మూవీ రివ్యూ: ‘జై సింహా’

Update: 2018-01-12 09:33 GMT
చిత్రం: ‘జై సింహా’

నటీనటులు: నందమూరి బాలకృష్ణ - నయనతార - హరిప్రియ - నటాషా దోషి - ప్రకాష్ రాజ్ - అశుతోష్ రాణా - బ్రహ్మానందం - జయప్రకాష్ రెడ్డి - కాలకేయ ప్రభాకర్ - మురళీ మోహన్ - శివాజీ రాజా తదితరులు
సంగీతం: చిరంతన్ భట్
ఛాయాగ్రహణం: సి.రామ్ ప్రసాద్
నిర్మాత: సి.కళ్యాణ్
కథ - మాటలు: ఎం.రత్నం
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్

తెలుగులో సంక్రాంతి పండుగను బాగా సెంటిమెంటుగా భావించి.. ఈ సీజన్లో  సినిమాలు రిలీజ్ చేసే హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. గత రెండేళ్లూ సంక్రాంతి సినిమాలతో పలకరించిన బాలయ్య ఈసారి కూడా ‘జై సింహా’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తమిళ సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

నరసింహ (బాలకృష్ణ) కుంభకోణంలోని ఒక ప్రముఖ ఆలయానికి ధర్మకర్తగా ఉన్న పెద్ద మనిషి దగ్గర పనివాడిగా ఉంటాడు. అతనో పసి బిడ్డను పెంచుతుంటాడు. ఐతే యజమాని కూతురు చేసి తప్పిదాన్ని తన మీద వేసుకుని ఒక పెద్ద రౌడీకి శత్రువుగా తయారవుతాడు నరసింహ. మరోవైపు ఆ ఊరి ఏసీపీతోనూ అతడికి గొడవ మొదలవుతుంది. కానీ తర్వాత కొన్ని పరిణామాల మధ్య ఏసీపీ కుటుంబాన్నే ఆ రౌడీ బారి నుంచి కాపాడే బాధ్యత తీసుకుంటాడు నరసింహ. అందుకు కారణమేంటి.. ఒకప్పుడు విశాఖపట్నంలో సంతోషంగా బతుకుతున్న నరసింహ ఎందుకు కుంభకోణం రావాల్సి వచ్చింది.. అతను పెంచుతున్న పసిబిడ్డ ఎవరు.. ఏసీపీ కుటుంబంతో అతడికున్న సంబంధమేంటి.. ఈ విషయాలన్నీ తెరమీదే చూడాలి.

కథనం - విశ్లేషణ:

కొన్ని సినిమాల టీజర్లు.. ట్రైలర్లు చూస్తేనే ఆ సినిమాలు ఎలా ఉండొచ్చన్నది పక్కాగా ఒక అంచనాకు వచ్చేయొచ్చు. ‘జై సింహా’ ప్రోమోలు కూడా ఆ సినిమా ఎలా ఉండొచ్చో స్పష్టంగా చెప్పేశాయి. కథలో కానీ.. కథను చెప్పే తీరులో కానీ కొత్తదనం ఆశించకూడదని.. ఇది కేవలం మాస్ ప్రేక్షకులే లక్ష్యంగా సాగే మసాలా సినిమా అని ముందే ప్రేక్షకులు ఒక అంచనాకు వచ్చేలా చేశాయి దీని టీజర్.. ట్రైలర్. సినిమా కూడా ఈ అంచనాలకు భిన్నంగా ఏమీ ఉండదు. ఇది ఓల్డ్ స్టయిల్లో సాగే సగటు కమర్షియల్ సినిమా. బాలయ్య నుంచి ఆయన అభిమానులు.. మాస్ ప్రేక్షకులు ఆశించే అంశాలున్నాయి కానీ.. కొత్తదనానికి మాత్రం ఆమడం దూరంలో ఉంటుంది ‘జై సింహా’.

