కమల్-గౌతమ్.. ఇక వేర్వేరు

Update: 2016-11-01 11:03 GMT
కమల్ హాసన్.. గౌతమిల బంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరూ వేరే వ్యక్తుల్ని పెళ్లి చేసుకున్నారు. వాళ్ల నుంచి విడిపోయారు. కొంచెం లేటు వయసులో సహజీవనం మొదలుపెట్టారు. ఇద్దరి వేవ్ లెంగ్త్ కలవడంతో కలిసి బతుకుతున్నారు. వారి పిల్లలు కూడా ఈ బంధాన్ని ఆమోదించారు. ఐతే 13 ఏళ్లుగా ఏ అరమరికలు లేకుండా సాగుతున్న వీరి బంధానికి అనూహ్యంగా తెరపడింది. తాను.. కమల్ విడిపోతున్నట్లు గౌతమి ఈ రోజు సోషల్ మీడియాలో ఓ పోస్టు ద్వారా వెల్లడించింది.

కమల్ హాసన్ తో 13 ఏళ్ల తన బంధానికి తెరపడిందని.. తప్పనిసరి పరిస్థితుల్లోనే తామిద్దరం విడిపోయామని గౌతమి తెలిపింది. ఇది తన జీవితంలోనే అత్యంత బాధకరమైన నిర్ణయమని ఆమె వెల్లడించింది. ఇన్నేళ్లలో కమల్ తనకు ఎంతగానో అండగా నిలిచారని.. ఐతే ఇప్పుడు విడిపోవాల్సిన సమయం వచ్చింది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నామని గౌతమి తెలిపింది. కమల్ కు తాను వ్యక్తిగతంగా కూడా పెద్ద అభిమానినని.. ఆయన్ని ఆరాధిస్తానని.. ఆయన నుంచి మున్ముందు మరిన్ని మంచి సినిమాలు వస్తాయని చెబుతూ.. ఒక పారాగ్రాఫ్ మొత్తం ఆయన్ని పొగిడేందుకే కేటాయించింది గౌతమి. సినిమాల్లో ఉన్న రోజుల్లోనే కమల్.. గౌతమి మధ్య మంచి అనుబంధం ఉండేది. ఐతే హీరోయిన్ గా ఓ స్థాయిలో ఉండగానే పెళ్లి చేసుకుంది గౌతమి. ఆ తర్వాత విడాకులు తీసుకుంది. ఆ సమయంలోనే ఆమె క్యాన్సర్ బారిన కూడా పడింది. అప్పుడు కమలే ఆమెకు అండగా నిలిచాడు. ఆమెకు సుబ్బు లక్ష్మి అనే 17 ఏళ్ల కూతురుంది. ఆమెను కూడా కమల్ తన సొంత కూతురిలాగే చూసుకున్నాడు. మంచి అండర్ స్టాండింగ్ ఉన్న జంటలా కనిపించిన కమల్.. గౌతమ్ ఇప్పుడిలా ఎందుకు విడిపోతున్నారో అర్థం కాని విషయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News