తమ్మారెడ్డి వ్యాఖ్యలు గట్టిగా తగిలినట్లున్నాయే..

Update: 2017-12-11 06:39 GMT
‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా అవసరం లేదేమో.. ఇండస్ట్రీ ఏపీకి రావాలని వాళ్లకు లేదేమో.. వాళ్లకు మా అవసరం లేదు.. మాకు వాళ్లవసరం లేదు. మేం హ్యాపీగా హైదరాబాద్ లోనే ఉంటాం’’ అంటూ ఇటీవలే టాలీవుడ్ సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఓవైపు తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి రావాలని ప్రకటనలు మాత్రమే చేస్తూ.. ఆ దిశగా ఎలాంటి చర్యలూ చేపట్టలేకపోతోందన్న రీతిలో ఆయన మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు చంద్రబాబు సర్కారులో కొంచెం కదలిక తెచ్చినట్లున్నాయి. ‘హలో’ ఆడియో వేడుకలో మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడిందాన్ని బట్టి తమ్మారెడ్డి వ్యాఖ్యలపై ప్రభుత్వంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

తెలుగు సినీ పరిశ్రమ విశాఖపట్నానికి వచ్చేయాలని.. తమ వైపు నుంచి ఏం కావాలంటే అది సమకూరుస్తామని గంటా శ్రీనివాసరావు చెప్పడం విశేషం. ఒకప్పుడు మద్రాస్ నుంచి హైదరాబాదుకు తెలుగు సినీ పరిశ్రమ రావడంలో ఏఎన్నార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అదే రీతిలో నాగార్జున హైదరాబాద్ నుంచి విశాఖకు ఇండస్ట్రీని తీసుకొచ్చే దిశగా ముందడుగు వేయాలని ఆయనన్నారు. విశాఖలో షూటింగ్ ఏ ఇబ్బంది లేకుండా జరిగే దిశగా.. షూటింగ్ అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని అమలు చేయడమే కాక.. అందుకోసం ప్రత్యేకంగా ఓ అధికారిని కూడా నియమించనున్నట్లు గంటా తెలిపారు. పోలీస్ అనుమతులైనా.. ఇంకేవైనా చాలా సులువుగా వచ్చేలా చూస్తామని.. అన్ని రకాలుగా సహకారం అందిస్తామని ఆయనన్నారు. విశాఖలో షూటింగ్ చేసుకోవడానికి ఎన్నో మంచి ప్రదేశాలున్నాయని.. బీచ్ అందాలు.. ఇండస్ట్రియల్ జోన్స్.. రూరల్ బ్యాక్ డ్రాప్ ఉన్న ప్రాంతాలు.. ఇంకా చాలా రకాల ఆకర్షణలున్నాయని గంటా అన్నారు. మొత్తానికి మొన్నటి తమ్మారెడ్డి వ్యాఖ్యలతో ఏపీ ప్రభుత్వంలో కదలిక వచ్చి.. ‘హలో’ ఆడియో వేడుకను వేదిక చేసుకుని సినీ పరిశ్రమకు తాము ఫుల్ సపోర్ట్ ఇస్తామని చెప్పే ప్రయత్నం చేసినట్లున్నారు.
Tags:    

Similar News