'నాయత్తు' రీమేక్ షూటింగ్ మొదలెట్టేస్తున్న గీతా ఆర్ట్స్!

Update: 2021-11-08 07:30 GMT
మలయాళ ప్రేక్షకులు కథలో సహజత్వాన్ని ఇష్టపడతారు. కథానాయకుడు తమ మధ్యలో నుంచి     తెరపైకి వెళ్లినవాడిగా వాళ్లకి కనిపించాలి. ఆకాశం నుంచి ఊడిపడినట్టుగా అనిపిస్తే మాత్రం వాళ్లు ఒప్పుకోరు. అందువల్లనే వాస్తవానికి దగ్గరగా వాళ్ల కథలు నడుస్తుంటాయి .. పాత్రలు పరిగెడుతూ ఉంటాయి. అక్కడి దర్శకులు కూడా ఒక చిన్న సంఘటనను తీసుకుని దాని చుట్టూ ఆసక్తికరంగా కథను అల్లుతూ వెళుతుంటారు. భారీ ఛేంజింగులు గట్రా లేకుండానే కథ అనూహ్యమైన మలుపులు తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ తరహా కథలను తెలుగు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు.

అందువల్లనే మలయాళ కథలు తెలుగు తెర దిశగా కదులుతున్నాయి. ఒక్కొక్కటిగా తెలుగులోకి రీమేక్ అవుతున్నాయి. వెంకటేశ్ చేసిన 'దృశ్యం 2' .. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న 'గాడ్ ఫాదర్' .. పవన్ కల్యాణ్ చేస్తున్న 'భీమ్లా నాయక్' మలయాళ ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న కథలే. ఇక ఈ నేపథ్యంలోనే మరో మలయాళ కథ తెలుగు రీమేక్ గా రూపొందనుంది. ఆ కథ రేపు సెట్స్ పైకి వెళ్లనుంది. మలయాళంలో ఆ సినిమా పేరే 'నాయత్తు'. ఈ ఏడాది ప్రథమార్థంలో అక్కడ విడుదలైన ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

గీతా ఆర్ట్స్ 2వారు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అంజలి .. ప్రియదర్శి .. రావు రమేశ్ ప్రధానమైన పాత్రలను పోషించనున్నారు. రేపటి నుంచి ఈ సినిమా షూటింగు మొదలుకానుంది. గీతా ఆర్ట్స్ 2 వారు ఒక సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నారంటేనే ఆ కథలో ఏదో విషయం ఉందనే నమ్మకం ప్రేక్షకులకు కలుగుతుంది. కథ కనిపించని సబ్జెక్ట్ లను వాళ్లు ఎప్పుడూ దూరంగానే పెడతారు. అలాంటి వారు 'నాయత్తు' సినిమాను ఎందుకు రీమేక్ చేయకులనుకుంటున్నారు? దాని ప్రత్యేకత ఏమిటి? పొంతనలేని పాత్రలతో నడిచే కథ ఏంటి? అనే సందేహాలు తలెత్తడం సహజం.

నిజానికి ఇది చాలా చాలా చిన్న సినిమా .. చాలా తక్కువ రోజులలో .. తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసే సినిమా.  హీరో .. హీరోయిన్ .. పాటలు .. కామెడీ మచ్చుకు కూడా కనిపించవు. అయినా అవి లేవనే ఆలోచన కూడా రాదు. అంత పట్టుగా ఈ కథ నడుస్తుంది. తమ తప్పులేకపోయినా ఒక యాక్సిడెంట్ కేసులో ముగ్గురు పోలీస్ లను దోషులుగా భావించి, అదే డిపార్టుమెంట్ వారు వెంటాడుతూ ఉంటారు. వాళ్ల బారి నుంచి తప్పించుకోవడానికి ఆ ముగ్గురు పోలీసులు చేసిన ప్రయత్నాలు .. ఎదురైనా పరిణామాలే ఈ కథ. తెలుగు ప్రేక్షకులకు ఈ కథ ఎంతవరకూ కనెక్ట్ అవుతుందో చూడాలి మరి.
Tags:    

Similar News