5కోట్ల ఓపెనింగ్ తేలేని స్టార్ కి 20కోట్లు ఎందుకు?

Update: 2023-01-06 03:56 GMT
పోడ్ కాస్ట్ అనేది త‌మ‌లోని ఇన్న‌ర్ వ్యూని ఎలివేట్ చేసుకునేందుకు ఉప‌యోగ‌ప‌డే అద్భుత మంత్రం. దీనిని టాలీవుడ్ లో పూరి జ‌గ‌న్నాథ్.. బాలీవుడ్ లో క‌ర‌ణ్ జోహార్ ఎంతో స‌మ‌ర్థంగా స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. పూరి పోడ్ కాస్ట్ ల‌కు విప‌రీత‌మైన బ‌జ్ ఉంది. అత‌డి ముక్కుసూటిత‌నం సంభాష‌ణ‌ల్లో పంచ్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. పూరి కొన్ని విలువైన సూచ‌న‌లు స‌ల‌హాలతోను యువ‌త‌రాన్ని ఆక‌ట్టుకుంటున్నాడు.

ఇటీవ‌ల‌ క‌ర‌ణ్ జోహార్ పోడ్ కాస్ట్ లు అంతే వైర‌ల్ అవుతున్నాయి. అత‌డు తాజా పోడ్ కాస్ట్ లో రూ.20 కోట్ల పారితోషికం అడిగే స్టార్ల‌పై పంచ్ వేసాడు. రూ.5 కోట్ల ఓపెనింగ్ కు అయినా భరోసా ఇవ్వలేని వారు ఇలా అడిగేందుకు అన‌ర్హుల‌ని తీవ్రంగా వ్యాఖ్యానించారు. మునుముందు పోడ్ కాస్ట్ లో కరణ్ జోహార్ సినిమా రంగం గురించి సినిమా వ్యాపారం గురించి చర్చించబోతున్నాడు. డే వ‌న్ లో రూ.5 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌లేని హీరో రూ.20 కోట్లు అందుకోవ‌డం దండ‌గ! అని చెబుతున్నాడు. ఇటీవ‌లే ఒక ఇంటర్వ్యూలో అలాంటి వారంద‌రినీ భ్రాంతిలో ఉంటార‌ని కూడా కామెంట్ చేశారు క‌ర‌ణ్‌.

ద‌ర్శ‌క‌నిర్మాత కరణ్ జోహార్ పాడ్ క్యాస్ట్ తాజా ఎపిసోడ్ లో పరిశ్రమలో అవ్య‌వ‌స్థ‌పైనా అడ్డ‌గోలు డిమాండ్ల‌ పైనా చిందులు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక ఇదే పోడ్ కాస్ట్ షో కొత్త ప్రోమోలో అలియా భట్- వరుణ్ ధావన్- సిద్ధార్థ్ మల్హోత్రాలను లాంచ్ చేస్తూ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రంతో తాను ఎలా డబ్బు పోగొట్టుకున్నాడో వెల్ల‌డించాడు. అంతేకాదు.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అత్యంత లాభదాయకమైన ప‌రిశ్ర‌మ అని కితాబిచ్చాడు.

మాస్టర్స్ యూనియన్ పోడ్ కాస్ట్ లో కరణ్ జోహార్ మాట్లాడుతూ.. తన కంపెనీ ధర్మ ప్రొడక్షన్ స్టార్టప్ లాగా ఇద్దరు వ్యక్తులతో ప్రారంభమైంది. అలాగే యష్ చోప్రా తనతో క‌లిసి సినిమా చేస్తే అది ఎప్పుడూ విఫలం కాదు.. బడ్జెట్ ని తిరిగి తెచ్చేస్తుంది! అని గుర్తు చేసుకున్నాడు. ''నేను మీకు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ గురించి చెప్పాలంటే ఒక హిట్ సినిమా చేసి నా డబ్బు పోగొట్టుకున్నాను. ఆ స‌మ‌యంలో నేను ప్రతి రాత్రి నిద్ర‌పోవ‌డానికి పిల్ (నిద్ర మాత్ర‌) వాడాను! అని తెలిపాడు.

