ఫోటో స్టోరి: IAF అధికారి .. టామ్ క్రూజ్ బ్ర‌ద‌ర్ లా ఉన్నాడు!

Update: 2023-04-07 09:17 GMT
విమానాలపై ర‌య్ మంటూ దూసుకెళ్ల‌డం.. గ‌గ‌న‌త‌లంలో అరివీర‌భ‌యంక‌ర విన్యాసాల‌తో గ‌గుర్పాటుకు గురి చేయడం హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ కి వెన్న‌తో పెట్టిన విద్య‌. వీఎఫ్ ఎక్స్ మాయాజాలం ఎంత ప‌ని చేసినా టామ్ కొన్ని రియ‌ల్ స్టంట్స్ తో యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్ల‌కే చెమ‌ట‌లు ప‌ట్టించేస్తాడ‌న్న టాక్ ఉంది. ఇటీవ‌లే టామ్ క్రూజ్ న‌టించిన టాప్ గ‌న్- మూవెరిక్ క‌రోనా వేవ్ త‌ర్వాత వ‌చ్చినా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

ఎయిర్ ఫోర్స్ నేప‌థ్యంలో హాలీవుడ్ లో చాలా సినిమాలు వ‌చ్చినా భార‌త‌దేశంలోని ఒక ప్రాంతీయ భాష‌లో ఎయిర్ ఫోర్స్ అధికారి క‌థాంశం నేప‌థ్యంలో సినిమాలు తీయ‌డం అన్నది వెరీ రేర్. విమానాల‌తో సావాసం అంటేనే బ‌డ్జెట్ల‌తో ప్ర‌యోగంగా భావించి వెన‌క‌డుగు వేసే ప‌రిస్థితి ఉంటుంది. కానీ ఎలాంటి ప్ర‌యోగానికైనా వెర‌వ‌ని హీరోగా వ‌రుణ్ తేజ్ తొలి నుంచి ప్ర‌యోగాల బాట‌లోనే ఉన్నాడు. ఇప్పుడు అత‌డు ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా మ‌రో ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌తో అభిమానుల‌ను అల‌రించ‌నున్నాడు.

ఇలాంటి ఒక అనూహ్య‌మైన క‌థ‌ను ఎంచుకోవ‌డ‌మే సాహ‌సం అనుకుంటే ఇందులో అత‌డు ఎలా మెప్పించ‌బోతున్నాడో చూడాల‌న్న త‌హ‌త‌హ అభిమానుల్లో ఉంది. ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ శక్తి ప్రతాప్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

హీరో వరుణ్ తేజ్ తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ గా ప్ర‌చారంలో ఉన్న #VT13 విమానయాన శాఖ నేపథ్యంలో ఆశ్చ‌ర్య‌ప‌రిచే క‌థాంశంతో మైమ‌రిపించ‌నుంద‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. రొటీనిటీకి భిన్న‌మైన వ‌రుణ్ ప్ర‌య‌త్నాన్ని ఇటు తెలుగు ప్ర‌జ‌లు స్వాగ‌తిస్తున్నారు.

మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ టాలీవుడ్ అరంగేట్రం చేస్తుండ‌డం మ‌రో విశేషం. ఇటీవ‌ల‌ గ్వాలియర్ షెడ్యూల్ పూర్తయింది.  అదే విషయాన్ని ప్రకటిస్తూ వరుణ్ తేజ్ షూటింగ్ స్పాట్ నుండి ఈ సైడ్ ప్రొఫైల్ లుక్ ని పోస్ట్ చేశాడు. పోస్టర్ లో వరుణ్ తేజ్ ఐఏఎఫ్ అధికారిగా సాలిడ్ అప్పియ‌రెన్స్ తో క‌నిపిస్తున్నాడు. ఆలివ్ గ్రీన్ యూనిఫాంలో అత‌డు చాలా స్టైలిష్ గా క‌నిపిస్తున్నాడు.

యథార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్- సందీప్ ముద్దా - నందకుమార్ అబ్బినేనితో కలిసి నిర్మిస్తున్నారు. ఘాజీ- అంత‌రిక్షం లాంటి ప్ర‌యోగాత్మ‌క సినిమాల త‌ర్వాత వ‌రుణ్ చేస్తున్న ఈ ప్ర‌యోగం నేటి ట్రెండీ ఆడియెన్ లో క‌మ‌ర్షియ‌ల్ గాను విజ‌యం సాధిస్తుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News