జ‌గ‌ప‌తి ఎదురు దాడి చేసేశారండోయ్‌!

Update: 2017-11-20 11:55 GMT
ప్ర‌స్తుతం తెలుగు నేల‌లో ఎక్క‌డ చూసినా... నంది అవార్డుల గోలే. ఇటీవ‌ల మూడేళ్ల‌కు సంబంధించిన నంది అవార్డుల‌ను ప్ర‌క‌టిస్తూ ఏపీ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆయా సంవ‌త్స‌రాల‌కు సంబంధించి ప్ర‌భుత్వం నియ‌మించిన జ్యూరీ క‌మిటీలు ఎంపిక చేసిన చిత్రాలు - న‌టుల వివ‌రాల‌ను ప‌రిశీలించిన ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు జ్యూరీ క‌మిటీల ముందే ఆ అవార్డుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. ఈ విష‌యంలో ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా జ్యూరీ క‌మిటీలు కూడా అక్క‌డిక‌క్క‌డే అవార్డుల చిట్టాల‌ను చ‌దివేసి వెళ్లిపోయాయి. ఆ త‌ర్వాతే అస‌లు గోల మొద‌లైంది. కేవ‌లం ఒక సామాజిక వ‌ర్గానికి చెందిన వారికే అవార్డుల‌న్నీ దక్కాయ‌ని, మ‌రో సామాజిక వ‌ర్గానికి తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని ఓ వ‌ర్గానికి చెందిన సినిమా జ‌నాలు గ‌గ్గోలు పెట్టారు. ఇదే అద‌నుగా టీవీ ఛానెళ్లు కూడా లైవ్ షోలు పెట్టి, ఇరు వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌ను కూర్చోబెట్టి కావాల్సినంత‌గా టీఆర్పీల‌ను రాబ‌ట్టుకున్నాయి.

ఈ క్ర‌మంలో ఒక్క రోజుతో ముగిసిపోయింద‌నుకున్న అవార్డుల గోల విడ‌త‌ల‌వారీగా రోజురోజుకూ పెరుగుతోందే త‌ప్పించి త‌గ్గ‌డం లేదు. అయితే ఈ వివాదంపై రెండు వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌ముఖులెవ్వ‌రూ స్పందించిన దాఖ‌లా లేదు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న నంద‌మూరి బాల‌కృష్ణ దీనిపై స్పందించినా... వివాదం లేకుండానే త‌న వాద‌న‌ను వినిపించేసి వెళ్లిపోయారు. లెజెండ్ చిత్రంలో న‌ట‌న‌కు గాను ఆయ‌న‌కు నంది అవార్డు ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. ఇక ఆ చిత్రంలో విల‌నీ గెట‌ప్‌లో క‌నిపించిన జ‌గ‌ప‌తిబాబు ఈ వివాదంలోకి దిగేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు. మీడియా ప్ర‌తినిధులు వెంటబ‌డినా కూడా ఆయ‌న త‌న‌దైన శైలిలో వివాదం లేకుండానే ఓ మాట అనేసి... అయినా వివాదాన్ని రేపిన వారు స్పందిస్తారు గానీ... దానితో త‌న‌కు సంబంధం లేద‌ని కూడా జ‌గ‌ప‌తి చెప్పిన విష‌యం తెలిసిందే. తాజాగా విజ‌య‌వాడ వ‌చ్చిన సంద‌ర్భంగా ఓ ఛారిటీ వాక్‌లో పాల్గొన్న సంద‌ర్భంగా జ‌గ‌ప‌తి నోట నుంచి వెలువ‌డిన ఓ కామెంట్ ఆస‌క్తిక‌రంగా ఉంద‌ని చెప్పాలి. అస‌లు ఈ వ్యాఖ్య ఆయ‌న నోట నుంచి ఎందుకు వ‌చ్చింద‌న్న అనుమానం కూడా జ‌నాల‌కు వ‌చ్చేసింది.

అయినా జ‌గ‌ప‌తి చేసిన వ్యాఖ్య ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే.. తెలుగు నేల‌లో థియేటర్లు కొంతమంది చేతుల్లోనే ఉండటం స‌రైంది కాద‌ని జ‌గ‌ప‌తి అన్నారు. ఇప్పుడు ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌న్న విష‌యానికి వ‌స్తే... నంది అవార్డుల‌పై విమ‌ర్శ‌లు గుప్పించిన వ‌ర్గం చేతుల్లోనే సినిమా థియేట‌ర్లు ఉన్నాయ‌న్న మాట జ‌నానికి తెలుసు. సో ఆ వ‌ర్గం నంది అవార్డుల‌పై చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టే ప‌నిలో భాగంగానే జ‌గ‌ప‌తి బాబు.. వారి చేతుల్లోని థియేట‌ర్ల మాట‌ను వినిపించి ఉంటార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం పెను స‌మ‌స్య‌గా మారిన నంది అవార్డుల వివాదాన్ని నేరుగా ప్ర‌స్తావించ‌కుండా... త‌న‌దైన శైలిలో దానిని వివాదం చేసిన వారిని టార్గెట్ చేస్తూ జ‌గ‌ప‌తి ఈ వ్యాఖ్య చేయ‌డం నిజంగానే ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఏది ఏమైనా ఈ మాట మ‌రో వివాదానికి దారి తీస్తుందా? అన్న అనుమానాలు కూడా లేక‌పోలేదు. చూద్దాం... ఏం జ‌రుగుతుందో.
Tags:    

Similar News