నాలో చాలా ఎమోషన్ ఉంది. నా హృదయం ఎప్పుడూ హిందీ సినిమా చుట్టూనే ఉంది. కానీ మీరు నన్ను ప్ర‌శ్నిస్తే.. ఒక బిజినెస్ మేన్ గా టాలీవుడ్ చాలా లాభదాయకమైన పరిశ్రమ అని భావిస్తున్నాను అన్నారు. సినిమా ద్వారా వ‌చ్చే డబ్బులో ఎవరికి ఎలా వాటాలు పంచుతారు? అని ప్ర‌శ్నించ‌గా.. క‌ర‌ణ్‌ ఇలా సమాధానమిచ్చారు, ''దురదృష్టవశాత్తూ అందులో కొంత భాగం సినీ తారల వద్దకు వెళుతుంది. ఇలా మాట్లాడినందుకు నన్ను హత్య చేసి ఉండొచ్చు.. కానీ మీరు 5 కోట్ల ఓపెనింగులకు ప‌రిమిత‌మై 20 కోట్లు అడుగుతున్నారంటే అది ఎంతవరకు న్యాయం? భ్రమ అనేది టీకా లేని ఒక వ్యాధి'' అని కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు.

అదే వీడియోలో కరణ్ పరిశ్రమలో 'నల్లధనం' లేదని కూడా నొక్కి చెప్పాడు. త‌ప్పుడు దారుల్లో ఎలాంటి డబ్బు రాదని ఆయన హామీ ఇచ్చారు. ప్రోమోపై అభిమానులు స్పందిస్తూ కామెంట్ సెక్షన్ లో త‌దుప‌రి పూర్తి ఎపిసోడ్ కోసం వేచి చూస్తున్నామ‌ని ఉత్సాహాన్ని క‌న‌బ‌రిచారు. దీనికి అభిమానుల స్పంద‌నలు అనూహ్యం.''మీరు అతన్ని ద్వేషించవచ్చు లేదా ప్రేమించవచ్చు. కానీ మీరు అతన్ని విస్మరించలేరు. అదీ కరణ్ జోహార్ అంటే! అత‌డు ఎక్కువగా తెలుగు సినిమా- సౌత్ సినిమాల గురించి వాటి వ్యాపారం రేంజ్ గురించి నిజాయితీగా ఉంటాడు. అందుకు నేను కరణ్ ని అభినందిస్తున్నాను. మొత్తం పోడ్ కాస్ట్ కోసం వేచి చూస్తున్నాను'' అని దీనికి ఒక అభిమాని వ్యాఖ్యానించారు.

అయితే భారీ పారితోషికాలు డిమాండ్ చేసే నటీనటులపై విరుచుకుపడటం క‌ర‌ణ్‌ కి ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు 2018లో పరిశ్రమలోని కొంద‌రు ప్రముఖ స్టార్లు ఇప్పటికీ ప్రేక్షకులను ఆకర్షించే శక్తి తమకు ఉందని నమ్ముతారు. నిరంత‌రం భ్ర‌మ‌ల్లో ఉంటారు! అని ఘాటుగా విమ‌ర్శించారు. వీరంతా రెండంకెల పారితోషికాలు డిమాండ్ చేస్తున్నార‌ని.. అయితే ఆ స్థాయి ఓపెనింగులు తేలేర‌ని కూడా వ్యాఖ్యానించారు.

ఈ రోజు నేను కొత్త టాలెంట్ ని కొత్త అబ్బాయి లేదా అమ్మాయిని లాంచ్ చేయాలనుకుంటే ఆ చిత్రాన్ని ఎవరూ చూడటం లేదు. ఎందుకంటే ప్ర‌చారం చేస్తే కానీ వారు ఎవ‌రో ఎవ‌రికీ తెలీదు. కాబట్టి మేము ఆ సినిమాను ఎంతగానో ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. హిందీలో కానీ ఇత‌ర మార్కెట్ల‌లో కానీ సినిమా బిజినెస్ జరుగుతున్న విధానం హాస్యాస్పదంగా ఉంది... అని కూడా అన్నారు. కరణ్ జోహార్ కొంత గ్యాప్ త‌ర్వాత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' ఈ సంవత్సరం విడుదల కానుంది. ఇందులో అలియా భట్- రణవీర్ సింగ్- ధర్మేంద్ర- షబానా అజ్మీ-జయా బచ్చన్ నటిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News