జంగిల్ బుక్ దంచుకుంటోంది

Update: 2016-04-13 15:30 GMT
సౌత్.. నార్త్.. అని తేడాల్లేవు. భాషా భేదం లేదు.. ఇప్పుడు దేశంలోని సినీ ప్రియులంతా ఒక సినిమా గురించే చర్చించుకుంటున్నారు. అదే.. జంగిల్ బుక్. ఒక చిన్న పిల్లోడు హీరో.. సినిమాలో ఉన్న ఏకైక పాత్ర అతడిదే. ఐతేనేం.. ఈ సినిమా మన ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అవతార్ లాంటి సినిమాల్ని కూడా తలదన్నే స్థాయిలో ఇండియాలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ‘జంగిల్ బుక్’. ఇండియాలో అతి పెద్ద విజయం సాధించిన హాలీవుడ్ మూవీగా ‘జంగిల్ బుక్’ రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.40 కోట్లు వసూలు చేయడం విశేషం. తొలి వారం అయ్యేసరికి వసూళ్లు రూ.55 కోట్ల దాకా ఉంటాయని అంచనా. ఫుల్ రన్‌లో ఈ సినిమా ఈజీగా వంద కోట్ల వసూళ్లను దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గత ఏడాది విడుదలైన ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7’ రూ.100 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి.. ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన హాలీవుడ్ మూవీగా రికార్డు సృష్టించింది. ‘జంగిల్ బుక్’ ఆ రికార్డును దాటడం ఖాయంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 1700 థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్లో అంచనాల్ని మించి కలెక్షన్లు రాబట్టింది. దాదాపుగా అన్నిచోట్లా హౌస్ ఫుల్స్ తో నడిచింది. వీక్ డేస్ లో కూడా కలెక్షన్లు బాగున్నాయి. ఫస్ట్ - సెకండ్ షోలకు టికెట్లు దొరకని పరిస్థితి కనిపిస్తోంది. కొన్నిచోట్ల స్క్రీన్లు పెంచాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఇంగ్లిష్.. హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ సినిమాను రిలీజ్ చేయడం కలిసొస్తోంది. హాలీవుడ్ చిత్రాలు పెద్దగా చూడని జనాలు కూడా ఈ సినిమా మీద ఆసక్తి చూపిస్తున్నారు. పిల్లలు.. పెద్దలు అని తేడా లేకుండా సినిమాను ఆస్వాదిస్తున్నారు. విశేషం ఏంటంటే.. ఈ సినిమా హాలీవుడ్లో కంటే వారం ముందుగానే ఇండియాలో రిలీజైంది. ఇది భారత్ నేపథ్యంగా సాగే సినిమా కావడమే దీనికి కారణం. వరల్డ్ వైడ్ గా ఈ శుక్రవారమే ‘జంగిల్ బుక్’ను రిలీజ్ చేస్తున్నారు.
Tags:    

Similar News