ఉన్న ఊరు వదిలేసి వేరే చోట ఎక్కడో తన ఐడెంటిటీ ఏంటో తెలియకుండా సామాన్యుడిలా బతికే హీరో.. ఆ హీరోను కెలికి అతడి ఉగ్రరూపాన్ని చూసే విలన్లు.. అక్కడ కట్ చేస్తే రొమాన్స్+ యాక్షన్+ సెంటిమెంటు కలిసిన ఒక ఫ్లాష్ బ్యాక్.. మళ్లీ వర్తమానంలోకి వస్తే ఒక భారీ క్లైమాక్స్.. ఇలా మొత్తంగా ఒక ఫార్ములా ప్రకారం సాగిపోతుందీ సినిమా. ఎప్పుడో రెండు దశాబ్దాల కిందట్నుంచే ఇదే ఫార్ములాతో ‘సమరసింహారెడ్డి’.. ‘ఇంద్ర’.. ‘సింహాద్రి’ లాంటి సినిమాల్ని చూస్తూ వస్తున్న ప్రేక్షకులకు ఇది పూర్తిగా ఔట్ డేటెడ్ అనే అనిపిస్తుంది. ముఖ్యంగా ‘అర్జున్ రెడ్డి’ లాంటి న్యూ వేవ్ సినిమాలకు పట్టం కడుతున్న ఈ తరం ప్రేక్షకులు.. క్లాస్ ఆడియన్స్ కు ‘జై సింహా’ ఎంతమాత్రం రుచించదు. ఐతే రొటీన్ అయినా పర్వాలేదు.. పంచ్ డైలాగులు.. ఫైట్లు.. డ్యాన్సుల్లాంటి మసాలాలుంటే చాలనుకుంటే ఈ సినిమా ఓకే అనిపిస్తుంది.

‘‘ఏం బెదిరిస్తున్నావా’’ ఒక పాత్ర అంటే మరో పాత్ర ‘‘లేదు హెచ్చరిస్తున్నా’’ అని బదులిస్తుంది ‘జై సింహా’లో ఒకచోట. రెండు మూడు దశాబ్దాల కిందట మన సినిమాల్లో వినిపించేది ఈ డైలాగ్. ఆ డైలాగ్ మాత్రమే కాదు.. ‘జై సింహా’ కథాకథనాలు కూడా మనల్ని చాలా ఏళ్ల వెనక్కి తీసుకెళ్తాయి. సినిమాలో ఎక్కడా కొత్తదనం అనే మాటే ఉండదు. అతి సామాన్యుడిగా ఉంటూనే ఎంతటి వాడినైనా ఎదిరిస్తూ.. తన ప్రతాపం చూపించే ఫక్తు కమర్షియల్ సినిమా హీరో లాగే కనిపిస్తాడు బాలయ్య ఇందులో. ప్రథమార్ధమంతా చాలా వరకు హీరో ఎలివేషన్ సీన్లే కనిపిస్తాయి. ‘‘నువ్వు కుంభకోణానికి భయం. కానీ నేనంటే రెండు రాష్ట్రాలకు ప్రాణం’’ అంటాడు బాలయ్య ఒకచోట. ఈ డైలాగ్ ఆంతర్యమేంటో అర్థం కాదు. ఫ్లాష్ బ్యాక్ లో అతనేమైనా పెద్ద లీడరేమో.. రెండు రాష్ట్రాల ప్రజలు అతణ్ని దేవుడిలా కొలిచారేమో అనుకుంటాం. కానీ అతను జస్ట్ ఒక మెకానిక్ మాత్రమే. వైజాగ్ సిటీలో తనకు ఎదురైన అన్యాయాల్ని మాత్రం ఎదిరిస్తుంటాడు. అంటే డైలాగుల కోసం డైలాగులే అన్నమాట. ఇలాంటివి సినిమాలో చాలా చూడొచ్చు. ప్రతి సీన్లోనూ అవసరమున్నా లేకున్నా బోలెడన్ని పంచ్ డైలాగులు పేలుస్తాడు బాలయ్య.

రొటీన్ హీరో ఎలివేషన్ సీన్లు.. లెక్కకు మిక్కిలి పంచ్ డైలాగులు.. రెండు మూడు ఫైట్లు.. బాలయ్య డాన్సింగ్ టాలెంట్ చూపించే రెండు పాటలతో ఏదో అలా అలా సాగిపోతుంది ‘జై సింహా’ ప్రథమార్ధం.  ఇంటర్వెల్ దగ్గర కూడా కూడా ఫార్ములా ప్రకారం ఒక ట్విస్టు చూస్తాం. ద్వితీయార్ధంలో ఒక లెంగ్తీ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. అందులో రొమాన్స్.. కామెడీ కోసం ట్రై చేశారు కానీ.. అదేం పెద్దగా వర్కవుట్ కాలేదు. బాలయ్య-నయనతార కాంబినేషన్లో వచ్చే సీన్లు కొంత పర్వాలేదనిపిస్తాయి కానీ.. హరిప్రియ పాత్రతో.. ఆమెతో ముడిపడ్డ సన్నివేశాలు మాత్రం విసిగిస్తాయి. హీరో-విలన్ వార్ పరమ రొటీన్ గా ఉంటుంది. హీరో వెర్సన్ విలన్ ట్రాక్ మొత్తం తేలిపోయింది. విలన్ పాత్ర వీక్ గా ఉండటంతో హీరో పాత్ర కూడా ఎలివేట్ కాదు.

