మెగాస్టార్ క‌ళ్యాణ్ రామ్.. తొంద‌ర‌పాటు త‌గునా?!

Update: 2022-08-07 14:30 GMT
త‌మ ఫేవ‌రెట్ హీరో పెద్ద హిట్టు కొడితే అభిమానుల‌ను అది ఎగ్జ‌యిట్ చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు. అయితే ఎంతగా ఎగ్జ‌యిట్ చేసినా కానీ ఒక్క హిట్టు కొట్ట‌గానే అత‌డికి ట్యాగ్ లైన్ లు జోడించి బిరుదులు ఇచ్చేసి పొగిడేయ‌డం స‌రైన‌దేనా? కొంద‌రు అభిమానులు పాలాభిషేకాలు ర‌క్తాభిషేకాలు అంటూ హ‌డావుడి చేసేస్తుంటారు. కానీ వాస్త‌వం ఏమిటో అభిమానులు ప్ర‌తి సంద‌ర్భంలోనూ గుర్తెర‌గాలి. రంగుల ప్ర‌పంచంలో ప్ర‌తి సినిమా దేనిక‌దే హిట్టు కొట్టాలి. ఫ్లాపైతే ఒక్క సినిమాతోనే గ‌ల్లంత‌యిన సంద‌ర్భాలుంటాయి. ఒకే ఒక్క హిట్టుతో ఎక్క‌డికో వెళ్లిన హీరోలు .. ఒకే ఒక్క ఫ్లాప్ తో ఇంకెక్కడికో దిగ‌జారిన సంద‌ర్భాలున్నాయి.

అలా జ‌ర‌గాల‌ని కాదు కానీ.. ఎవ‌రైనా హీరో ఒక వైవిధ్య‌మైన సినిమాని తెర‌కెక్కించి హిట్టు కొట్టారు అంటే ప్ర‌శంసించి తీరాల్సిందే. కోట్లాది రూపాయ‌ల బ‌డ్జెట్లు పెట్టి ప్ర‌యోగాలు చేసేందుకు చాలా గ‌ట్స్ కావాలి. అలాంటి గ‌ట్స్ ఉన్న నిర్మాత కం హీరోగా క‌ళ్యాణ్ రామ్ ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. వ‌రుస‌గా ఫ్లాప్ లు వెక్కిరిస్తున్నా ఎక్క‌డా వెర‌వ‌క ఫ్లాప్ డైరెక్ట‌ర్లు అని కూడా చూడ‌కుండా అత‌డు అవ‌కాశాలిచ్చి ఎంక‌రేజ్ చేశారు. ఆల్మోస్ట్ వెరైటీ క‌థ‌ల్ని- స్క్రిప్టుల్ని ప్రోత్స‌హించారు. అందుకే క‌ళ్యాణ్ రామ్ ఇప్పుడు ప్ర‌యోగాత్మ‌కంగా ఒక డెబ్యూ డైరెక్ట‌ర్ ని ప‌రిచ‌యం చేస్తూ `బింబిసార`తో హిట్టు కొట్టారు అన‌గానే ఈ మూవీని వీక్షించి అత‌డిపై మెగాస్టార్ చిరంజీవి- అల్లు అర్జున్ లాంటి మెగా హీరోలు ప్ర‌శంస‌లు కురిపించారు. అల్లు అర్జున్ అయితే ఏకంగా క‌ళ్యాణ్ రామ్ అంటే త‌న‌కు ఎంతో గౌర‌వం అని కూడా అన్నారు.

