విశ్వ విఖ్యాత నట సార్వభౌముడి బయోపిక్... నిర్మాణం సరైన వ్యక్తి చేతిలో పడింది. అనేక ఊహాగానాలకు తెరదించుతూ దీనిపై ఒక అఫిషియల్ ప్రకటన వచ్చింది. బాలకృష్ణ కథానాయుడిగా తెరకెక్కుతున్ననందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నచిత్రం ‘యన్.టి.ఆర్’ లో నందమూరి బాలకృష్ణది టైటిల్ రోల్. తేజ చేతుల మీదుగా మొదలైన ఈ సినిమాకు ప్రత్యేక కారణాలతో ఆయన తప్పుకున్నారు. దీంతో ఈ సినిమా దర్శకుడిపై అనేక రూమర్లు వచ్చాయి. వీటికి ఈరోజు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ తెరదించారు.
ఒకానొక దశలో సినిమా ఆగిపోయినట్లే అని గాలి వార్తలు వచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో బాలకృష్ణ ఆ పని చేస్తాడని ఎవరూ నమ్మలేదు. అలా చేసి ఉంటే అది ఒక మచ్చగా ఉండిపోయేది. చివరకు కథ సుఖాంత అయ్యింది. బాలకృష్ణ కూడా *యన్.టి.ఆర్’ చిత్ర దర్శకత్వ బాధ్యతలను గౌతమి పుత్ర శాతకర్ణి వంటి చారిత్రక నేపథ్య చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడికి అప్పగించినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఒక వీడియో ప్రకటన కూడా విడుదల చేశారు.
బాలయ్య ఏమన్నారంటే... ‘నాటి రామకథను ఆ రాముడు బిడ్డలైన లవకుశలు చెప్పారు. నేటి రామకథను ఈ రాముడి బిడ్డలమైన మేము చెప్తున్నాము. చేసే ప్రతి పనిలో ప్రాణముంటుంది. ప్రతి ప్రాణానికీ ఒక కథుంటుంది. ఈ కథ ఎవరు చెప్పాలని రాసిపెట్టుందో, ఈ రామాయణానికి వాల్మీకి ఎవరో ఇప్పుడు తెలిసింది. నా నూరవ చిత్రాన్ని చరితగా మలచిన క్రిష్ జాగర్లమూడి, ఈ చరిత్రకు చిత్ర రూపాన్నిస్తున్నారని ఆనందంతో తెలియజేస్తున్నాను. ఇది మా కలయికలో రెండవ దృశ్య కావ్యం. మరో అఖండ విజయానికి అంకురార్పణం. నాన్నగారి ఆత్మ ఆశీర్వదిస్తుంది. మీ అందరి అభిమానం మమ్మల్ని నడిపిస్తుంది’ అని బాలయ్య తన ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే మరో వైపు తాను ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్టు క్రిష్ కూడా తన ట్విట్టర్లో ప్రకటించాడు.
‘నన్ను నమ్మి ఇంత బాధ్యత నాకప్పగించిన బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. ఇది కేవలం ఒక సినిమా బాధ్యత కాదు. ప్రపంచంలోని తెలుగువాళ్లందరి అభిమానానికి, ఆత్మాభిమానానికి అద్దంపట్టే బాధ్యత. మనసా వాచా కర్మణా నిర్వర్తిస్తానని మాటిస్తున్నాను’
క్రిష్ సామర్థ్యంపై ఎవరికీ అనుమానాలు లేవు గాని ఆయనకు ఇది నిజంగా ఒక సవాల్. ఇతర దర్శకుడి స్క్రిప్టుతో మొదలైన ఈ సినిమా పాత స్క్రిప్టునే క్రిష్ ఫాలో అవుతారా.. లేదంటే తన శైలికి తగ్గట్టు మార్చుతారా అన్నది ఇపుడు పెద్ద ప్రశ్న.