ఇక్కడ జగపతి.. అక్కడ నాజర్

Update: 2016-07-03 06:40 GMT
ఇప్పటికే ఇది తెలిసిన వార్తే. ఇప్పుడు అధికారిక సమాచారం వచ్చింది. స్పీల్ బర్గ్ సినిమాలో మన జగపతి బాబు భాగమయ్యాడు. ఈ లెజెండరీ డైరెక్టర్ లేటెస్ట్ మూవీ ‘ది బీఎఫ్జీ’ తెలుగు అనువాదానికి జగపతి బాబు వాయిస్ అందించాడు. ఇది వేరే గ్రహం నుంచి వచ్చిన ఓ పొడవాటి వ్యక్తికి.. మామూలు మనిషి అయిన ఓ అమ్మాయికి మధ్య సాగే కథ. మనుషుల కంటే మూడింతలు పొడవుండే ఆ గ్రహాంతర వాసితో ఈ అమ్మాయి స్నేహం చేస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంలో ‘ది బీఎఫ్జీ’ సాగుతుంది. ఇందులో ఆ పొడవాటి వ్యక్తికే జగపతి బాబు డబ్బింగ్ చెప్పాడు. జగపతి వాయిస్ తో ఓ హాలీవుడ్ సినిమాను చూడటం మన ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుందనడంలో సందేహం లేదు.

తనకిది చాలా భిన్నమైన అనుభవమని.. చాలా థ్రిల్లింగా అనిపిస్తోందని.. స్పీల్ బర్గ్ లాంటి దిగ్దర్శకుడి సినిమాకు ఈ రకంగా పని చేయడం తనకు చాలా ఆనందంగా ఉందని జగపతి చెప్పాడు. మరోవైపు తమిళంలో ఈ సినిమాకు సీనియర్ నటుడు నాజర్ వాయిస్ ఇవ్వడం విశేషం. ఆయన కూడా ఇప్పటికే డబ్బింగ్ పూర్తి చేశాడు. ఇండియాలో ఈ సినిమా జులై 15న విడుదల కాబోతోంది. ‘ది బీఎఫ్జీ’ ఇంటర్నేషనల్ వెర్షన్ ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో విడుదలైంది. రివ్యూలు బాగానే వస్తున్నాయి. ఐతే స్పీల్ బర్గ్ నుంచి ఇంకా గొప్ప సినిమా ఆశించామని ప్రేక్షకులు అంటున్నారు. మరి ఇండియాలో ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
Tags:    

Similar News