కేజీఎఫ్ బ్యూటీకి పెరుగుతున్న ఆఫర్లు!

Update: 2022-04-16 23:30 GMT
టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో బాలీవుడ్ భామలు ఎక్కువగా దిగుమతి అవుతున్నారు. పాన్ ఇండియా సినిమాల జోరు పెరగడంతో, బాలీవుడ్ భామలకు డిమాండ్ పెరిగిపోయింది. అడిగినంత పారితోషికం అవలీలగా వచ్చి పడుతుంటే, భాష ఏదైతే ఏవుంది .. అది మన భాషలోకి మారిపోయి మన ప్రేక్షకుల ముందుకు కూడా వస్తుంది కదా! అనే ఉద్దేశంతో  ఒప్పేసుకుంటున్నారు. పాన్ ఇండియా సినిమా వరకూ టాలీవుడ్ ను షేక్ చేసిన మలయాళ బ్యూటీలు ఇప్పుడు ఆలోచలో పడ్డారు. బాలీవుడ్ భామల పోటీని ఎలా తట్టుకోవాలా అని చూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే వాళ్లకి మరో వైపు నుంచి ప్రమాదం ముంచుకు వచ్చింది .. ఆ ప్రమాదం పేరే శ్రీనిధి శెట్టి. ఇప్పుడు యూత్ నోటి వెంట ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. 'కేజీఎఫ్' సినిమాతో ఈ పిల్ల కుర్రాళ్ల కలలకి కళ్లెం తీసేసింది.

వాళ్ల ఊహలు తనని దాటేసి వెళ్లకుండా ఉచ్చు పన్నేసింది. కన్నడలోనే కాదు .. అన్ని ఇండస్ట్రీలను ఈ అమ్మాయి అలుముకోవడం ఖాయమనుకున్నారు. వరుస అవకాశాలతో దూసుకుపోవడం ఖాయమని భావించారు. కానీ ఈ సుందరి ఆ స్థాయి స్పీడ్  చూపించలేదు. 'కేజీఎఫ్ 2' తో పాటు తమిళంలో 'కోబ్రా' మాత్రమే చేసింది.

యష్ జోడీగా శ్రీనిధి శెట్టి నటించిన 'కేజీఎఫ్ 2' ఈ నెల 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా విజయవిహారం చేస్తోంది. తొలి రోజునే 134.5 కోట్లను వసూలు చేసింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో మరోసారి శ్రీనిధి శెట్టి అందరి కళ్లలో పడింది.

ఫస్టు పార్టులో కంటే అందంగా ఆమె ఈ సినిమాలో మెరిసింది. ఆకర్షణీయమైన రూపంతో ఆకట్టుకుంది. అందమైన కళ్లతో  హావభావాలను అద్భుతంగా పలికించింది. ముఖ్యంగా 'మెహబూబా' అనే పాటలో ఆమె మరింత గ్లామరస్ గా కనిపించింది.

దాంతో కన్నడ నుంచి మాత్రమే కాకుండా, వివిధ భాషల్లోని దర్శక నిర్మాతల నుంచి ఆమెకి వరుస అవకాశాలు వచ్చి పడుతున్నాయని అంటున్నారు. తమిళ .. హిందీ ఇండస్ట్రీల నుంచి మాత్రమే కాకుండా తెలుగులోని పెద్ద బ్యానర్ల నుంచి కూడా ఛాన్సులు వెళుతున్నట్టుగా సమాచారం.  తెలుగులో ఒకరిద్దరు స్టార్ హీరోల సినిమాలకు ఆమె సైన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. తమిళంలో విక్రమ్ తో చేసిన ' కోబ్రా' మే 26వ తేదీన విడుదల కానుంది.

ఈ సినిమా హిట్ అయితే ఆమెకి అక్కడ డిమాండ్ పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే శ్రీనిధి శెట్టి దశ .. దాదాపుగా తిరిగిపోయినట్టుగా అనిపించడం లేదూ!
Tags:    

Similar News