రాజీనామా చేయాలంటూ మంచు విష్ణు పై విరుచుకుపడిన అభిమాని..!

Update: 2021-12-26 02:30 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో సినిమా టికెట్‌ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు బహిరంగంగానే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. సర్కారు నిర్దేశించిన టికెట్ రేట్లతో కరెంట్ బిల్లులు కూడా కట్టలేమని వాపోతున్నారు. దీనిపై పునరాలోచించుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఇంతవరకు 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' (మా) అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీ ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ పుంజుకుంటోంది అనుకుంటుండగా.. ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు నిర్ణయం టాలీవుడ్ కు ఇబ్బందిగా మారింది. దీనిపై 'మా' ప్రెసిడెంట్ ఇప్పటి వరకు మాట్లాడలేదు. రెండు తెలుగు రాష్ట్రాలతో మాట్లాడి చిత్ర పరిశ్రమలోని సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని 'మా' పీఠాన్ని అధిష్టించిన విష్ణు.. ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

ఏపీలో సినిమా టికెట్ ధరల వ్యవహారం మీద చిరంజీవి - సురేష్ బాబు - డీవీవీ దానయ్య - సి. కళ్యాణ్ - రాఘవేంద్రరావు వంటి సినీ ప్రముఖులు ఇప్పటికే ప్రభుత్వాన్ని అభ్యర్ధించారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల హీరో నాని ఇటీవల బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. హీరో సిద్ధార్థ్‌ సోషల్ మీడియాలో తనదైన శైలిలో చురకలు అంటిస్తున్నారు. 'మా' అధ్యక్షుడు టికెట్ ధరల అంశం మీద ఎప్పుడు స్పందిస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి.

ఈ ఇష్యూ మీద ఓ సినీ అభిమాని సోషల్ మీడియా వేదికగా విష్ణు మీద విరుచుకుపడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో మంచు విష్ణు 'మా' అధ్యక్షుడి పదవికి అర్హుడు కాదని.. వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేసాడు. రూ.10 - 20 లకు ఈరోజుల్లో ఒక టీ కూడా రావడం లేదనేది తెలియదా అని ప్రశ్నించాడు. దీనిపై ఇప్పుడు నాని మాట్లాడారని.. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ స్పందించారని.. మంచు విష్ణు అడగాల్సినవి వాళ్ళు అడిగారని అన్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని ధైర్యంగా ప్రశ్నించాలని సూచిస్తూ విష్ణు మీద ఫైర్ అయ్యాడు.

టికెట్ రేట్లు మరియు థియేటర్ల మీద 'మా' అధ్యక్షుడు స్పందించాలని సోషల్ మీడియాలో డిమాండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ల మీద తనిఖీలు జరుగుతున్నాయి. నిబంధనలు ఉల్లగించారంటూ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని థియేటర్లను సీజ్ చేస్తే.. అధికారుల తీరును నిరసిస్తూ ఇంకొన్ని సినిమా హాళ్లను స్వచ్చందంగా బంద్ పెడుతున్నారు. ఇదిలాగే కొనసాగితే తెలుగు చిత్ర పరిశ్రమతో పాటుగా దీనిపై ఆధారపడి జీవించే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగానే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి స్వయానా బంధువు అయిన మంచు విష్ణు.. దీనిపై చొరవ తీసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అంటున్నారు. రాబోయే రోజుల్లో భారీ బడ్జెట్‌ చిత్రాలు విడుదలలు ప్లాన్ చేసుకున్న దృష్ట్యా.. వీలైనంత త్వరగా ఈ వ్యవహారానికి తెర దించాలని కోరుతున్నారు. ఇప్పటికే చిరంజీవి చొరవతో తెలంగాణలో సినిమా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తూ జీవో జారీ చేసింది. ఈ క్రమంలో మంచు విష్ణు ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి సినీ పరిశ్రమకు మేలు జరిగేలా చూడాలని సోషల్ మీడియాలో డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. మరి త్వరలోనే దీనిపై విష్ణు స్పందిస్తారేమో చూడాలి.




Full View
Tags:    

Similar News