అయితే ఇంత‌లోనే ``#మెగాస్టార్ క‌ళ్యాణ్ రామ్`` అంటూ అత్యుత్సాహంతో సోష‌ల్ మీడియాల్లో అభిమానులు ప్ర‌చారం హోరెత్తించేస్తున్నారు. అయితే ఇది స‌హేతుక‌మా? అంటే దానిని అభిమానులే విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. త‌మ అభిమాన హీరోని మెగాస్టార్ అని పొగిడేస్తే త‌ప్పేమీ కాదు కానీ.. దానిని ఎదుటివారిని అవ‌హేళ‌న చేసేలా కించ‌ప‌రుస్తూ మాత్రం ప్ర‌చారం చేయ‌కూడ‌ద‌ని కొంద‌రు నెటిజ‌నులే ఈ సంద‌ర్భంలో సూచిస్తున్నారు. అసాధార‌ణ ప్ర‌భావం చూపే డిజిట‌ల్ వేదిక‌పై ఇలాంటి కొన్ని కామెడీల‌ను స్వాగ‌తించ‌కూడ‌ద‌ని కూడా వారు సూచిస్తున్నారు.
క‌ళ్యాణ్ రామ్ గొప్ప గ‌ట్సీగా సినిమా తీశారన్న‌ది కాద‌న‌లేని నిజం. అత‌డు బింబిసార పాత్ర‌లో అంతే అద్భుతంగా న‌టించారు. యువ‌ద‌ర్శ‌కుడు త‌న‌ని ప్రెజెంట్ చేసిన తీరు అద్భుతం. బింబిసార‌కు మంచి టాక్ కూడా వ‌చ్చింది. ఇంత‌లోనే ఇలా మెగాస్టార్ హ్యాష్ ట్యాగ్ ని అత‌డి పేరుకి త‌గిలించేయాల్సిన అవ‌స‌రం ఉందా? అని ప్ర‌శ్నిస్తున్నారు. క‌ళ్యాణ్ రామ్ పై చిరు ఎంతో అభిమానం క‌న‌బ‌రుస్తారు. బింబిసార హిట్ట‌య్యింద‌న‌గానే త‌న‌వంతుగా సోష‌ల్ మీడియాలో ఆ సినిమా విజ‌యం సాధించినందుకు ఆనందం వ్య‌క్తం చేశారు. బింబిసార‌తో పాటు సీతారామం కూడా విజ‌యం సాధించినందుకు ఇరువురికి అభినంద‌న‌లు తెలిపారు చిరు. ఇక ఇటీవ‌ల రామ్ చ‌ర‌ణ్ ని నంద‌మూరి తార‌క రామారావుతో క‌లిపి ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రం చేసేందుకు చిరు త‌న‌వంతుగా ప్రోద్భ‌లం అందించారు.  ఇప్పుడు మెగా వ‌ర్సెస్ నంద‌మూరి వైరుధ్యం లేనే లేదు. ప‌రిశ్ర‌మ‌లో అంద‌రు హీరోలు ఎంతో స్నేహంగా క‌లిసి మెలిసి ఉంటున్నారు. ఈ సందర్భం ఎంతో ఆహ్ల‌ద‌క‌రంగా క‌నిపిస్తోంది. అలాంటిది ఇప్పుడిలా ఒక సెక్ష‌న్‌ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాల్లో వీరంగం స‌రికాద‌నే అభిప్రాయం వినిపిస్తోంది.

ఏ హీరో అయినా ఒక్క సినిమాతో ఓవ‌ర్ నైట్ లో స్టార్ డ‌మ్ ని అందుకోలేరు. అంచెలంచెలుగా ఎదగాలి. క‌ళ్యాణ రాముడు ఒక మంచి హిట్టందుకుని జోరుమీదున్నారు. ప‌టాస్ - అత‌నొక్క‌డే- బింబిసార లాంటి చిత్రాలు క‌ళ్యాణ్ రామ్ కి ఎంతో ఎన‌ర్జీనిచ్చాయి. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎంతో మ‌ద‌నానికి గురైన అనుభ‌వం క‌ళ్యాణ్ రామ్ కి ఉంది. అత‌డు మ‌రెంతో ఎద‌గాల్సి ఉంది. ఇంత‌లోనే పెద్ద హ్యాష్ ట్యాగుల‌తో అత‌డిని క‌న్ఫ్యూజ్ చేయ‌డం స‌రికాదు. ఇప్పుడు పాన్ ఇండియా రేస్ లో మ‌న హీరోలంతా దూసుకెళుతున్నారు. క‌ళ్యాణ్ రామ్ కూడా ఈ రేసులో చేరి ఇత‌రుల‌తో పోటీప‌డి స‌త్తా చాటాలి. అప్పుడు అత‌డిని త‌మ‌కు న‌చ్చిన‌ట్టు కీర్తించే వెసులుబాటు పెరుగుతుంది. స్కై ఈజ్ లిమిట్ అన్న చందంగా ఎదిగేస్తూ ఉంటే  పొగ‌డ్త‌లు బిరుదులు వాటంత‌ట అవే వ‌స్తుంటాయి. ఏం చేసినా అభిమానుల‌ చ‌ర్య అప‌హాస్యం కాకూడ‌దు. ప్ర‌స్తుతానికి అత్యుత్సాహం త‌గ్గించుకుని వాస్త‌వం ఏమిటో విశ్లేషించుకుంటే బావుంటుంద‌ని ప‌లువురు సూచిస్తున్నారు. అత్యుత్సాహం చూపే కంటే క‌ళ్యాణ రాముడిని పాన్ ఇండియా స్టార్ గా ఎదిగేందుకు ప్రోత్స‌హిస్తే అది ఎంతో మేలు.
Tags:    

Similar News