అదిరిపోయే నిర్ణయం తీసుకున్న నడిగర్

Update: 2016-07-07 04:52 GMT
దక్షిణ భారత నటీనటుల సంఘం.. షార్ట్ గా నడిగర్ సంఘం తాజాగా ఒక ఆసక్తికర నిర్ణయాన్ని ప్రకటించింది. నిజానికి పలు సంఘాలకు స్ఫూర్తినిచ్చే ఈ నిర్ణయాన్ని తెలుగు నటీనటుల సంఘం తీసుకుంటే బాగుంటుందన్న భావనకలగటం ఖాయం. ఇంతకీ నడిగర్ తీసుకున్న తాజా నిర్ణయంలోకి వెళితే.. ఎన్నికల సందర్భంగా హీరో విశాల్.. నాజర్ బృందం తాము గెలిస్తే ఏమేం చేస్తామన్న అంశాలపై హామీలు ఇచ్చారు. నడిగర్ సంఘానికి భారీ భవనం.. కల్యాణ మండపటం.. ప్రివ్యూ థియేటర్.. మీటింగ్ హాల్.. అసోసియేషన్ బిల్డింగ్.. జిమ్..డ్యాన్స్ ప్రాక్టీస్ హాల్ లాంటివి నిర్మిస్తామని చెప్పారు. ఇందుకోసం రూ.29 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.

ఈ నిధుల సేకరణలో భాగంగా ఈ మధ్యన నిర్వహించిన స్టార్స్ క్రికెట్ మ్యాచ్ ద్వారా రూ,9కోట్ల నిధిని రాబట్టిన సంఘం.. తాజాగా మిగిలిన నిధిని సమీకరించేందుకు రెండు మల్టీస్టారర్ మూవీస్ చేయాలని డిసైడ్ చేశారు. ఇందులో ఒక చిత్రంలో విశాల్ తో పాటు.. మరో యువ హీరో కార్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఒక కథను ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. రెండు నెలల వ్యవధిలో పూర్తి చేసే ఈ సినిమాకు ఇద్దరు హీరోలు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోరు. తమ రెమ్యూనరేషన్.. సినిమా మీద వచ్చే ఆదాయాన్ని నడిగర్ సంఘానికి మళ్లిస్తారు. ఈ సినిమా ద్వారా రూ.25కోట్లు సమకూరుతాయని భావిస్తున్నారు.

ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలని భావిస్తున్నారు. నడిగర్ సంఘానికి సంబంధించిన భవన నిర్మాణాన్ని ఆగస్టులో పనులు మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మరో సినిమాను కూడా ఈ ఏడాదే నిర్మించనున్నారు. ఈ చిత్రంలో యువహీరోలు ఆర్య.. జయం రవిలు కలిసి నటించనున్నారు. ఎన్నికల సందర్భంగా తామిచ్చిన హామీల్ని నెరవేర్చేందుకు నడిగర్ సంఘం తీసుకున్న తరహా నిర్ణయాన్ని టాలీవుడ్ స్ఫూర్తిగా తీసుకుంటే బాగుంటుందన్న భావన వ్యక్తమవుతోంది. మరి.. మనోళ్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News