఈ సినిమాని పెద్దగా పట్టించుకోవడం లేదు. అందరూ ఈ సూపర్ హీరో సినిమాని ఓటీటీలో వచ్చినప్పుడు చూడొచ్చులే అనే ఆలోచనలో ఉన్నారు.

అదే సమయంలో మే 12న విడుదల కానున్న సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాపై తెలుగు ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఆ తర్వాత రాబోయే 'ఎఫ్ 3' 'మేజర్' వంటి పలు క్రేజీ చిత్రాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆంగ్ల డబ్బింగ్ చిత్రాలపై అంతగా ఆసక్తి కనబరచడం లేదు. మరి రేపు రిలీజ్ అవుతున్న 'డాక్టర్ స్ట్రేంజ్' మూవీ ఈ వీకెండ్ లో ఎలాంటి వసూళ్ళు సాధిస్తుందో చూడాలి.
Tags:    

Similar News