ఇందులో నాని క్రెడిట్‌ ఎంత?

Update: 2015-10-15 15:34 GMT
రామ్‌ చరణ్‌ లాంటి పెద్ద స్టార్‌ హీరోకి సాధ్యం కాని 'యుఎస్‌ మిలియన్‌ క్లబ్‌'ను అలవోకగా అందుకున్నాడు నాని. 'భలే భలే మగాడివోయ్‌' సినిమాతో నాని సాధించిన ఘనతలివి. సినిమా టైటిల్స్‌లో ఏదో సరదాకి 'నేచురల్‌ స్టార్‌' అని నాని పేరు ముందు వేశారు కానీ.. విడుదల తర్వాత చూస్తే అతను నిజంగానే ఓ స్టార్‌ హీరోలాగే వసూళ్లు సాధించాడు. ఐతే ఇందులో నాని క్రెడిట్‌ ఎంత? 'భలే భలే మగాడివోయ్‌' కలెక్షన్లను చూసి.. అతడి తర్వాతి సినిమా మీద భారీ బడ్జెట్‌ పెట్టేయొచ్చా? స్టార్‌ హీరోల్లా నాని కూడా ఓపెనింగ్స్‌ తెచ్చుకోగలడా? ఇలాంటి ప్రశ్నలెన్నో తలెత్తుతున్నాయి.

సందేహమే లేదు. 'భలే భలే మగాడివోయ్‌' అంత పెద్ద హిట్టవడంలో నాని పాత్ర చాలా కీలకం. నాని కాకుండా మరో హీరో ఆ మతిమరుపు పాత్ర పోషించి ఉంటే అదంతగా పేలేది కాదు. సినిమా అంతగా జనాల్ని ఆకట్టుకునేది కాదు. కాబట్టి సక్సెస్‌ క్రెడిట్లో నాని వాటా పెద్దదే. ఐతే అంతమాత్రాన 'భలే భలే మగాడివోయ్‌' సినిమాను ప్రామాణికంగా తీసుకుని నాని కానీ, అతడి నిర్మాతలు కానీ అతి చేస్తే మాత్రం కష్టమే. మంచి కంటెంట్‌ ఉంటే దాని స్థాయిని ఎంతో పెంచగలడు నాని. అంతే తప్ప ఒంటి చేత్తో బాక్సాఫీస్‌ బండిని లాగేయలేడు. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్‌ రాబట్టలేడు. ఈ వాస్తవాన్ని గ్రహించి జాగ్రత్తగా అడుగులు వేయాలతను. సినిమాలు చేయడంలో సెలక్టివ్‌గా ఉంటూ.. 'భలే భలే మగాడివోయ్‌' లాంటి ఇంకో రెండు మూడు హిట్లు ఇచ్చాడంటే.. అతడు తర్వాతి దశకు వెళ్తాడు. కాబట్టి అతడి కెరీర్‌కు తర్వాతి సినిమాలు చాలా కీలకం. మరి మన నేచురల్‌ స్టార్‌ నుంచి ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి.
Tags:    

Similar News