అమ్మ త‌న‌ను టార్గెట్ చేశార‌న్న ప్ర‌ముఖ హీరో

Update: 2017-07-30 05:03 GMT
విష‌యం ఏదైనా ఓపెన్ గా చెప్ప‌టానికి చాలా ధైర్యం ఉండాలి. ప‌లు ర‌కాల ప‌రిమితుల మ‌ధ్య బ‌తికేసే ప్ర‌ముఖులు.. నోరు విప్పి స్వేచ్ఛ మాట్లాడే ప‌రిస్థితి చాలావ‌ర‌కూ ఉండ‌దు. అందుకే ఆచితూచి మాట్లాడుతుంటారు. ఒక‌వేళ ఓపెన్ అయిన వారు సంచ‌ల‌నంగా మారి.. వార్త‌ల్లో క‌నిపిస్తూ ఉంటారు. ఈ మ‌ధ్య వ‌ర‌కూ లో  ప్రొఫైల్ తో వ్య‌వ‌హ‌రించిన ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ అందుకు భిన్న‌మైన తీరును  గ‌డిచిన కొన్ని నెల‌లుగా ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

ఇంకా క‌చ్ఛితంగా చెప్పాలంటే త‌మిళ‌నాడు అమ్మ జ‌య‌ల‌లిత మ‌ర‌ణం వ‌ర‌కూ క‌మ‌ల్ హాస‌న్ తీరు ఒక‌లా.. త‌ర్వాతి కాలంలో మ‌రోలా ఉంద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. గ‌తంలో ఎప్పుడూ లేనంత ముక్కుసూటిగా ఆయ‌న వ్యాఖ్య‌లు ఈ మ‌ధ్య‌న ఉంటున్నాయి. తాజాగా ఒక ప్ర‌ముఖ ఛాన‌ల్‌ కు క‌మ‌ల్ హాస‌న్ ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర అంశాల‌తో పాటు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు కూడా ఉన్నాయి.

దివంగ‌త అమ్మ జ‌య‌ల‌లిత మీద ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌టం కొత్త కాదు కానీ.. సీఎంగా ఉన్న‌ప్పుడు జ‌య‌ల‌లిత త‌న సినీ జీవితం మీద‌న ప్ర‌త్యేకంగా టార్గెట్ చేశార‌ని చెప్పారు. విశ్వ‌రూపం  సినిమాలో తాను ఓ సామాజిక వ‌ర్గాన్ని కించ‌ప‌ర్చ‌లేద‌ని.. ఆ విష‌యాన్ని వారే అంగీక‌రించార‌న్నారు. కానీ ఆ సినిమా విడుద‌ల‌కు ముందు చోటు చేసుకున్న ప‌రిణామాల‌కు నాటి పాల‌కులు చేసిన రాజ‌కీయ‌మేన‌ని చెప్పారు.

నాటి పాల‌కుల తీరుతో విసిగిపోయే తాను రాష్ట్రం లేదంటే దేశం విడిచి వెళ్లిపోతాన‌ని చెప్పాన‌ని వెల్ల‌డించారు. తాను విడిచిపెట్టి వెళ‌తాన‌ని చెప్ప‌ట‌మంటే.. తెల్ల‌దొర‌ల‌తో చేరిపోతాన‌ని కాద‌ని.. వేధింపులు లేని మ‌రో రాష్ట్రంలో స్థిర‌ప‌డ‌తాన‌ని చెప్పార‌న్నారు. తాను తీసుకున్న నిర్ణ‌యానికి సిగ్గుప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని.. తాను తీసుకున్న నిర్ణ‌యానికి కార‌ణ‌మైన నేత‌లు సిగ్గుప‌డాల‌న్నారు.

మ‌న‌సులో ఏదో పెట్టుకొని మాట్లాడ‌టం లేద‌ని.. విమ‌ర్శ‌లు సంధించ‌టం లేద‌ని స్ప‌ష్టం చేసిన క‌మ‌ల్‌.. త‌న మ‌న‌సులోని విష‌యాన్ని ప్ర‌జ‌ల‌తో పంచుకుంటున్న‌ట్లుగా స్ప‌ష్టం చేశారు. దేశాన్ని మంచి మార్గంలో న‌డిపించాల‌ని ఒక పౌరుడిగా కోరుకుంటున్నాన‌ని.. విమ‌ర్శించ‌టం త‌న హ‌క్కువ‌గా వెల్ల‌డించారు. త‌న తీరును ఎవ‌రు త‌ప్పు ప‌ట్టినా ప‌ట్టించుకోన‌ని స్ప‌ష్టం చేశారు.

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పార్టీ పెట్టినా.. త‌ప్పులు ఉంటే మాత్రం విమ‌ర్శించేందుకు ఏ మాత్రం వెనుకాడ‌న‌ని చెప్పిన క‌మ‌ల్‌.. త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను ఉన్న వారిని కాకుండా నిపుణులను మాత్ర‌మే వెతుకుతున్న‌ట్లుగా చెప్పారు. త‌న‌కు క‌నీసం ప్రాధ‌మిక విద్య కూడా లేద‌ని కొంద‌రు హేళ‌న చేస్తున్నార‌ని.. కానీ కామ‌రాజ‌నాడార్ సైతం చ‌దువుకోలేద‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌త్యేక స‌మ‌ర్థ‌త ఉన్న వారిగా కామ‌రాజ‌నాడార్ గుర్తింపు పొందార‌ని.. అదే తీరులో శివాజీ గ‌ణేశ‌న్ .. ఎంజీ రామ‌చంద్ర‌న్ లు కూడా ఉన్న‌త చ‌దువులు చ‌ద‌వ‌లేద‌ని గుర్తు చేయ‌టం గ‌మ‌నార్హం. వారంతా పెద్ద పెద్ద చ‌దువులు చ‌దువుకోకున్నా.. తామున్న రంగాల్లో మాత్రం నిష్ణాతులుగా నిరూపించుకున్న విష‌యాన్ని గుర్తు చేశారు.

బ్యాడ్ ల‌క్ ఏమిటంటే ఇప్పుడు అలాంటి నేత‌లు లేర‌ని.. నిర్మాత‌గా.. నటుడిగా స‌రైన మార్గంలో తాను వెళుతున్న‌ట్లుగా చెప్పారు. క్ర‌మం త‌ప్ప‌కుండా ఆదాయ‌ప‌న్నును క‌డుతున్నాన‌ని చెప్పిన క‌మ‌ల్‌.. త‌మ ఇంట్లో అంద‌రం అన్ని విష‌యాల గురించి మాట్లాడుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇంట‌ర్వ్యూలో భాగంగా క‌మ‌ల్ వ్యాఖ్య‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. రాజకీయాల్లోకి క‌మ‌ల్ ఎంట్రీ ఇస్తార‌న్న వార్త‌లు వ‌స్తున్న వేళ‌.. త‌నలోని లోపాల్ని ఎత్తి చూపిస్తున్న వారికి.. త‌న తాజా ఇంట‌ర్వ్యూతో స‌మాధానం ఇచ్చిన‌ట్లుగా క‌మ‌ల్ మాట‌లు ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News