పాట హిట్‌...ఆ సంగ‌తి ర‌చ‌యితకే తెలీదు!

Update: 2016-09-11 09:04 GMT
దేశ‌వ్యాప్తంగా ఈ మ‌ధ్య దుమ్ము రేపుతున్న పాట‌... కాలాచ‌ష్మా. ఇటీవ‌లే విడుద‌లైన ‘బార్ బార్ దేఖో’లో ఈ పాట ఉంది. యూట్యూబ్ ట్రెండింగ్స్ లో చాలారోజుల‌పాటు ఈ పాట టాప్ గా నిలిచింది. ఇంత‌కీ... సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన ఈ మాస్ మ‌సాలా సాంగ్ రాసింది ఎవ‌రో తెలుసా... ఒక హెడ్ కానిస్టేబుల్! పాట హిట్ట‌యినంత‌గా ఆయ‌న పేరు ఎందుకు వినిపించ‌డం లేదు. అంతేకాదు, త‌న పాట‌ను బార్ బార్ దేఖో చిత్రంలో వాడుకున్నార‌న్న సంగ‌తే స‌ద‌రు ర‌చ‌యిత‌కు తెలీద‌ట‌!

పంజాబ్ పోలీస్ శాఖ‌లో పనిచేస్తున్న అమ్రిక్ సింగ్ ష‌రా (42) ఈ పాట‌ను రాశారు. ప్ర‌స్తుతం క‌పుర్త‌లా పోలీస్ స్టేష‌న్ లో ప‌నిచేస్తున్నారు. కాలాచ‌ష్మా పాట‌ను సినిమా కోసం తీసుకున్నారన్న విష‌యం త‌న‌కు తెలీద‌ని అంటున్నారు సింగ్‌. రెండు నెల‌ల కింద‌ట ఏదో టీవీ చానెల్లో ఈ పాట వ‌స్తోంద‌ని త‌న స్నేహితుడు ఫోన్ చేసి చెప్పాడ‌నీ, అంత‌వ‌ర‌కూ ఆ పాట ఓ సినిమాలో వాడుకున్నార‌న్న సంగ‌తి కూడా తన‌కి తెలీద‌ని సింగ్ చెబుతున్నారు. ఒక సిమెంట్ కంపెనీ ప్రారంభ కార్య‌క్ర‌మంలో ఈ పాట‌ను వేసుకుంటామ‌ని ముంబైకి చెందిన ఒక సంస్థ పాట హ‌క్కుల‌ను త‌న ద‌గ్గ‌ర నుంచి తీసుకుంద‌ని చెప్పారు. రూ. 11 వేలు మాత్ర‌మే త‌న‌కు ఇచ్చార‌నీ, ఈ పాట సినిమాలో వాడతార‌ని మాత్రం త‌నకు తెలీద‌న్నారు. ముంద‌స్తు స‌మాచారం ఇవ్వ‌కుండా పాట‌ను సినిమాల్లో వాడుకోవ‌డంపై త‌న‌కేం కోపం లేద‌ని అన్నారు. ఎలాగైతేనేం నా పాట ఇలా సూప‌ర్ హిట్ కావ‌డం హ్యాపీగా ఉంద‌న్నారు.

ఇంత‌కీ పాట‌ను సింగ్ ఎప్పుడు రాశారో తెలుసా... ఆయ‌న 9వ త‌ర‌గ‌తిలో ఉండ‌గా! జ‌లంధ‌ర్ స‌మీపంలోని త‌ల్వాండీ గ్రామంలో ఉండ‌గా ఈ పాట రాసుకున్నార‌ట‌. దీన్ని రికార్డింగ్ చేయిద్దామ‌ని చాలా ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ, ఎవ్వ‌రూ ఆయ‌న్ని ప‌ట్టించుకోలేదు. ఎట్ట‌కేల‌కు గాయ‌కుడు అమ‌ర్ అర్షి ఈ పాట‌ను పాడేందుకు ముందుకొచ్చార‌నీ, ఇంగ్లండులో జ‌రిగిన ఓ వేడుక‌ల్లో ఈ పాట పాడార‌నీ దాని త‌రువాత సూప‌ర్ హిట్ అయింద‌ని చెప్పారు సింగ్‌. విచిత్రం ఏంటంటే... ఈ పాట‌ను బార్ బార్ దేఖో చిత్రంలో వాడుకున్న‌ప్పుడు ఆయ‌న్ని ఆడియో ఫంక్ష‌న్ కు పిలావాలి క‌దా..?  లేదా, ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయ‌న గురించి చెప్పాలి క‌దా..?  కానీ, ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఇలా చెయ్య‌నేలేదు.
Tags:    

Similar News