RRR హీరోల ఫ్యాన్ వార్: ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక సినిమా రిలీజ్ ఐతే..!

Update: 2021-12-11 09:30 GMT
బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అంటూ పోటీపడే నందమూరి - మెగా ఫ్యామిలీ హీరోలు క‌లిసి ఒక మల్టీస్టారర్ చేస్తార‌ని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. అలాంటిది అసాధ్యం అనుకున్న కాంబినేషన్ ను సుసాధ్యం చేశారు ఎన్టీఆర్ - రామ్ చరణ్. ఇద్దరూ కలిసి ''ఆర్.ఆర్.ఆర్'' వంటి పాన్ ఇండియా మూవీ చేయడానికి రెడీ అయిపోయారు.

అయితే వీరిద్దరిని ఒకే స్క్రీన్ మీదకు తీసుకురావాలని ఆలోచించి.. దీనికి తగిన కథను రెడీ చేసి.. మెగా - నందమూరి హీరోలను ఒప్పించిన దర్శకుడు రాజమౌళికి మేజర్ క్రెడిట్ దక్కుతుందని చెప్పాలి. అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ పాత్రల ఆధారంగా కల్పిత కథతో 'ఆర్.ఆర్.ఆర్' సినిమా తెరకెక్కింది.

ఇటీవల విడుదలైన RRR ట్రైలర్ లో రామరాజుగా రామ్ చరణ్.. భీమ్ గా ఎన్టీఆర్ అదరగొట్టారు. ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ ను ఒకే ఫ్రేమ్ లో చూడటానికి సినీ అభిమానులకు రెండు కళ్లూ చాలలేదు. సినిమాలో ఇద్దరు హీరోల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండిందని అందరూ ఓ అభిప్రాయానికి వచ్చేసారు. ఇద్దరి పెర్ఫార్మన్స్ తో మెస్మరైజ్ చేస్తారనే అంచనాకు వచ్చేసారు.

ఇక తారక్ - చరణ్ మధ్య ఉండే బ్రోమాన్స్ చూస్తే, సినిమాలో రొమాన్స్ లేదు అనే ఫీలింగే రాదని రాజమౌళి చెబుతున్నారు. RRR హీరోలు సైతం తాము సినిమా చేసిన తర్వాత స్నేహితులం అవ్వలేదు.. ముందే స్నేహితులం కాబట్టే సినిమా చేశామని పేర్కొన్నారు. సినిమాలో కూడా ఎక్కువగా రెండు పాత్రల మధ్య ఉండే స్నేహాన్నే హైలైట్ చేసి చూపిస్తున్నారు.

ఏదైతేనేం బాక్సాఫీస్ ప్రత్యర్ధులుగా భావించే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి సినిమా చేయడం పట్ల సినీ ప్రియులు ఖుషీ అవుతున్నారు. అయితే ఎన్టీఆర్ - రామ్ చరణ్ అభిమానులు మాత్రం RRR సినిమా విషయంలో ఫైట్ చేస్తూనే ఉన్నారు. సినిమాలో తమ అభిమాన హీరోనే మెయిన్ అంటూ ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసుకుంటున్నారు.

ఇప్పుడు లేటెస్టుగా RRR ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్స్ లో కూడా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ తమ ఆధిపత్యాన్ని చూపించే ప్రయత్నం చేశారు. సినిమా విశేషాలు వెల్లడించడానికి రాజమౌళితో పాటుగా తారక్ - చరణ్ పలు నగరాల్లో మీడియా మిత్రుల సమావేశంలో పాల్గొంటున్నారు. ముంబైలో జరిగిన ఈవెంట్ కు చెర్రీ హాజరు కాలేకపోయారు.. కానీ మిగతా మూడు ప్రెస్ మీట్స్ కి వచ్చారు.

