నాగార్జున నిండా మునిగాడు.. వెంక‌టేష్ ఫుల్లుగా మేలుకున్నాడు!

Update: 2021-07-19 10:51 GMT
సినిమా అంటే.. ఫ‌క్తు వ్యాపారం. కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టేది సాధ్య‌మైనంత మేర లాభం సంపాదించ‌డానికే. అందులో ఎవ్వ‌రికీ సందేహ‌మే అవ‌స‌రం లేదు. అయితే.. ఇందుకోసం తీసుకుంటున్న నిర్ణ‌యాలు ఒక్కోసారి ఊహించ‌ని న‌ష్టాల‌కు గురిచేస్తాయి. వేసిన అంచ‌నాలు త‌ప్ప‌డంతో.. దారుణ ఫ‌లితాల‌ను, ప‌రాభ‌వాన్ని చ‌విచూడాల్సి వ‌స్తుంది. కింగ్ నాగార్జున సినిమా ఇదే ప‌రిస్థితిని ఎదుర్కొని నిండా మునిగిపోయింది. దీంతో.. ఈ అనుభ‌వాన్ని గుణ‌పాఠంగా తీసుకొని వెంక‌టేష్ సినిమా ప‌ర్ఫెక్టుగా మేలుకున్న‌ది. ఆ వివ‌రాలేంట‌న్న‌ది ఇప్పుడు చూద్దాం.

విక్ట‌రీ వెంక‌టేష్ లేటెస్ట్ మూవీ నార‌ప్ప‌. త‌మిళంలో ధ‌నుష్ హీరోగా వ‌చ్చిన 'అసురన్' చిత్రానికి రీమేక్ ఇది. తమిళనాట దుమ్ములేపిన ఈ చిత్రం.. ఘ‌న విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా.. ధ‌నుష్ ను అద్భుత‌మైన న‌టుడిగా నిల‌బెట్టింది. ఆ చిత్రాన్ని వెంక‌టేష్ హీరోగా తెలుగులో రీమేక్ చేశారు. వెంకీ సోద‌రుడు సురేష్ బాబు, క‌లైపులి ఎస్ థాను భాగ‌స్వామ్యంలో ఈ సినిమా నిర్మించారు. అయితే.. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా.. ఈ చిత్రాన్ని థియేట‌ర్లో కాకుండా.. ఓటీటీలో రిలీజ్ చేయ‌డానికి మేక‌ర్స్ సిద్ధ‌మ‌య్యారు. ఈ ఆలోచ‌న‌పై ఎగ్జిబిట‌ర్స్ ఆవేద‌న‌ వ్య‌క్తం చేశారు. నిర‌స‌న కూడా తెలిపారు. థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌క‌పోతే తాము తీవ్రంగా న‌ష్ట‌పోతామ‌ని అన్నారు. అయిన‌ప్ప‌టికీ.. నిర్మాత‌లు ఓటీటీలోనే రిలీజ్ చేయ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. మ‌రి, వెంక‌టేష్ లాంటి అగ్ర‌హీరో చిత్రాన్ని ఓటీటీలోనే ఎందుకు రిలీజ్ చేయాల్సి వస్తోంది అన్న‌ప్పుడు సినిమా వ్యాపారం తెర‌పైకి వ‌స్తోంది.

దీనికి ఉదాహ‌ర‌ణ తీసుకోవాల్సి వ‌స్తే.. ప‌ర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నాగార్జున 'వైల్డ్ డాగ్' మూవీ. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా వ‌చ్చిన‌ ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయ‌డానికి తొలుత‌ ఒప్పందం చేసుకున్నారు. నెట్ ఫ్లిక్స్ లో సంక్రాంతికే స్ట్రీమింగ్ చేయ‌డానికి ప్లాన్ చేశారు. కానీ.. అప్పుడే థియేట‌ర్లు తెరుచుకోవ‌డం.. 'క్రాక్' వంటి చిత్రం భారీ వసూళ్లు సాధించడంతో 'వైల్డ్ డాగ్' నిర్మాతలకూ ఆశ కలిగింది. దీంతో.. ఓటీటీ అగ్రిమెంట్ చింపేయడానికి సిద్ధపడ్డారు.

అయితే.. ఈ సినిమాకు ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌ నెట్ ఫ్లిక్స్ క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్ ఇచ్చింది. దాదాపు రూ.25 కోట్ల పైన చెల్లించి సినిమాను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిందని టాక్‌. నిజానికి.. వైల్డ్ డాగ్ అనేది ఒక వ‌ర్గం ప్రేక్ష‌కులు మాత్ర‌మే ఆద‌రించే సినిమా. యాక్ష‌న్ ఇష్ట‌ప‌డే వారు మాత్ర‌మే ఈ సినిమాను ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ.. అంత మొత్తం ఆఫ‌ర్ చేసిందట‌ నెట్ ఫ్లిక్స్‌. దీంతోపాటు.. శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ క‌లిపితే.. మొత్తంగా 30 కోట్ల పైన ఈ చిత్రం క‌లెక్ట్ చేసేది. ఇదే జ‌రిగితే.. నిర్మాత‌ల‌కు టేబుల్ ప్రాఫిట్ ఉండేది. కానీ.. అవ‌న్నీ కాద‌నుకొని థియేట‌ర్ లోనే రిలీజ్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఓటీటీ నుంచి వ‌దులుకున్న మొత్తాన్ని రాబ‌ట్టడానికి.. క‌నీసం 50 కోట్ల గ్రాస్ టార్గెట్ ఈ చిత్రం థియేట‌ర్లోకి అడుగు పెట్టింది.

కానీ.. ఈ సినిమా డ‌బుల్‌, త్రిబుల్ డిజాస్ట‌ర్ గా మిగిలిపోయింది. దీంతో.. ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితి నిర్మాత‌ల‌ది. ఓటీటీలోనే విడుద‌ల చేసుకున్నాపోయేది అని ఆ త‌ర్వాత నిట్టూర్చారు. దీంతో.. నార‌ప్ప టీమ్ ముందుగానే జాగ్ర‌త్త ప‌డింది. ఈ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ.35 కోట్ల ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. దీంతో.. మేక‌ర్స్ ఏమీ ఆలోచించ‌కుండా ఓటీటీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. ఆ విధంగా.. సినిమా రిలీజ్ కు ముందే లాభాల పంట పండించుకుంద‌న్న‌మాట‌. మ‌రికొన్ని గంట‌ల్లో ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.
Tags:    

Similar News