తార‌క్ మూవీ హిట్టైతేనే బ‌న్నీ సినిమా ప‌ట్టాలెక్కుతుందా?

Update: 2022-05-19 17:30 GMT
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లె 'పుష్ప ది రైజ్'తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు దీనికి కొన‌సాగింపుగా 'పుష్ప ది రూల్‌' టైటిల్ తో పార్ట్‌-2 రాబోతోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ తెర‌కెక్కించ‌బోతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా క‌నిపించ‌బోతోంది.

మ‌ల‌యాళ స్టార్ ఫహాద్‌ ఫాజిల్ విల‌న్ గా అల‌రించ‌బోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా బ్యాన‌ర్ల‌పై నిర్మితం కానున్న ఈ పాన్ ఇండియా మూవీ మ‌రి కొద్ది రోజుల్లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది.

'పుష్ప‌' అనంత‌రం బ‌న్నీ ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ఓ మూవీ చేయాల్సి ఉంది. 'ఏఏ21' వ‌ర్కింగ్ టైటిల్ తో 2020లోనే ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. యువ సుధ ఆర్ట్స్, జిఎ 2 పిక్చర్స్ కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించ‌నున్నాయ‌ని కూడా పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కాలంటే.. తార‌క్ మూవీ హిట్ అవ్వాల్సిందే అట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే..

అప‌జ‌యం ఎరుగ‌ని ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్ లో అన‌తి కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న కొర‌టాల శివ మొన్నీమ‌ధ్య రిలీజ్ అయిన 'ఆచార్య‌'తో తొలి ఫ్లాప్ ను మూట‌గ‌ట్టుకున్నారు. ఆచార్య లాంటి చిత్రాన్ని కొర‌టాల నుంచి అస్స‌లు ఊహించ‌లేద‌ని అభిమానులు కూడా పెద‌వి విరిచారు. ఇకపోతే ప్ర‌స్తుతం కొర‌టాల ఎన్టీఆర్ తో ఓ మూవీ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

'ఎన్టీఆర్ 30' వ‌ర్కింగ్ టైటిల్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. ఈ మూవీ క‌థ‌, స్క్రిప్ట్ పై ఒక‌టికి రెండు సార్లు క‌స‌ర‌త్త‌లు చేసిన కొర‌టాల‌.. ఫైన‌ల్ గా రెగ్యుల‌ర్ షూటింగ్ ను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమా రిజ‌ల్ట్ పైనే  'ఏఏ21' ఆధార‌ప‌డి ఉంటుంద‌ని తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

సాధారణంగా బ్లాక్‌ బస్టర్‌ సినిమా ప‌డ్డాక‌.. ఆపై చేయబోయే సినిమాల విషయంలో హీరోలు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ నేప‌థ్యంలోనే బ‌న్నీ కూడా 'ఎన్టీఆర్ 30' మంచి విజ‌యం సాధిస్తేనే.. కొర‌టాల‌తో త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించాల‌ని బ‌న్నీ భావిస్తున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు గానీ.. బ‌న్నీ తీసుకున్న నిర్ణ‌యం క‌రెక్ట్ అంటూ అభిమానులు ఏకీభావిస్తున్నారు.
Tags:    

Similar News