వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేసిన 'గబ్బర్ సింగ్' దర్శక నిర్మాతలు..!

Update: 2020-07-10 02:56 GMT
ఇటీవల 'గబ్బర్ సింగ్' దర్శక నిర్మాతలు హరీష్ శంకర్ - బండ్ల గణేష్ మధ్య వివాదం చోటు చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 'గబ్బర్ సింగ్' మూవీ విడుదలై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరికీ థ్యాంక్స్ చెప్తూ డైరెక్టర్ హరీష్ శంకర్ ట్విట్టర్ లో ఒక లెటర్ విడుదల చేయగా.. అందులో ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ పేరు మరియు హీరోయిన్ శృతిహాసన్ పేర్లు మాత్రం ప్రస్తావించలేదు. దీంతో బండ్ల గణేష్ దీనిపై హార్ట్ అవడమే కాకుండా హరీష్ శంకర్ రీమేక్ సినిమాలను మాత్రమే తీయగలడని.. ఇక ఆయనతో సినిమాలు తీయమని.. పలు ఘాటైన వ్యాఖ్యలు చేసారు. ఇక అప్పటి నుండి ఈ వివాదం కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ ఇష్యూపై మాట్లాడారు బండ్ల గణేష్.

కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న బండ్ల గణేష్ ఓ వెబ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడుతూ.. ''అది అన్నదమ్ముల మధ్య అప్పుడప్పుడు వచ్చే చిన్న గొడవ లాంటిది. ఆయన మంచి డైరెక్టర్. అంత పెద్ద డైరెక్టర్ అవకాశం ఇస్తే సినిమా ఎందుకు చేయను. ఆయన అవకాశం ఇవ్వడమే అదృష్టం. ఆ రోజేదో కోపంలో అలా అనేశాను. అప్పుడప్పుడు ఇంట్లో పిల్లల మీద భార్య మీద కూడా కోప్పడుతుంటా. తల్లి మీద కూడా అలిగి రెండు రోజులు మాట్లాడకుండా ఉంటాం. అంత మాత్రాన వారు మనవాళ్ళు కాకుండా పోతారా? అన్నదమ్ముల్లాంటోల్లం ఏదో కోపంలో అరుచుకున్నాం. చిన్న చిన్న ఈగోలతో వచ్చిన గొడవ. దాని గురించి ఆలోచించడం కూడా టైం వేస్ట్'' అని చెప్పుకొచ్చారు.

ఇక బండ్ల గణేష్ మాట్లాడిన దానిపై డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ''నేను ఎప్పుడూ బండ్ల గణేష్ ని గౌరవిస్తాను.. గబ్బర్ సింగ్ కోసం మాత్రమే కాదు, మిరపకాయ్ కంటే ముందు కూడా అతను నాతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.. అతను త్వరగా కోలుకున్నందుకు హ్యాపీ'' అని ట్వీట్ చేశారు. దీంతో 'గబ్బర్ సింగ్' దర్శక నిర్మాతల మధ్య చోటు చేసుకున్న వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది. మరి హరీష్ శంకర్ - బండ్ల గణేష్ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందేమో చూడాలి.



Tags:    

Similar News