నేను పవన్ సార్ కి వ్యతిరేకిని కాదు: మౌనికా రెడ్డి

Update: 2022-02-10 09:30 GMT
మీడియాతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి .. మీడియా కెమెరాల ముందు చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయం చాలామంది రాజకీయనాయకులకు తెలుసు. బయటి వ్యక్తులకు అందుకు సంబంధించిన అవగాహన అంతగా ఉండదు.

మీడియాతో ఆవేశంతో మాట్లాడతారు. అప్పుడు తమ అభిప్రాయం చెబుతున్నామని అనుకుంటారు .. ఆలోచనా విధానాన్ని ఆవిష్కరించడంలో తప్పులేదని అనుకుంటారు. కానీ ఆ సమయంలో చేసిన వ్యాఖ్యలు ఎక్కడో ఒక చోట ఇబ్బంది పెడతాయనే విషయాన్ని మాత్రం మరిచిపతుంటారు.  

అలాంటి ఒక విషయమే వెబ్ సిరీస్ లతో పాప్యులర్ అయిన మౌనిక రెడ్డికి అనుభవంలోకి వచ్చింది. మౌనిక రెడ్డి గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని 'కొలిపర' గ్రామానికి చెందిన అమ్మాయి.

గుంటూరు .. తిరుపతి .. వైజాగ్ లలో ఆమె విద్యాభ్యాసం కొనసాగింది. ఆ తరువాత హైదరాబాద్ లో ఉద్యోగం కూడా సంపాదించింది. ఉద్యోగం చేస్తూ ఉండగానే . అప్పటివరకూ హాబీగా అనుకున్న యాక్టింగ్ ను ఆమె సీరియస్ గా తీసుకుంది. అలా ఆమెకి 'అమ్మాయి క్యూటు అబ్బాయి నాటు' అనే వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చింది. ఆ వెబ్ సిరీస్ ఆమెకి మంచి గుర్తింపు తెచ్చింది.

ఆ తరువాత షణ్ముఖ్ జస్వంత్ తో చేసిన 'సూర్య' వెబ్ సిరీస్ ఆమె క్రేజ్ ను మరింత పెంచింది. ఇక ఇప్పుడు మౌనికా రెడ్డిని ఎక్కడికి వెళ్లినా గుర్తుపట్టేంత క్రేజ్ వచ్చింది. అయితే గతంలో ఆమె ఒక సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ, 'ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ గెలవాలి' అనే అభిప్రాయాన్ని బలంగా చెప్పింది.

 ఆ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మాట అన్నది ఎవరో కాదు అంటూ .. ఇప్పటి మౌనిక రెడ్డి ఫొటోను జోడించి వదులుతున్నారు. అంతేకాదు పవన్ కి వ్యతిరేకి అయిన ఆమెకి 'భీమ్లా నాయక్'లో ఛాన్స్ ఎలా ఇచ్చారని క్వశ్చన్ చేస్తున్నారు.

తనని పవన్ కి వ్యతిరేకిగా ముద్రవేస్తూ సోషల్ మీడియాలో బలమైన ప్రచారమే నడుస్తూ ఉండటంతో, తాజాగా మౌనికా రెడ్డి స్పందించింది. తన కాలేజ్ రోజుల్లో .. అప్పటి పరిస్థితులపై తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగిందని ఆమె చెప్పింది. అలా పబ్లిక్ లో మాట్లాడటం వలన వచ్చే సమస్యలపై అవగాహన కూడా లేని వయసు అది. 2015లో జరిగిన ఆ సంఘటనను ఇప్పుడు బయటికి తీసి ఇలా ప్రచారం చేయడం సరికాదని అంది. అయినా అప్పటి నా మాటలు ఎవరి మనోభావాలనైనా గాయపరిస్తే క్షమించవలససిందిగా కోరుతున్నాను" అంటూ రాసుకొచ్చింది.   
Tags:    

Similar News