చిరుకు అవ‌మానం..సినిమా హిట్..లెక్క ఇదే!

Update: 2018-05-09 08:35 GMT
ఒక సినిమాకు ఎవ‌రిని ఎంపిక చేయాల‌నే దానికి ఎన్నో లెక్క‌లు ఉంటాయి. వినేందుకు విచిత్రంగా అనిపించినా.. మొత్తం విష‌యం తెలిసిన‌ప్పుడు నిజ‌మే క‌దా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. గ‌తంలో జ‌రిగిపోయిన విష‌యాల‌ను ఎవ‌రైనా ప్ర‌ముఖుడు చెప్పిన‌ప్పుడు ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. తాజాగా ఇలాంటి ముచ్చ‌ట‌నే చెప్పుకొచ్చారు ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు కోడి రామ‌కృష్ణ‌. ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌కు ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న త‌న కెరీర్ లో తీసిన కొన్ని సినిమాల‌కు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ విశేషాల్ని ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు

మెగాస్టార్ కాక ముందు చిరంజీవి న‌టించిన చిత్రం ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య‌. ఈ సినిమా హిట్ కావ‌టంతో చిరంజీవి కెరీర్ కు ఎంతో సాయం చేసింది. ఈ సినిమాతో ఆయ‌న‌కు మ‌రింత గుర్తింపు తెచ్చి పెట్టింది. అస‌లీ సినిమాకు చిరంజీవిని ఎందుకు సెలెక్ట్ చేశారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఈ సినిమాకు చిరును తానెందుకు ఎంపిక చేసుకున్న‌ది కోడిరామ‌కృష్ణ మాట‌ల్లోనే వింటే..

చిరులో ఉండే నేచ‌ర్ నాకు చాలా నచ్చేది. ప‌ట్టుద‌ల ఉన్న వ్య‌క్తి. బాగా యాక్ట్ చేయాల‌ని త‌పించేవారు. ఏదైనా సాధించాల‌న్న భావ‌న ఎక్కువ‌. అందుకే నా తొలి సినిమా క‌థను నిర్మాత రాఘ‌వ‌కు చెప్ప‌గానే ఎవ‌రు హీరో అన్నారు?  నేను దానికి చిరంజీవి అని చెప్పా. ఆయ‌నైతేనే సినిమాకు స‌రిపోతారండి అన్నా. త‌మ సంస్థ‌లో కొంద‌రు హీరోలు ఉన్నార‌ని.. వారిని కాకుండా చిరంజీవిని ఎలా తీసుకుంటారు? అని నిర్మాత రాఘ‌వ అడిగిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు.

నా క‌థ‌కు చిరంజీవి అయితేనే బాగుంటుద‌ని చెప్పా. దీంతో ప‌క్క‌రోజు పెద్దోళ్లంద‌రితో మీటింగ్ పెట్టి.. వారి ముందు  నిలుచోబెట్టారు. చిరంజీవి ఎందుకు తీసుకోవాలో చెప్పాలని ప్ర‌శ్నించారు. మా హీరోల‌ను కాకుండా చిరంజీవినే ఎందుకు తీసుకోవాల‌ని అనుకుంటున్నావు?అన‌్న ప్ర‌శ్న‌కు నేను చెప్పిన మాటేమిటంటే..  నా సినిమా భార్య భ‌ర్త‌ను అనుమానించ‌టం.. అవ‌మానించ‌టం. మీరు చెప్పిన హీరో కంటే చిరంజీవిని అవ‌మానిస్తే ఆడోళ్లు థ్రిల్ కు గురి అవుతారు.  అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల ఏంటీ అమ్మాయి ఇలా చేస్తుంద‌నే ఫీలింగ్‌ కు వ‌స్తారని చెప్పా.

అన్ని త‌రాల వారికి న‌చ్చిన హీరో చిరంజీవి. అయితే అప్ప‌ట్లో ఆయ‌న పెద్ద స్టార్ కాదు. టాలెంట్ ప‌రంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వ్య‌క్తిని ఎందుకు అవ‌మానిస్తున్నార‌న్న ఫీలింగ్‌ తో సినిమాకు లాభంగా మారుతుంద‌ని చెప్ప‌టంతో అంద‌రూ ఓకే చెప్పారు.

రాఘ‌వ గారి నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌టంతో చిరంజీవిని వెళ్లి క‌లిశారు. అదే స‌మ‌యంలో రెమ్యున‌రేష‌న్ గురించి అడిగారు.  మీ ఇష్టం అని చెప్పా. కొత్త కుర్రాడ్ని ఎంక‌రేజ్ చేయాలి.. అందుకే చేస్తున్నా.. అని చెప్పి ఈ సినిమా డ‌బ్బులు ఇస్తే ఇవ్వండి.. లేక‌పోతే లేద‌ని చెప్పా. త‌ర్వాత చిరంజీవిని క‌లిశారు. అదే తొలిసారి ఆయ‌న్ను క‌ల‌వ‌టం. త‌న‌కు క‌థ న‌చ్చితేనే సినిమాకు ఓకే చెబుతాన‌ని చెప్పారు.

క‌థ విన్నాక త‌న పాత్ర చాల్లేద‌న్నారు. కానీ.. పూర్ణిమ క్యారెక్ట‌ర్ ఆయ‌న‌కు బాగా న‌చ్చింది. సంగీత క్యారెక్ట‌ర్ కూడా న‌చ్చింది. ఆడోళ్లంతా లైక్ చేస్తారు కాబ‌ట్టి.. ఆ రెండు పాత్ర‌ల మ‌ధ్య నా పాత్ర సాయం చేస్తుంద‌న్నారు. విలన్ క్యారెక్ట‌ర్ కూడా న‌చ్చింద‌న్నారు. త‌న పాత్ర న‌చ్చ‌కున్నా.. మిగిలిన వారి పాత్ర‌లు న‌చ్చ‌టంతో సినిమాను చేసేందుకు ఓకే అన్నారు. త‌న పాత్ర న‌చ్చ‌కున్నా.. మిగిలిన వారి పాత్ర‌లు న‌చ్చి సినిమాను చేయ‌టం గొప్ప. అలా ఆలోచిస్తారు కాబ‌ట్టే ఈ రోజున మెగాస్టార్ అయ్యార‌ని గుర్తు చేసుకున్నారు.
Tags:    

Similar News