మాటిచ్చిన రజనీ మొహం చాటేశాడా??

Update: 2016-07-21 17:30 GMT
''కబాలి'' తెలుగు వర్షన్ రిలీజ్‌ గురించి నిన్న మొన్నటివరకు చాటుమాటున జరిగిన గొడవలన్నీ.. గత రెండు రోజులుగా ఈ సినిమా తెలుగు వర్షన్‌ హక్కులు కొనుకున్న కె.పి.చౌదరి (కృష్ణ ప్రసాద్‌) చాలా చానల్స్ లో లైవులో కూర్చొని విషయాలను బయటకు చెప్పేయడంతో.. ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులు షాక్‌ తినేశారంతే.

నిజానికి కొత్తగా ఈ రంగంలోకి వచ్చిన కెపి పేపర్లో యాడ్స్ ఇస్తే.. వాటిని అడ్డుకున్నారట తెలుగు డిస్ర్టిబ్యూషన్‌ కౌన్సిల్ కు చెందిన కొందరు. కెపి చౌదరి దీని గురించి ప్రశ్నిస్తే.. దాసరి గారు ఆపమన్నారని చెప్పారట. ''నువ్వు కబాలి నిర్మాత ధాను దగ్గరకు వెళ్లి.. గతంలో విక్రమసింహా - లింగా నష్టాలను రజనీకాంత్‌ పూడుస్తునన్నారు.. దాని గురించి మాట్లాడు అంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఇదే విషయాన్ని పేపర్ మీద రాసివ్వండి నేనెళ్ళి మాట్లాడుతా అంటే.. వారు రాసివ్వట్లేదు. గతంలో నష్టపోయిన వారికి హెల్ప్ చెయ్యి అంటున్నారు.. నేనేం చేస్తాను? కావాలంటే ఇప్పుడు మాట్లాడుతున్న ముత్యాల రామదాసు వంటి వారందరూ తలో పాతిక లక్షలు ఇవ్వమనండి.. నేను కూడా లాభాలొస్తే ఒక పాతిక ఇస్తా.. అప్పుడు సాయం చేద్దాం'' అంటూ 10టివి లైవ్ లో మాట్లాడిన కెపి చౌదరి తెలిపాడు. అంతేకాదు.. కొంతమంది ఇక్కడ మాఫియాగా తయారై చంపేస్తానని బెదిరిస్తున్నారని.. తెలంగాణ నుండి వచ్చిన తాను కావాలంటే కె.సి.ఆర్‌ దగ్గరకు వెళ్తాను కాని.. ఈ మాఫియాకు తలవంచనని.. సినిమా రిలీజవ్వగానే మొత్తం అంశంలో ఎవరెవరు పెద్దలు తనను ఎన్నెన్ని మాటలు అన్నారో కూలంకషంగా ఒక లెటర్‌ రాసి రిలీజ్ చేస్తానని అంటున్నాడు కెపి చౌదరి. అంతేకాదు.. ''కబాలి'' తన మొదటి మరియు ఆఖరి సినిమా అంటున్నాడు.

ఇదే విషయంపై రెండు రోజుల క్రితం టివి9 ఛానల్లో మాట్లాడిన పంపిణీదారుడు ముత్యాల రామదాసు.. ''గతంలో నష్టాలకు సాయపడతామని స్వయంగా రజనీకాంత్ వైఫ్‌ లత గారు మాటిచ్చారు. కబాలి కంటే ముందే సెటిల్‌ చేస్తామన్నారు. అదే విషయం గురించి ఇప్పుడు సినిమా రిలీజ్ దగ్గర పడింది కాబట్టి.. మాట్లాడమని అడుగుతున్నాం అంతే. మేము బెదిరించట్లేదు'' అన్నారు. ఇక మరో నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్‌ నట్టి కుమార్ మాట్లాడుతూ.. ''సినిమా ఇండస్ర్టీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా.. దాసరి గారే పెద్ద దిక్కని.. ఆయన పేరును కెపి చౌదరి అస్తమానం చెప్పాల్సిన అవసరం లేదు'' అని చెప్పడం విశేషం.

ఒక విషయమైతే క్లియర్ గా అర్ధమవుతోంది. విక్రమసింహా - లింగా నష్టాలను సూపర్ స్టార్ రజనీకాంత్‌ బర్తీ చేస్తానన్నాడు. కాని రిలీజు టైముకు ఆయన అమెరికా చెక్కేశాడు. ఇప్పుడు సినిమాను ఆపాలంటే తెలుగులో సినిమాను కొనుక్కున్న పంపిణీదారుడిని ప్రెజర్ చేయాలి. కాని అది కరక్టు పద్దతేనా? చేస్తేగీస్తే రజనీకాంత్ ఆఫీస్‌ దగ్గరకు వెళ్ళి హంగామా చేయాలి.. లేదంటే ఆయన బర్తీ చేస్తానని మాటిచ్చాడు కాబట్టి.. కోర్టులో కేసు వేయాలి. అంతేకాని.. ఇప్పుడు సినిమాను కొనుక్కున్న డిస్ర్టిబ్యూటర్ ను ఇబ్బంది పెట్టడమేంటి? అంటున్నారు ఈ యవ్వారం అంతా చస్తున్నవాళ్ళు.
Tags:    

Similar News