'మణికర్ణిక' కు ఉన్న గొడవలు చాలవని..

Update: 2018-11-30 10:59 GMT
మన క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలై.. ఆ తర్వాత కథానాయిక కంగనా రనౌత్ చేతికి వెళ్లిన ‘మణికర్ణిక’ చిత్రాన్ని వివాదాలు వీడట్లేదు. క్రిష్ ఈ సినిమా చివరి దశలో తప్పుకోవడం దగ్గర్నుంచి ఎణ్నో వివాదాలు ఈ చిత్రాన్ని చుట్టు ముట్టాయి. తాజాగా ఈ సినిమా మరో వివాదంతో వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమా టాకీ పార్ట్ ఇంకా పూర్తి కాలేదు. అవి చివరి దశలో ఉండగా జూనియర్ ఆర్టిస్ట్‌లు.. టెక్నీషియన్లు.. ఇతర వర్కర్లు ఎక్కడి పనులు అక్కడే వదిలేసి సెట్‌ నుంచి వెళ్లిపోయారట. మూడు నెలలుగా తాము పని చేస్తున్నప్పటికీ నిర్మాతలు డబ్బులు చెల్లించడం లేదంటూ వీళ్లంతా ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయిస్‌ (ఎఫ్‌ డబ్ల్యూఐసీఈ)ను ఆశ్రయించారు.

‘‘లైట్‌ మ్యాన్‌ లకు మాత్రమే దాదాపు రూ.90లక్షలు చెల్లించాలి. జూనియర్‌ ఆర్టిస్టులకు రూ.20 లక్షలు ఇవ్వాలి. నిర్మాత కమల్‌ జైన్‌ అక్టోబరుకల్లా బాకీ డబ్బులు ఇచ్చేస్తాం అని చెప్పారు. కానీ ఇంతవరకు ఇవ్వలేదు. మేం కమల్‌ కు ఫోన్‌ చేస్తున్నా కూడా ఆయన సమాధానం ఇవ్వడంలేదు. మూడు నెలలుగా డబ్బులు తీసుకోకుండానే పని చేస్తూ వచ్చాం. చిత్రీకరణ నిలిపివేస్తే వర్కర్లకు డబ్బులు చెల్లించేది లేదని బెదిరిస్తున్నారు. నిర్మాతలు వర్కర్ల బాధను కూడా అర్థంచేసుకోవాలి. వారికి బీమా ఉండదు. సెట్లో వారికి రక్షణ ఉండదు, భద్రతా సిబ్బంది ఉండరు. అదీకాకుండా వారికి పెట్టే ఆహారం కూడా నాణ్యమైనది ఉండదు. మాకు రోజువారీ డబ్బులు కూడా ఇవ్వకుంటే ఎలా’’ అంటూ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ అశోక్‌ దూబే మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. కార్మికులు పని ఆపేసిన నేపథ్యంలో అనుకున్న ప్రకారం జనవరి 25న ‘మణికర్ణిక’ రిలీజవుతుందా లేదా అన్నది సందేహంగా మారింది. ఈ రీషూట్ల వల్ల.. సినిమా ఆలస్యం కావడం వల్ల బడ్జెట్ హద్దులు దాటింది. దానికి తగ్గట్లు బిజినెస్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఓ నిర్మాణ భాగస్వామి ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు కూడా.


Tags:    

Similar News