దిల్ రాజుని టార్గెట్ చేయాల‌నే ఇదంతా జ‌రుగుతోందా?

Update: 2022-11-22 07:52 GMT
మ‌రో నెల రోజుల త‌రువాత సంక్రాంతి స‌మ‌రం జ‌ర‌గ‌బోతోంది. ఈ సీజ‌న్ లో చాలా వ‌ర‌కు స్టార్స్ సినిమాలు పోటీప‌డ‌టం తెలిసిందే. అయితే మునుపెన్న‌డూ లేని విధంగా అస‌లు పోటీనే మొద‌ల‌వ్వ‌కుండానే సంక్రాంతి స‌మ‌యం టాలీవుడ్‌, కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మార‌డం చ‌ర్చ‌నీయాంశంగా అవుతోంది. 2023 సంక్రాంతికి సీనియ‌ర్ తెలుగు స్టార్ ల సినిమాలు పోటీప‌డ‌బోతున్నాయి. గ‌తంలో కొన్నేళ్ల క్రితం మాత్ర‌మే సంక్రాంతి బ‌రిలో పోటీప‌డిన సీనియ‌ర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ పోటీప‌డ‌బోతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'వాల్తేరు వీర‌య్య‌'. మైత్రీ మూవీ మేక‌ర్స్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. చిరుకు హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన‌ట్టు వంటి ద‌ర్శ‌కుడు బాబి ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. దీంతో ఈ మూవీ కోసం మెగా అభిమాన‌లు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. చిరు అభిమాని డైరెక్ట్ చేస్తున్న సినిమా కాబ‌ట్టి ఫ్యాన్స్ కోరుకునే అంశాల‌న్నీ వుంటాయ‌ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది.

ఇదే స‌మ‌యంలో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 'వీర సింహారెడ్డి' కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మూవీని కూడా మైత్రీ మూవీ మేక‌ర్స్ వారే నిర్మిస్తున్నారు. 'క్రాక్‌'తో ట్రాక్ లోకి వ‌చ్చేసిన గోపీచంద్ మ‌లినేని డైరెక్ట్ చేస్తున్న సినిమా కావ‌డం.. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజ‌ర్ హైవోల్టేజ్ యాక్ష‌న్ మూవీ ఇద‌ని క్లారిటీ ఇవ్వ‌డంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం భారీ అంచ‌నాల‌తో ఎదురుచూస్తున్నారు. ఇదే స‌మ‌యంలో దిల్ రాజు త‌మిళ హీరో విజ‌య్ తో నిర్మిస్తున్న 'వారీసు'ని త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.

తెలుగులో 'వార‌సుడు'గా ఈ మూవీ సంక్రాంతి బ‌రిలో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీతో పాటు దిల్ రాజు 'తునీవు'ని కూడా ఇదే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నార‌ట‌. అజిత్ హీరోగా హెచ్‌. వినోద్ రూపొందిస్తున్న ఈ మూవీపై కూడా భారీ అంచ‌నాలున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి డ‌బ్బింగ్ సినిమాల‌కు పండ‌గ సీజ‌న్ లో ప్ర‌ధాన్య‌త‌న ఇవ్వ‌రాద‌ని, థియేట‌ర్లు కేటాయించ‌రాద‌ని ఓ ప్ర‌క‌ట‌న‌ని విడుద‌ల చేసింది.

అక్క‌డి నుంచి అస‌లు వివాదం మొద‌లైంది. దీనిపై అల్లు అర‌వింద్ కౌంట‌ర్ ఇవ్వ‌గా.. త‌మిళ ద‌ర్శ‌కుడు మ‌రో అడుగు ముందుకేసి నిర్మాత‌ల మండ‌లికి వార్నింగ్ ఇచ్చినంత ప‌ని చేశాడు. ఇక అశ్వ‌నీద‌త్ కూడా ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని నిర్మాత‌ల మండ‌లి త‌మ నిర్ణాయాన్ని వెన‌క్కి తీసుకోవాల‌న్నారు. దిల్ రాజుకు మ‌ద్ద‌తుగా నిలిచారు. అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో అర్థం కాని విష‌యం ఏంటంటే ఇంత‌కీ డ‌బ్బింగ్ సినిమాలంటే ఉలిక్కిప‌డుతోంది ఎవ‌ర‌న్న‌ది స్ప‌ష్ట‌త రాలేదు. డ‌బ్బింగ్ సినిమాల‌ని రిలీజ్ చేస్తున్న నిర్మాత దిల్ రాజు ఈ వివాదంపై నోరు విప్ప‌డం లేదు.

ఇక సంక్రాంతికి ఒకేసారి 'వాల్తేరు వీర‌య్య‌', వీర సింహారెడ్డి' సినిమాల‌ని రిలీజ్ కు రెడీ చేస్తున్న మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు స్పందించ‌డం కానీ.. డ‌బ్బింగ్ సినిమాల వ‌ల్ల త‌మ రెండు సినిమాలు ఎఫెక్ట్ అవుతాయ‌ని కానీ ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.. మ‌రి సంక్రాంతి బ‌రిలో దిగుతున్న డ‌బ్బింగ్ సినిమాల‌పై ర‌చ్చ చేస్తోంది ఎవ‌రు?.. దిల్ రాజు, మైత్రీ వారికి లేని దుర‌ద ఇంకెవ‌రికుంది?.. కావాల‌నే దీన్ని ఇష్యూ చేస్తున్నారా? ..దిల్ రాజుని కార్న‌ల్ చేయాల‌నే డ‌బ్బింగ్ సినిమాల వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News