స్ఫూర్తి నింపుతున్న గీతా ఆర్ట్స్ సాయం

Update: 2019-05-02 12:58 GMT
సినిమాలు తీయ‌డంలోనే కాదు.. సాయం చేయ‌డంలోనూ క్రియేటివ్ గా వెళ్లాలి. ఇదీ నేటి ట్రెండ్. గత ఏడాది మండే ఎండ‌ల్లో ఐస్ క్రీమ్ బ‌ళ్లు తోలుకెళ్లి థియేట‌ర్ల ద‌గ్గ‌ర పంచాడు రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఆ దెబ్బ‌కు జంక్ష‌న్లు జామ్ అయిపోయాయి. అభిమానులు మీద ప‌డి మ‌రీ ఐస్ క్రీమ్ లు లాగించారు. దాంతో దేవ‌ర‌కొండ‌కు కావాల్సినంత ప్ర‌చారం ద‌క్కింది. అభిమానుల‌కు ఉత్సాహం పెరిగింది.

కేవ‌లం సినీహీరోలే కాదు.. ఇత‌ర‌త్రా రంగాల్లో ప్ర‌ముఖులు ర‌క‌ర‌కాలుగా సాయానికి ముందుకొస్తున్నారు. వేస‌వి వ‌చ్చిందంటే మార్గం మ‌ధ్య‌లో కుండ నీళ్లు ఉచితంగా తాగే వెసులుబాటు ను కొంద‌రు క‌ల్పిస్తున్నారు. ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌లు ఈ త‌ర‌హా సాయానికి ముందుకొస్తున్నాయి. నాయ‌కులు కొన్ని ఏరియాల్లో ఉచితంగా నీటి ట్యాంక‌ర్లు స‌ర‌ఫ‌రా చేస్తున్న వైనం చూస్తున్నాం. ఇక‌పోతే మూవీ ఆర్టిస్టుల సంఘం స‌హా చిత్ర‌పురి.. ఫెడ‌రేష‌న్ వాళ్లు కార్మికుల కోసం ఈ త‌ర‌హా ప్లాన్స్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.

అయితే వీళ్లంద‌రి కంటే డిఫ‌రెంటుగా ఆలోచించింది ప్ర‌ఖ్యాత సినీనిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌. ఎండ‌ల్లో గొంతెండిపోయే ట్రాఫిక్  కానిస్టేబుల్స్.. జీహెచ్ ఎంసీ  కార్మికుల‌కు మ‌జ్జిగ బాటిల్స్ ని స‌ర‌ఫ‌రా చేస్తూ శ‌హ‌భాష్ అనిపిస్తోంది. ఓవైపు దాహం తీరుతుంది.. మ‌రోవైపు ఆరోగ్యానికి మేలు! ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న చందంగా గీతా టీమ్ సాయానికి దిగ‌డం హైద‌రాబాద్ లో అన్ని రోడ్ల‌పై ద‌ర్శ‌న‌మిస్తోంది. ప‌నిలో ప‌నిగా ఈ బాటిల్స్ పై ఓ లేబుల్ ప్ర‌త్యేకంగా ఆక‌ర్షిస్తోంది. అల్లు ఎంట‌ర్ టైన్ మెంట్ ఎల్ ఎల్ పి పేరుతో ఇప్ప‌టి నుంచే ఓ కొత్త లేబుల్ ని గీతా ఆర్ట్స్ సంస్థ పాపుల‌ర్ చేయ‌డం ఆస‌క్తి ని రేకెత్తిస్తోంది. అల్లు అర‌వింద్ - అల్లు అర్జున్- శిరీష్ స‌హా ఇత‌ర భాగ‌స్వాములు క‌లిసి స్థాపించిన సంస్థ తాలూకా టైటిల్‌ ఇద‌ని తెలుస్తోంది.


Tags:    

Similar News