అవార్డుకు నామినేట్ చేసినందుకు క్వీన్ దావా?

Update: 2022-08-22 04:18 GMT
త‌న ప్ర‌తిభ‌కు త‌గిన గుర్తింపు ద‌క్క‌క‌పోతే ఏ క‌ళాకారిణి అయినా ఆవేద‌న చెంద‌డం స‌హ‌జం. కానీ ఇక్క‌డ త‌న ప‌ని తీరుకు గుర్తింపు ద‌క్కింది. అద్భుత‌ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నందుకు అత్యుత్త‌మ‌ అవార్డుకు నామినేట్ చేశారు. కానీ స‌ద‌రు క‌ళాకారిణి నుంచి అనూహ్య‌మైన స్పంద‌న ఎదురైంది. త‌న‌ను అవార్డుకు నామినేట్ చేసినందుకు స‌ద‌రు అవార్డుల క‌మిటీపై దావా వేస్తున్నాన‌ని హెచ్చ‌రించింది.

ఇంత‌కీ ఎవ‌రా న‌టీమ‌ణి అంటే.. ది గ్రేట్ క్వీన్ కంగ‌న ర‌నౌత్. తనను నామినేట్ చేసినందుకు కంగ‌న‌ ఫిల్మ్‌ఫేర్ పై దావా వేయనుంది. బయోపిక్ మూవీ 'తలైవి'లో త‌న అద్భుత న‌ట‌న‌ను గుర్తించి పురస్కారానికి నామినేట్ చేయ‌గా ఫిల్మ్‌ఫేర్ పై దావా వేయాలని కంగ‌న నిర్ణయించుకుంది.ఈ అనూహ్య‌ నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని పేర్కొంటూ ఇన్ స్టాలో సుదీర్ఘమైన నోట్ ను రాసింది.

''నేను 2014 నుండి ఫిలింఫేర్ వంటి అన్యాయంతో కూడుకున్న‌ అనైతిక అవినీతి అవార్డుల‌ను  పద్ధతులను నిషేధించాను. కానీ ఈ సంవత్సరం వారి అవార్డు ఫంక్షన్ కు హాజరు కావాలని నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. ఎందుకంటే త‌లైవిలో న‌ట‌న‌కు అవార్డిస్తార‌ట‌. వారు ఇప్పటికీ నన్ను నామినేట్ చేస్తున్నారని తెలిసి నేను షాక్ అయ్యాను. ఏమైనప్పటికీ ఇలాంటి అవినీతి చర్యలను ప్రోత్సహించడం నా గౌరవం- పని.. నీతి.. విలువల‌ వ్యవస్థకు దిగువన ఉంది. అందుకే నేను ఫిల్మ్ ఫేర్ పై దావా వేయాలని నిర్ణయించుకున్నాను ... ధన్యవాదాలు'' అని కంగనా నోట్ లో పేర్కొంది.

నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులను తన ఖాతాలో వేసుకున్న కంగనా ఫిలింఫేర్ అవినీతిపై ప‌దే ప‌దే ప్ర‌శ్నిస్తూనే ఉంటుంది. క్వీన్ ముక్కుసూటిత‌నం ఇండ‌స్ట్రీకి న‌చ్చ‌దు. ముఖ్యంగా ఇండ‌స్ట్రీలో మాఫియాను ప్ర‌శ్నించే త‌న త‌త్వం అస‌లే న‌చ్చ‌దు. ఆమె ముక్కుసూటి వైఖరికి దుందుడుకు స్వ‌భావానికి నోటి దురుసుకు ప‌రిశ్ర‌మ‌లో అంతా శ‌త్రువులుగా మారారు.

కంగ‌న న‌టించిన త‌లైవి - ధాక‌డ్ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాపైన సంగ‌తి తెలిసిందే. కానీ త‌లైవిలో న‌ట‌న‌కు కంగ‌న‌కు చ‌క్క‌ని పేరొచ్చింది. ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌త్వంతోనూ కంగ‌న బిజీగా ఉంది. 'మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ' తర్వాత కంగనా మళ్లీ డైరెక్షన్ లోకి రావ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్ర‌లో కంగ‌న న‌టిస్తోంది. ఎమర్జెన్సీ-  టైటిల్ కి త‌గ్గ‌ట్టే 25 జూన్ 1975న ఇందిరాగాంధీ ప్రకటించిన అంతర్గత అత్యవసర పరిస్థితికి సంబంధించిన కథాంశంతో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. 1977 మార్చి 21న‌  చారిత్రాత్మక ఎన్నికల్లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చే వరకు ఏం జ‌రిగింద‌న్న‌ది తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు.

'ఎమర్జెన్సీ'లో దివంగత ప్రధానిని గుర్తుకు తెచ్చే ఆహార్యం కోసం కంగ‌న చాలా క‌స‌ర‌త్తు చేసార‌ని ఇటీవ‌ల రిలీజైన ఫ‌స్ట్ లుక్ వెల్ల‌డించింది. అయితే 'సర్' అనే పదాన్ని ఉచ్చరించడానికి కంగనా ఇంకా నేర్చుకోవాల్సిన అవ‌సరం ఉందని విమర్శకులు వెంటనే ఎత్తి చూపారు.
Tags:    

Similar News