ట్రైల‌ర్ రిలీజ్ కు అతిధిగా వెళ్లి క‌డిగిపారేసింది!

Update: 2019-05-03 10:16 GMT
ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడేయ‌టం కొంద‌రి ల‌క్ష‌ణం. ఎవ‌రేం అనుకుంటార‌న్న మొహ‌మాటానికి పోకుండా ఓపెన్ గా చెప్పాల్సింది చెప్పేసిన తీరు ప్ర‌ముఖుల్లో త‌క్కువే ఉంటుంది. అలాంటి గుణం సీనియ‌ర్ న‌టి.. కేంద్ర ఫిలిం సెన్సార్ స‌భ్యురాలు జీవిత‌లో కాస్త ఎక్కువే. తాజాగా త‌న‌ను అతిధిగా పిలిచిన ఒక చిత్ర యూనిట్ కు మొహ‌మాటం లేకుండా క్లాస్ పీకిన్ వైనం సంచ‌ల‌నంగా మారింది.

బోల్డ్ కంటెంట్ పేరుతో ప‌క్కా బూతు చిత్రాల్ని తీసుకున్న వైనం ఈ మ‌ధ్య‌న అంత‌కంత‌కూ పెరుగుతోంది. హీరో.. హీరోయిన్ల మ‌ధ్య శృంగార‌న్ని ప‌చ్చిగా చూపించేందుకు కొంద‌రు ద‌ర్శ‌కులు వెనుకాడ‌టం లేదు. అలాంటి సినిమాగా చెప్పాలి డిగ్రీ కాలేజ్. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

సెన్సార్ కాకుండానే విడుద‌లైన ఈ ట్రైల‌ర్ ఫంక్ష‌న్ కు అతిధిగా హాజ‌రైన జీవిత మాట్లాడుతూ.. చిత్ర యూనిట్ కు భారీగా క్లాస్ పీకారు. అతిధిగా వ‌చ్చి ఇలా మాట్లాడుతున్నాన‌ని అనుకోవ‌ద్దని సున్నితంగా మొద‌లెట్టి.. చెప్పాల్సిన నాలుగు ముక్క‌లు ఎలాంటి మొహ‌మాటం లేకుండా చెప్పేశారు. అర్జున్ రెడ్డి.. ఆర్స్ ఎక‌స్ 100 పుణ్య‌మా అని లిప్ లాక్ లేని తెలుగు సినిమా లేకుండా పోయింద‌ని.. శృంగారం ఉండాలి  కానీ.. హ‌ద్దుల్లో ఉండాల‌న్నారు.

ఈ విష‌యాన్ని తానో ఉదాహ‌ర‌ణ‌తో చెబుతాన‌న్న జీవిత‌.. మ‌నం ఇల్లు క‌ట్టుకుంటే.. హాల్లో కూర్చుంటాం.. బెడ్రూంలో ప‌డుకుంటాం.. బాత్రూంలో స్నానం చేస్తాం. కానీ.. హాల్లో స్నానం చేయం క‌దా? ఎక్క‌డ ఏ ప‌ని చేయాలో ఆ ప‌ని చేయాల‌న్నారు. సెక్స్ అంద‌రి జీవితాల్లో ఉంటుంద‌ని.. అది చాటుగా ఉండాలే కానీ.. ఇలా ప‌చ్చిగా ఉండ‌కూడ‌ద‌న్నారు.

రోడ్డు మీద చేస్తే ఎంత అస‌హ్యంగా ఉంటుంది?  అంటూ ఘాటుగా ప్ర‌శ్నించిన‌ జీవిత‌.. "మ‌న‌కూ కుటుంబాలు ఉన్నాయి.. ఆడ‌పిల్ల‌లు ఉన్నారు.. అక్క‌చెల్లెళ్లు ఉన్నారు. ప్ర‌తి ర‌చ‌యిత‌.. ద‌ర్శ‌కుడు సామాజిక బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు. ప్ర‌తి ఒక్క‌రూ ఒక విష‌యాన్ని అర్థం చేసుకోవాలి. సోష‌ల్ మీడియాలోనో.. టీవీలోనో.. కంప్యూట‌ర్ లోనో ఉండ‌టం లేదా? అని వాదిస్తారు. నిజ‌మే ఉన్నాయి. కానీ.. వాటిని మ‌నం ఒక రూంలో ఒక్క‌రం కూర్చొని చూస్తాం. సినిమా అనేది కొన్ని వంద‌ల మందితో క‌లిసి చూసేది. చాలామంది మ‌ధ్య‌లో మ‌నం శృంగారం చేయ‌టం.. అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌టం బాగోదు. సినిమాలో ఇలాంటివి వ‌చ్చే స‌రికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు న‌న్ను అతిధిగా వ‌చ్చిన కార్య‌క్ర‌మంలో ఇలా మాట్లాడ‌కూడ‌దు. కానీ.. మ‌న‌సుకు చెప్పాలనిపించి చెప్పా" అంటూ వ్యాఖ్యానించారు. ఏమైనా.. టీవీ షోల‌లోనే కాదు.. బూతు సినిమాలు తీసే వారి ఎదుట‌.. మొహ‌మాటం లేకుండా ముఖం ప‌గిలేలా మాట్లాడిన జీవిత తీరు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

Tags:    

Similar News