టాలీవుడ్ లో నెక్ట్స్ రిలీజ్ కానున్న భారీ చిత్రం జనతా గ్యారేజ్. మూవీలో మోహన్ లాల్ కూడా నటించడంతో మల్లూవుడ్ లో కూడా ఈ సినిమాపై ఆసక్తి ఎక్కువగానే ఉంది కానీ.. తెలుగులో దీని రేంజ్ మరీ ఎక్కువ. సెప్టెంబర్ 2న విడుదల కానున్న ఈ చిత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
సినిమా రిలీజ్ కి పట్టుమని చేతిలో ఉన్నది పదిహేను రోజులే. అందుకే ఇప్పుడు ప్రమోషన్ వర్క్స్ మొదలుపెట్టేసింది యూనిట్. ఆడియో రిలీజ్ రోజున ఇచ్చిన థియేట్రికల్ ట్రైలర్ తర్వాత మిక్సెడ్ టాక్ జనరేట్ అయింది. పైగా.. ఇంటర్వ్యూలు- టీవీల్లో యాడ్స్ స్టార్ట్ చేసేందుకు మరో వారం గ్యాప్ ఉంది. ఈ ఖాళీని ఫిల్ చేసేందుకు మేకింగ్ వీడియోల కాన్సెప్ట్ ని బైటకు తీశాడు దర్శకుడు కొరటాల శివ. హైద్రాబాద్ పరిసరాల్లోనే వేసిన భారీ సెట్ లో.. మేకింగ్ సహా మూవీ యూనిట్ తోనే కొన్ని హైలైట్స్ చెప్పించారు.
ట్రైలర్ లోనే జనతా గ్యారేజ్ కాన్సెప్ట్ ని రివీల్ చేసేయడంతో.. మేకింగ్ వీడియోలో షూటింగ్ అప్ డేట్స్ మాత్రమే వినిపించాయి. ప్రధాన నటీనటులు టెక్నీషియన్స్ అంతా.. ఎన్టీఆర్-మోహన్ లాల్- కొరటాల శివ ట్యాలెంట్ గురించి తెగ పొగిడేశారు. అయితే.. ఈ వీడియోలో కూడా హీరోయిన్స్ సమంత- నిత్యామీనన్ లు ఇలా కనిపించి అలా వెళ్లిపోవడం చాలామందిని బాధ పెట్టేసింది. ఇద్దరు అందాల భామలను సినిమాలో తీసుకుని కూడా.. వారికి సంబంధించిన సీన్స్ ను రివీల్ చేయకపోవడం వెనక.. పెద్ద కారణమే ఉంటుందని చర్చించేసుకుంటున్నారు.