‘జై సింహా’లో కొంచెం బలంగా.. ప్రభావవంతంగా చూపించింది పసిబిడ్డతో ముడిపడ్డ సెంటిమెంట్ ఎపిసోడ్నే. ఇది కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవచ్చు. కథను మలుపు తిప్పేది ఈ అంశమే. ఐతే అది కూడా చాలా డ్రమాటిగ్గా సాగి.. వెనకటి రోజుల్నే గుర్తు చేస్తుంది. ఒక క్లైమాక్సులో ఒక రొటీన్ భారీ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత ముగింపులో కూడా సెంటిమెంటు గట్టిగా దట్టించారు. కొత్తగా లేకున్నా ప్రథమార్ధం కొంచెం వేగంగానే సాగిపోతుంది కానీ.. ద్వితీయార్ధం మాత్రం బాగా సాగతీతగా అనిపించి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. నిడివి రెండూ ముప్పావు గంటలు కావడం మైనసే. బాలయ్య నుంచి అభిమానులు ఆశించే అంశాలున్నాయి కాబట్టి వాళ్లు.. కొంత మేర మాస్ ప్రేక్షకులు ‘జైసింహా’తో సంతృప్తి చెందొచ్చేమో. కానీ క్లాస్ ప్రేక్షకులు.. కొత్తదనం కోరుకునే వాళ్లకు మాత్రం ‘జై సింహా’ భారమే.

నటీనటులు:

బాలయ్య తన అభిమానుల్ని.. మాస్ ప్రేక్షకుల్ని అలరించే రీతిలో కనిపించాడు. పంచ్ డైలాగులు పేల్చాడు. ఫైట్లు చేశాడు. డ్యాన్సులు చేశాడు. వాళ్లు కోరుకునే రీతిలో అన్నీ చేశాడు. సెంటిమెంటు సీన్లలో బాలయ్య అభినయం బాగుంది. ఈ వయసులో అమ్మకుట్టి పాటలో బాలయ్య వేసిన స్టెప్పులు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఐతే బాలయ్య లుక్ బాగా లేదు. ఫ్లాష్ బ్యాక్ లో ఓకే కానీ.. వర్తమానంలో కనిపించే లుక్ బాలయ్యకు సెట్టవ్వలేదు. మేకప్ బాగా లేదు.  హీరోయిన్లలో నయనతార మాత్రమే ప్రత్యేకత చాటుకుంటుంది. ఆమెకూ పెద్ద పాత్ర లేకపోయినా నయన్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంటుంది. హరిప్రియ.. నటాషా ఏ రకంగానూ మెప్పించరు. వాళ్ల పాత్రలు తేలిపోయాయి. విలన్లుగా అశుతోష్ రాణా.. కాలకేయ ప్రభాకర్ మామూలే. ప్రకాష్ రాజ్ ఓవర్ ద బోర్డ్ యాక్టింగ్ తో విసిగిస్తాడు. బ్రహ్మానందం పాత్ర ‘చంద్రముఖి’లో వడివేలును గుర్తుకు తెస్తుంది. ఆయన కామెడీ సినిమాకు తగ్గట్లే ఔట్ డేటెడ్ అనిపిస్తుంది. మిగతా నటీనటుల గురించి చెప్పడానికేమీ లేదు.

సాంకేతికవర్గం:

‘కంచె’.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాల్లో తన ప్రత్యేకతను చాటుకున్న చిరంతన్ భట్.. తన శైలికి నప్పని సినిమా కావడం వల్లో ఏమో ‘జై సింహా’లో పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. ప్రియం జగమే ఆనందమయం పాట మాత్రమే ప్రత్యేకంగా అనిపిస్తుంది. హరిప్రియతో ఉన్న పాట సినిమాలో అసలే మాత్రం సింక్ అవ్వలేదు. మిగతా పాటలు మామూలే. బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం మామూలుగా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. రత్నం కథ.. మాటలు అన్నీ పాత తరహాలో సాగాయి. పంచ్ డైలాగుల కుప్ప పోసేశాడాయన. కె.ఎస్.రవికుమార్ దర్శకుడిగా తన ముద్ర ఏమీ చూపించలేదు. రత్నం రాసింది అలా తీసిపెట్టారనిపిస్తుంది. ఆయన పూర్తిగా టచ్ కోల్పోయారని.. ఔట్ డేట్ అయిపోతున్నారనడానికి ‘జై సింహా’ రుజువుగా కనిపిస్తుంది.

చివరగా: జై సింహా.. సెంటిమెంటు దట్టించిన ఫార్ములా మసాలా

రేటింగ్ : 2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News