అది పూరి వల్ల మాత్రమే అవుతుందన్న ఎనర్జిటిక్ స్టార్!

Update: 2022-07-10 14:04 GMT
రామ్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఆయన అభిమానుల్లో అమ్మాయిల సంఖ్య కూడా ఎక్కువే. లవర్ బాయ్  గా ఆయనను చూడటానికి వాళ్లంతా ఇష్టపడుతుంటారు. లవ్ స్టోరీ నేపథ్యంలో ఆయన చేసిన 'దేవదాసు' మొదలు 'కందిరీగ' వంటి సినిమాలు భారీ విజయాలను అందుకోవడానికిగల కారణం అదే. అలాంటి రామ్ ఈ మధ్య కాలంలో కాస్త మాస్  కంటెంట్ వైపు మొగ్గుచూపుతున్నాడు. మాస్ యాక్షన్ దిశగా స్పీడ్ పెంచుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా  ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ది వారియర్' ముస్తాబవుతోంది.

మాస్ కంటెంట్ ఉన్న కథలను చేయాలనే ఉద్దేశంతో ఉన్న కారణంగానే, తమిళంలో మాస్ యాక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా చెప్పుకునే లింగసామిని రామ్ రంగంలోకి దింపాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమాకి శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాను, తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా  ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.

తాజా ఇంటర్వ్యూలో రామ్ మాట్లాడుతూ .. "మొదటి నుంచి కూడా నాకు పోలీస్ పాత్రలంటే ఇష్టం. పోలీస్ పాత్రలను  పోషించాలనే కోరిక బలంగా ఉండేది. అయితే పోలీస్ సినిమాలు గతంలో చాలానే వచ్చాయి. ఆ సినిమాలకి భిన్నంగా  .. ఏదో ఒక కొత్త పాయింట్ ఉన్నప్పుడే పోలీస్ పాత్రను చేయాలని అనుకున్నాను. ఈ మధ్య కాలంలో చాలా పోలీస్ కథలు విన్నాను . కానీ లింగుసామి గారు చెప్పిన ఈ పోలీస్ కథ నాకు నచ్చింది. అందుకు కారణంగా ఈ సినిమాలో కొత్త పాయింట్ ఉండటమే. పోలీస్ యూనిఫామ్ లోనే ఒక పవర్ ఉంటుంది. అందువల్లనే నేను మరింత ఎనర్జీతో చేసినట్టుగా అనిపిస్తుంది.

'ఇస్మార్ట్ శంకర్' సినిమా మాదిరిగానే ఈ సినిమా కూడా నా కెరియర్ లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందని భావిస్తున్నాను. 'ఇస్మార్ట్ శంకర్' ఆ రేంజ్ లో రావడానికి కారణం నేనేనని చాలా ఇంటర్వ్యూల్లో పూరి గారు చెప్పారు .. అది ఆయన గొప్పతనం. కానీ అలాంటి సినిమాలు ఆయన మాత్రమే రాయగలరు .. ఆయన మాత్రమే తీయగలరు. అది మరొకరికి  సాధ్యం కాదనేది నా అభిప్రాయం. ఆయనతో మళ్లీ సినిమా చేసే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తాను" అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన నెక్స్ట్ మూవీ బోయపాటితో ఉందనే విషయం అందరికీ తెలిసిందే.    
Tags:    

Similar News