'బ్రహ్మస్త్ర' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ ఇవే!

Update: 2022-09-03 09:30 GMT
బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో వచ్చిన భారీ చిత్రాలలో 'బ్రహ్మాస్త్ర' కూడా చేరబోతోంది. కరణ్ జొహార్  .. ఆయన భాగస్వాములు కలిసి వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. అయాన్ ముఖర్జీ ఈ  సినిమాకి దర్శకత్వం వహించాడు. రణ్ బీర్ కపూర్ .. అలియా భట్ జంటగా నటించిన ఈ సినిమాలో, నాగార్జున .. డింపుల్ కపాడియా ... మౌని రాయ్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ సోషియో ఫాంటసీ సినిమాను ఈ నెల 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాను రాజమౌళి ప్రెజెంట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న 'పార్క్ హయత్ హోటల్' లో నిర్వహించారు. ముందుగా ఈ వేడుకను రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా  నిర్వహించాలనుకున్నారు. అయితే 'గణపతి నవరాత్రి ఉత్సవాలు' సందర్భం కావడం వలన  తగినంత పోలీస్ ఫోర్స్ ను ఇవ్వలేమని డిపార్టుమెంటు చెప్పడంతో, ఈవెంట్ ను 'పార్క్ హయాత్ హోటల్' లో  కేవలం మీడియా వారి సమక్షంలోనే సింపుల్ గా కానిచ్చేశారు.

ఎన్టీఆర్ తనని ఎక్కువసేపు మాట్లాడవద్దని చెప్పాడనీ .. అలాగే చేయడానికి ప్రయత్నిస్తానని అంటూ  రాజమౌళి తన ప్రసంగాన్ని మొదలు పెట్టడం విశేషం. కరణ్ వినాయకుడి పూజ సరిగ్గా  చేయకపోవడం వల్లనే ఇలా జరిగిందంటూ నవ్వ్వులు పూయించడం మరో విశేషం.

ఇక ఎన్టీఆర్ మాట్లాడూతూ,  నాగార్జున బాబాయ్ హిందీలో చేసినా 'ఖుదాగవా' తోనే  హిందీ సినిమాలు చూడటం మొదలైందనీ, ఆయన గురించి మాట్లాడటానికి తన వయసు సరిపోదంటూ అభిమానం చాటుకోవడం స్పీచ్ లో హైలైట్ గా నిలిచింది. ఇక నాగార్జున కూడా ఆ రోజున హరికృష్ణ జయంతి అంటూ ఆయనను స్మరించుకుంటూ ప్రసంగాన్ని మొదలు పెట్టడం మరో విశేషం.

అలియా తన ప్రసంగంలో ఎన్టీఆర్ ... నాగార్జున ... రాజమౌళిని ఆకాశానికి ఎత్తేసింది. 'ఆర్ ఆర్ ఆర్' తో రాజమౌళి హీరోయిన్ అనిపించుకోవడం తన అదృష్టమని చెప్పింది. కరణ్  జొహార్ సినిమాలో ఒక భాగమైనందుకు ఆనందంగా ఉందని అంది. ఈవెంట్ కాస్త 'డల్' అనిపిస్తోంది .. కాస్త హుషారును యాడ్ చేద్దామంటూ ఆమె ఈ సినిమాలోని పాటను తెలుగులో పాడటం హైలైట్స్ ల్లో ఒకటిగా నిలిచింది. తప్పులు లేకుండా .. తడబడకుండా పాడేసి మంచి మార్కులు కొట్టేసింది.

ఇక తానేమీ తక్కువ తినలేదంటూ రణ్ బీర్ కూడా తెలుగులో తన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. "అందరికీ నమస్కారం .. బాగున్నారా?  నా కెరియర్లో బిగ్గెస్ట్ సినిమా 'బ్రహ్మాస్త్రం'. బిగ్గెస్ట్ హీరోయిన్ ఉన్నది కూడా ఇదే. మంచి సినిమాలను ఎప్పుడూ ఎంకరేజ్ చేసే తెలుగు ఆడియన్స్ కి పెద్ద థ్యాంక్స్. మా 'బ్రహ్మాస్త్రం' కూడా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన అక్కినేని ఫ్యాన్స్ కీ .. నందమూరి ఫ్యాన్స్ కి .. రాజామౌళి గారి ఫ్యాన్స్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 'బ్రహ్మాస్త్ర' పార్టు 2 సమయానికి తెలుగు బాగా నేర్చుకుంటాను" అంటూ స్పష్టంగా మాట్లాడి ఆకట్టుకున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News