తెలుగు తెరకి ఎంతోమంది అందమైన కథానాయికలు పరిచయమయ్యారు. ఒక్కొక్కరి అందంలో ఒక్కో ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. కోలకళ్లతో కొందరు ... కొంటె చూపులతో కొందరు .. మంత్రం వేయకుండానే మనసులను మాయ చేసే నవ్వుతో కొందరు .. అజంతా గుహల్లో ఉక్కబోతగా ఉందని చెప్పేసి చల్లటి గాలికి బయటికి వచ్చారేమో అనుకునే సౌందర్య శిల్పాల్లా మరికొందరు ప్రేక్షకులను అలరిస్తూ .. ఆకట్టుకుంటూ వచ్చారు. అలాంటి కథానాయికలందరిలో జెనీలియా స్థానం ప్రత్యేకమని చెప్పాలి.
జెనీలియా అంటే అందం .. అంతకు మించిన అల్లరి. తెరపై ఆమె అందంతో ఆకట్టుకుందా? అల్లరితో మనసులను కొల్లగొట్టిందా? అంటే చెప్పడం కష్టం. అల్లరి అంతా ఆమె కళ్లలోనే దాగి ఉంటుంది .. ఆ కళ్లు వేసే చిలిపి చూపుల కోలాటానికి ఎంతటివారి హృదయాలైనా చిక్కుబడిపోవలసిందే. ఆమెపై అభిమానం .. ఆరాధన చిక్కబడిపోవాలసిందే. అందుకే ఆమె తెలుగు సినిమాలు చేయడం మానేసి చాలాకాలమైనా, తెరపై ఆమె చేసిన అందమైన అల్లరి .. సంతోషాల సందడిని ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు.
జెనీలియా ముందుగా హిందీ సినిమాతోనే తన కెరియర్ ను మొదలుపెట్టింది. ఆ తరువాత పెద్ద గ్యాప్ ఇవ్వకుండానే తమిళ .. తెలుగు సినిమాలకి కూడా పరిచయమైపోయింది. 'సత్యం' సినిమాలో తొలిసారిగా ఆమె తెలుగు తెరపై కనిపించింది. సన్నజాజి పువ్వులా .. దానిమ్మ మొగ్గలా పిల్ల భలే నాజూకుగా ఉందే అని అంతా అనుకున్నారు. కొండపల్లి బొమ్మవంటి ఈ పిల్లను కొలుస్తూ కూర్చోవడం కంటే కొలువేముంటుంది? అనుకుంటూ ఆరాధించడం మొదలుపెట్టారు.
'సై' .. 'హ్యాపీ' సినిమాలు విజయవంతం కావడంతో ఆమె క్రేజ్ రాకెట్ లాంచర్ లా దూసుకుపోయింది. సాధారణంగా కథానాయికలు తమ గ్లామర్ తో ఇతర కథానాయికలకు గట్టిపోటీ ఇస్తుంటారు. కానీ తన అల్లరితో పోటీ ఇచ్చిన నాయిక ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క జెనీలియానే. ఇక 'బొమ్మరిల్లు' సినిమా ఆమె కెరియర్ లోనే ఒక మేలైన మైలురాయి అని చెప్పాలి. ఈ సినిమాలో ఆమె పోషించిన 'హాసిని' పాత్రను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు.
జెనీలియా ఆకతాయితనంతో కూడిన అల్లరి పాత్రలకు మాత్రమే పనికి వస్తుందని అనుకున్న వాళ్లంతా, ఈ సినిమా చూసి ఆశ్చర్యపోయారు. ప్రకాశ్ రాజ్ .. జయసుధ వంటి సీనియర్ ఆర్టిస్టుల కాంబినేషన్లో చేసిన సీన్ ఆమె అసమానమైన నటనకు నిదర్శనమని చెప్పకతప్పదు. ఆ తరువాత కూడా 'ఢీ' .. 'రెఢీ' వంటి సూపర్ హిట్లను ఆమె తన ఖాతాలో వేసుకుని, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. వివాహమైన తరువాత ఆమె తన భర్త .. పిల్లలతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతోంది. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆమెకు శుభాకాంక్షలు తెలియజేద్దాం.