1000 శాతం రిట‌ర్నులు కేజీఎఫ్ త‌ర్వాత ఈ మూవీకే

Update: 2022-11-16 01:30 GMT
కాంతారా బాక్సాఫీస్ వ‌ద్ద ఇప్ప‌టికీ రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఈ మూవీ హిందీ వెర్ష‌న్ ఇప్పుడు స‌రికొత్త చ‌రిత్ర‌ను తిరగ రాసింది. బాలీవుడ్ లో కాశ్మీర్ ఫైల్స్ తర్వాత చరిత్రను పునరావృతం చేస్తూ 1000శాతం రిటర్న్ లను సాధించే మూవీగా రికార్డుల‌కెక్కుతోంది. కాంతారా ఇప్పటికీ హిందీ బాక్సాఫీస్ వద్ద నెమ్మ‌దించ‌లేదు.

సెప్టెంబరు 30న విడుదలైన ఈ చిత్రం ఉత్త‌రాదిన‌ చారిత్రాత్మక వ‌సూళ్ల‌తో అజేయంగా దూసుకుపోతోంది. 46 రోజుల తర్వాత కూడా థియేట్రికల్ రన్ ఎప్పుడు ముగుస్తుందో ఊహించడం కష్టం అనేంత‌గా జ‌నాల‌ను  ఆక‌ర్షిస్తోంద‌ని హిందీ మీడియా పేర్కొంటోంది. 1000 శాతం రిటర్న్స్ తో ఇది బ‌య్య‌ర్ల‌కు ఊహించని ట్రీటిస్తోంది.

నిజానికి KGF ఫ్రాంచైజీ తర్వాత క‌న్న‌డ రంగం నుంచి కాంతారా రియ‌ల్ సెన్సేష‌న్ గా మారింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి క‌థానాయ‌కుడిగా న‌టించిన‌ ఈ చిత్రం హిందీ మార్కెట్ లో ల్యాండ్ మార్క్ విజయాన్ని సాధించింది. ఇది శాండల్ వుడ్ ఇండస్ట్రీని మ‌రో మెట్టు పైకి ఎక్కించింది. లాభదాయకత విషయానికొస్తే.. ఈ చిత్రం 1000 శాతం లాభాలతో దూసుకుపోతున్నందున డిస్ట్రిబ్యూటర్లు- ఎగ్జిబిటర్లు -పెట్టుబడిదారులు జాక్ పాట్ కొట్టారని హిందీ స‌ర్కిల్స్ లో ముచ్చ‌ట సాగుతోంది.

కాంతారా (హిందీ) ఇప్పటివరకు 76 కోట్ల నికర ఆదాయం రాబట్టింది. ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ కేవ‌లం 7.50 కోట్లు. కాబట్టి రిటర్న్స్  ప్ర‌కారం రాబడులు 913.33 శాతం వద్ద ఉన్నాయి. ఈ చిత్రం అతి త్వరలో 1000  శాతం రిట‌ర్నుల‌తో సెన్సేష‌న్ అవుతుందని భావిస్తున్నారు. ఇదే జరిగితే `ది కాశ్మీర్ ఫైల్స్` తర్వాత 1000శాతం లాభాలను ఆర్జించిన ఏకైక హిందీ డ‌బ్బింగ్ చిత్రంగా చరిత్ర సృష్టిస్తుంది. కేజీఎఫ్ థియేట్రికల్ రన్ లో 1162 శాతం రాబడిని సాధించింది.

మ‌రోవైపు రీసెంట్ గా రిషబ్ శెట్టి... సూపర్ స్టార్ రజనీకాంత్ ని కలిసి సినిమా సక్సెస్ సంబరాలు చేసుకున్నాడు. రజనీకాంత్ కాంతారా పాత్ర‌లో రిషబ్ న‌ట‌న‌పై ప్రశంసలు కురిపించారు. ``తెలిసిన దానికంటే తెలియనిది ఎక్కువ. హోంబాలే చిత్రాలన్నిటిలో దీని కంటే బెట‌ర్ ఏది అంటే ఎవరూ చెప్పలేరు. రిషబ్- రచయితగా.. దర్శకుడిగా.. నటుడిగా మీకు హ్యాట్సాఫ్`` అని ర‌జ‌నీ పొగిడేసారు. హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియాలో రిషబ్ శెట్టి -రజనీకాంత్ ఫోటోలను షేర్ చేసిన సంగ‌తి తెలిసిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News