20 మంది సింగర్స్ కలిసి పాడిన 'గాడ్ ఫాదర్' పాట విన్నారా!

Update: 2022-10-03 14:34 GMT
మెగాస్టార్ చిరంజీవి నటించిన హై ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ''గాడ్ ఫాదర్''. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. ఇద్దరు మెగాస్టార్స్ తొలిసారిగా కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఇప్పటికే విడుదలైన 'గాడ్ ఫాదర్' సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 'తార్ మార్ తక్కర్ మార్'మరియు 'నజభజ' పాటలు విశేషంగా అలరించాయి. అయితే రిలీజ్ కు రెండు రోజులు ముందు ఇప్పుడు తాజాగా టైటిల్ సాంగ్ ను మేకర్స్ ఆవిష్కరించారు.

'ఏకో రాజా విశ్వరూపధారి.. శాసించే చక్రధారి.. అంతేలేని ఆధిపత్య శౌరి.. దండించే దండధారి..' అంటూ సాగిన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. 'గాడ్ ఫాదర్' సినిమాలో కథానాయకుడి పాత్రను హైలైట్ చేసే ఈ లిరికల్ వీడియో గూస్ బమ్స్ ని తెప్పిస్తోంది.

ఎస్ఎస్ థమన్ 'గాడ్ ఫాదర్' టైటిల్ సాంగ్ కు ట్యూన్ సమకూర్చగా.. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో రాణిస్తున్న దాదాపు 20 మంది గాయనీ గాయకులు కలిసి ఈ గీతాన్ని ఆలపించడం విశేషం.

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'లూసిఫర్' మూవీకి అధికారిక రీమేక్ గా ''గాడ్ ఫాదర్'' తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో నయనతార - సత్యదేవ్ కీలక పాత్రలు పోషించగా.. సముద్రఖని - సునీల్ - పూరీ జగన్నాథ్ - బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై ఆర్బి చౌదరి మరియు ఎన్వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వాకాడ అప్పారావు సహ నిర్మాత. లక్ష్మీ భూపాల్ ఈ సినిమాలో డైలాగ్స్ రాయగా.. నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించారు. సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.

ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న 'గాడ్ ఫాదర్' సినిమా దసరా పండుగ సందర్భంగా విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. తెలుగుతో పాటుగా పలు ప్రధాన భారతీయ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News