బిగ్‌ బాస్‌ చూసేంత టైం లేదంది

Update: 2019-08-09 05:21 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 సక్సెస్‌ ఫుల్‌ గా రన్‌ అవుతుంది. మొదటి రెండు సీజన్‌ లతో పోల్చితే ఈసారి మంచి టీఆర్పీ రేటింగ్‌ వస్తుంది. ముఖ్యంగా బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్‌ విషయంలో ప్రేక్షకులు చాలా పాజిటివ్‌ గా ఉన్నారు. వీకెండ్స్‌ లో మాత్రమే కాకుండా వీక్‌ డేస్‌ లో కూడా మంచి రేటింగ్‌ ను షో దక్కించుకుంటుంది. తాజాగా ఈ షో పై జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ స్పందించింది.

జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా హైదరాబాద్‌ లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో అనసూయ పాల్గొంది. ఈ సందర్బంగా ఒక ఛానెల్‌ తో మాట్లాడుతూ వ్యక్తిగతంగా నాకు చేనేత వస్త్రాలు ధరించడం అంటే చాలా ఇష్టం. నేను పోచంపల్లి బిడ్డను. చేనేత వస్త్రాలు నాకు చాలా కంఫర్ట్‌ గా అనిపిస్తాయి అంది. ఇక బిగ్‌ బాస్‌ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం నేను 'కథనం' చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాను. కథనం కారణంగా ప్రస్తుతానికి నేను బిగ్‌ బాస్‌ ను చూడలేక పోతున్నాను. అయితే బిగ్‌ బాస్‌ ప్రోమోలు మాత్రం రెగ్యులర్‌ గా చూస్తూ వస్తున్నాను. బిగ్‌ బాస్‌ లో ఉన్న నా స్నేహితులందరికి కూడా శుభాకాంక్షలు. నాకు బిగ్‌ బాస్‌ షో లో పార్టిసిపెంట్‌ చేసేంత సమయం మరియు తీరిక లేదని అనసూయ చెప్పుకొచ్చింది.

ఇక తన కథనం చిత్రం గురించి స్పందించిన అనసూయ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుండి డైరెక్టర్‌ గా అయ్యేందుకు ఒక యువతి చేసిన ప్రయత్నం ఏంటీ ఆ క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏంటీ అనేది సినిమా కథాంశంగా ఉంటుంది. ఇలాంటి విభిన్నమైన కథల్లో నటించడం అంటే నాకు చాలా ఇష్టం. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందంటూ అనసూయ చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News