ఆ స్వరానికి మరణం లేదు!

Update: 2022-06-01 10:30 GMT
పాట అంటే ఒక ఒక ఉత్సవం .. పాట అంటే ఒక ఉత్సాహం. ఒంటరితనాన్ని ఓడించే  శక్తి పాటకి ఉంటుంది .. ఓడిన మనసుకు ఓదార్పు నిచ్చే శక్తి పాటకే ఉంటుంది. అలా పాటలో ప్రభవించి .. పాటగా ప్రవహించిన గాయకుల లో కెకె ఒకరిగా కనిపిస్తారు. ఆయన అసలు పేరు కృష్ణకుమార్ కున్నాత్. షార్టు కట్ లో అంతా కూడా కెకె అనేవారు. అలా ఈ రెండు అక్షరాలతోనే ఆయన పాప్యులర్ అయ్యారు. స్వరాలతో విన్యాసం చేయడం ఆయనలోని ప్రత్యేకతగా అభిమానులు చెబుతూ ఉంటారు. ఆయన గళం నుంచి  ప్రవహించే  రాగాలు మనసుపై మంత్రంలా పనిచేసేవని అంటారు.

బాలీవుడ్ గాయకుడే అయినప్పటికీ .. కేవలం ఆయన హిందీ భాషకి మాత్రం పరిమితం కాలేదు. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ  .. మరాఠీ .. బెంగాలీ .. గుజరాతీ భాషల్లోను ఆయన పాటలు పాడేవారు. పాట ఆయన లోకంగా ఉండేది .. సంగీత సామ్రాజ్యంలో ఆయన రారాజుగా విహరించేవారు. ఏ భాషలో అయినా .. సంగీత దర్శకులు ఎవరైనా తనకి ట్యూన్ నచ్చితేనే పాడేవారు. ట్యూన్ నచ్చితే పారితోషికం విషయాన్ని ఆయన పెద్దగా  పట్టించుకునేవారు కాదు.  ట్యూన్ బాగోలేకపోతే మాత్రమే ఎంత ఇస్తామని చెప్పినా పాడేవారు కాదు.

ట్యూన్ కి ఎంత ప్రాధాన్యతనిచ్చేవారో .. సాహిత్యానికి కూడా ఆయన అంతే ప్రాముఖ్యతనిచ్చేవారు. తనకి తెలియని భాషల్లో పాడేటప్పుడు .. అర్థాలు అడిగి మరీ పాడేవారు.  అప్పటికప్పుడు ఏదో పాడేశం .. వచ్చేశాం అన్నట్టుగా ఆయన ఉండేవారు కాదు. పాట ఎప్పటికీ నిలిచిపోతుంది గనుక, అది ఎప్పటికీ గొప్పగానే ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో జాగ్రత్తలు  తీసుకుని పాడేవారు. తన పాట యూత్ పై  ఒక అస్త్రంలా పనిచేయాలని ఆయన కోరుకునేవారు. అందువల్లనే తన స్వరంతో ఆయన మేజిక్ చేసేవారు. ఆ మేజిక్ వల్లనే యువత ఊగిపోయేది .. సరిహద్దులు లేని సంతోష తీరాలకు సాగిపోయేది.

తెలుగులో ముందుగా ఆయన శశి ప్రీతమ్ .. వందేమాతరం  శ్రీనివాసరావు వంటి సంగీత దర్శకుల సినిమాలలో పాడినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. ఆ తరువాత 'ప్రేమదేశం' సినిమాలో ఆయన పాడిన 'కాలేజ్ స్టైల్లే' .. 'హలో డాక్టర్' పాటలు కుర్రకారుకు కుదురులేకుండా చేశాయి. ఇక 'ఖుషీ' సినిమాకి ఆయన పాడిన 'యే మేరా జహా' సాంగ్ యూత్ ను రెచ్చగొట్టేసింది .. ఆ సినిమా సక్సెస్ లోను ఆ పాట కీలకమైన పాత్రను పోషించింది. ఇక 'మల్లీశ్వరి' సినిమాలో  'చెలి సోకు లేత చిగురాకు' అనే పాట వింటే, జోరైనా .. హుషారైన పాటలకు ఆయన స్వరం పుట్టినిల్లుగా అనిపిస్తుంది.  

ఇక వెంకటేశ్ 'ఘర్షణ' సినిమా లోని 'చెలియా .. చెలియా' అనే పాట వింటే ఆ తరహా పాటలను ఆయన ఎంత అద్భుతంగా పాడగలరనేది అర్థమవుతుంది. ఆయన పాడటం వలన ఆ పాటకి ఒక ప్రత్యేకత వచ్చిందని చెప్పచ్చు. అలాంటి పాటల జాబితాలోనే 'దేవుడే దిగి వచ్చినా' అనే పాట కనిపిస్తుంది. 'సంతోషం' సినిమాలోని ఈ పాట ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది. సాహిత్యాన్ని .. సందర్భాన్ని అర్థం చేసుకుని అందుకు తగినట్టుగా ఆయన పాడతారనడానికి ఈ పాట ఒక ఉదాహరణ.

ఇక కెకె సినిమాల కోసం రికార్డింగ్  థియేటర్లలో పాడటాని కే ఎక్కవ ఆసక్తిని చూపేవారు. ఎంత  ధనవంతులైనా .. ఎంత పారితోషికం ఇస్తామని చెప్పినా , బయట జరిగే పార్టీల్లో పాడటానికి మాత్రం ఆయన నిరాకరించేవారు. డబ్బున్నవారి ఫంక్షన్ లలో కోటి రూపాయలు ఇచ్చినా పాడనని  నిర్మొహమాటంగా చెప్పిన గాయకుడాయన. అదే తన అభిమానులు ఏర్పాటు చేసినా .. ఏదైనా ట్రస్టు ఏర్పాటు చేసిన ఈవెంట్స్ లో పాడటానికి ఆయన వెనుకాడేవారు కాదు. వృత్తిని  దైవంగా భావించడం వల్లనేనేమో చివరి ఊపిరి ఉన్నంతవరకూ పాడుతూనే ఉన్నారు. మరణం తప్ప పాట నుంచి తనని వేరేదీ దూరం చేయలేదని నిరూపించారు. ఆయన గళం నిదురపోయినప్పటికీ .. హుషారైన పాటల్లో ఆయన ఊపిరిచప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. ఆయన పడిన ప్రతి పాటా అభిమానుల హృదయాల్లో అమరత్వాన్ని తెచ్చిపెడుతూనే ఉంటుంది.
Tags:    

Similar News