‘బిగ్ బాస్’ డబ్బులతో జ్యోతి ఏం చేసిందంటే..

Update: 2017-08-01 11:57 GMT
ఐటెం గర్ల్.. వ్యాంప్ క్యారెక్టర్లతో టాలీవుడ్లో ఒక రకమైన బ్యాడ్ ఇమేజ్ తెచ్చుకుంది జ్యోతి. మధ్యలో ఓ కాంట్రవర్శీ వల్ల ఆమె మీద బ్యాడ్ ఇంప్రెషన్ మరింత పెరిగింది. ‘బిగ్ బాస్’ షో నుంచి అందరి కంటే ముందు జ్యోతి ఎలిమినేట్ కావడానికి కూడా ఆమె మీద మిగతా పార్టిసిపెంట్లలో.. జనాల్లో ఉన్న వ్యతిరేకతే కారణం. కానీ జ్యోతిలోని మరో కోణం ఏంటన్నది ఇప్పుడు అందరికీ తెలిసొస్తోంది.

‘బిగ్ బాస్’ షో ద్వారా పారితోషకంగా అందుకున్న మొత్తంలోంచి రూ.50 వేలు తీసి.. క్యాన్సర్ బారిన పడి కష్టాలు పడుతున్న కమెడియన్ సుభాషిణి (అల్లరి ఫేమ్)కి జ్యోతి ఇవ్వడం విశేషం. సుభాషిణి దుస్థితి గురించి ఇటీవలే మీడియాలో అనేక వార్తలొచ్చాయి. చికిత్స కోసం లక్షలు ఖర్చవుతున్నప్పటికీ.. పరిశ్రమ నుంచి ఎవరూ పెద్దగా స్పందించినట్లు లేరు. ఇలాంటి స్థితిలో జ్యోతి తనకు పారితోషకంగా వచ్చిన మొత్తంలోంచి 50 వేలు తీసి సుభాషిణికి ఇవ్వడం అన్నది గొప్ప విషయం. ఇంకా కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తానని ఆమె చెప్పడం విశేషం.

జ్యోతికి కొన్నేళ్ల కిందటే పెళ్లయింది. ఆమెకో కొడుకు కూడా ఉన్నాడు. ఐతే పెళ్లయిన కొంత కాలానికే తన భర్త ఆమెను విడిచి వెళ్లిపోయాడు. అప్పట్నుంచి తనే తన కొడుకును పోషిస్తోంది. తన కొడుక్కి తండ్రి దూరం కావడం.. దాని వల్ల తాను పడుతున్న కష్టాల గురించి జ్యోతి ‘బిగ్ బాస్’ హౌస్ లో ఒకరోజు కన్నీటి పర్యంతం కావడం చూసే ఉంటారు. అప్పుడే కొందరికి ఆమెపై ఉన్న అభిప్రాయం మారింది. ఇప్పుడు చేసిన మంచి పనితో జ్యోతి ఇమేజ్ పూర్తిగా మారిపోయినట్లే.
Tags:    

Similar News