బెంగుళూరులో మీడియా సమావేశం జరుగుతున్న నేపథ్యంలో RRR హీరోల ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా రాంచరణ్ సమక్షంలో 'జై ఎన్టీఆర్' స్లోగన్స్ లో హంగామా చేశారు తారక్ అభిమానులు. అంతేకాదు తమ ఫేవరేట్ హీరోని ఓ పెద్ద గజామాలతో సత్కరించి కన్నడ సీమలో ఆయన క్రేజ్ ఏంటో తెలియజేయాలని ప్లాన్ చేశారు. అయితే అదే స్టేజి మీద మరో హీరో చరణ్ కూడా ఉండటంతో.. తనొక్కడే పూల మాల వేసుకోవడం భావ్యం కాదనుకొని తారక్ దాన్ని నిరాకరించారు.

అయితే మరుసటి రోజు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ అభిమానులు రచ్చ చేయడం కనిపించింది. ఎన్టీఆర్ - రాజమౌళి లతో కలిసి చరణ్ వస్తుండగా.. 'జై చరణ్' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ దూసుకు వచ్చారు. అయితే చెర్రీ వారిని నివారించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొందరు తారక్ ఫ్యాన్స్ సైతం వీరికి పోటీగా నినదించడం కనిపించింది.

రెండు సందర్భాల్లోనూ ఫ్యాన్స్ వల్ల ఎన్టీఆర్ - చరణ్ లతో పాటుగా రాజమౌళి కూడా కాస్త ఇబ్బంది పడ్డారు. తాము స్నేహితులమని చెబుతూ వస్తున్నా.. అభిమానుల చర్యలు వారికి తలనొప్పిగా మారే పరిస్థితి వచ్చింది. నిజానికి RRR అనౌన్స్ చేసినప్పుడే.. రాజమౌళి ఇద్దరు స్టార్ హీరోలను ఎలా బ్యాలన్స్ చేస్తారు?, ఎవరికి ఎంత స్క్రీన్ స్పేస్ ఇస్తారు? ఫ్యాన్స్ ని ఎలా మెప్పిస్తారు? అనే ప్రశ్నలు సగటు ప్రేక్షకుడి మదిలో మెదిలాయి.

జక్కన్న మాత్రం ఇప్పటి వరకు 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో ఇద్దరు హీరోలు సమానమే అన్నట్లుగా చాలా జాగ్రత్తగా ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు. ఫస్ట్ లుక్ దగ్గర నుంచి రీసెంటుగా వచ్చిన ట్రైలర్ వరకూ.. అన్నింటిలో ఎన్టీఆర్ - చరణ్ లకు సమ ప్రాధాన్యత ఇచ్చారు. అయినప్పటికీ హీరోల ఫ్యాన్స్ మాత్రం మొదటి నుంచీ మా హీరో గొప్ప అంటే.. మా హీరో గొప్ప అన్నట్లు సోషల్ మీడియాలో కొట్టుకుంటూనే ఉన్నారు.

ఇప్పుడే ఇలా ఉంటే జనవరి 7న RRR రిలీజ్ అయిన తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో?, ఇద్దరు హీరోల మధ్య ఫ్యాన్ వార్ ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరూ ఆలోచిస్తున్నారు. నిజానికి ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ చేస్తున్నప్పుడు ఫ్యాన్ వార్స్ అనేవి సహజమే. కానీ వారు తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియాకి చాటిచెప్పడానికి పూనుకున్నప్పుడు.. అభిమానులు ఇలా ఫైట్ చేసుకోవడం కరెక్ట్ కాదనేది సినీ ప్రియుల అభిప్రాయం.

ఇన్నాళ్లూ మన హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేయకపోడానికి ఫ్యాన్స్ ఒపీనియన్ గురించి ఆలోచించడం కూడా ఒక కారణమని అనుకోవాలి. కానీ ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలు తెలుగు సినిమా వైపు చూస్తున్నాయి. పాండమిక్ పరిస్థితుల్లో అయినా మన సినిమాలు వరల్డ్ వైడ్ గా సత్తా చాటుతున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు. అందుకే టాలీవుడ్ హీరోలు పెద్దగా ఆలోచిస్తున్నారు. ఇతర హీరోలతో కలసి నటించాడని రెడీ అవుతున్నారు. వీరికి ఫ్యాన్స్ సహకారం కూడా తోడైతే రాబోయే రోజుల్లో మరిన్ని మల్టీస్టారర్స్ వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News