మూవీ రివ్యూ : 'కృష్ణార్జున యుద్ధం'

Update: 2018-04-12 09:45 GMT
చిత్రం : కృష్ణార్జున యుద్ధం’

నటీనటులు: నాని - అనుపమ పరమేశ్వరన్ - రుక్సార్ దిల్లాన్ - నాగినీడు - సుదర్శన్ - మహేష్ తదితరులు
సంగీతం: హిప్ హాప్ తమిళ
ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు: సాహు గరికపాటి - హరీష్ పెద్ది
రచన - దర్శకత్వం: మేర్లపాక గాంధీ

మూడేళ్లుగా వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు నాని. గత ఏడాది అతను నటించిన మూడు సినిమాలూ విజయవంతమయ్యాయి. ఇప్పుడతను ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’.. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమాలతో ఆకట్టుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి ఈ చిత్రం నాని జైత్రయాత్రను కొనసాగించేలా ఉందో లేదో చూద్దాం పదండి.

కథ:

కృష్ణ (నాని) చిత్తూరు జిల్లాలోని ఓ పల్లెటూరిలో పనీపాటా లేకుండా తిరిగే కుర్రాడు. అతను తన ఊరికి కొత్తగా వచ్చిన రియా (రుక్సార్ దిల్లాన్)ను తొలి చూపులోనే ఇష్టపడతాడు. కొన్ని రోజుల పాటు కృష్ణతో కలిసి సాగాక రియా కూడా అతడిని ఇష్టపడుతుంది. ఐతే రియా తాతకు అది ఇష్టం లేక ఆమెను హైదరాబాద్ పంపించేస్తాడు. మరోవైపు రాక్ స్టార్ అయిన అర్జున్ (నాని) తన మ్యూజిక్ టూర్లో భాగంగా యూరోప్ వెళ్లి అక్కడ సుబ్బులక్ష్మి (అనుపమ పరమేశ్వరన్) అనే తెలుగమ్మాయి ప్రేమలో పడతాడు. ఐతే సుబ్బులక్ష్మి మాత్రం అతడిని అసహ్యించుకుంటుంది. అర్జున్ ప్రేమను అర్థం చేసుకోకుండా ఆమె హైదరాబాద్ వచ్చేస్తుంది. ఐతే రియా-సుబ్బులక్ష్మి ఒకేసారి కనిపించకుండా పోతారు. ఇంతకీ వాళ్లేమయ్యారు.. వారి కోసం కృష్ణ-అర్జున్ ఏం చేశారు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

కథాకథనాలు సుమారుగా ఉన్నా నాని పాత్ర పండితే అతను సినిమాను లాక్కెళ్లిపోతాడనే అభిప్రాయం బాగా బలపడిపోయింది ఈ మధ్య. జనాలు కూడా నాని ఎంటర్టైన్ చేస్తే చాలు అన్నట్లే థియేటర్లకు వచ్చేస్తున్నారు. ‘కృష్ణార్జున యుద్ధం’లో కృష్ణ పాత్ర మొదలైన తీరు.. అతడి నడిచే వైనం చూస్తే.. నాని మ్యాజిక్ మరోసారి బాగానే పని చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఓ మోస్తరు పాత్రలిస్తేనే దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిపోయే నాని.. చిత్తూరు నేపథ్యంలో కొంచెం కొత్తగా.. ప్రత్యేకంగా అనిపించే కృష్ణ పాత్రలో చెలరేగిపోయాడు. చిత్తూరు పల్లెటూళ్ల నేటివిటీని.. యాసను.. అక్కడి పల్లెటూరి కుర్రాళ్ల మనస్తత్వాల్ని బాగానే అర్థం చేసుకుని కృష్ణ పాత్రను పండించాడు. ఈ పాత్రే సినిమా అంతా ఉంటే కథాకథనాల సంగతెలా ఉన్నా చెల్లిపోయేదేమో.

కానీ దీంతో పాటు అతి సామాన్యంగా.. నానికి ఏమాత్రం నప్పనట్లు అనిపించే అర్జున్ పాత్రను కూడా సినిమాలో జొప్పించడమే ప్రతికూలతగా మారింది. ఆ పాత్ర.. దాని చుట్టూ నడిచే వ్యవహారం ఏమంత ఆసక్తి రేకెత్తించదు. దీనికి తోడు చాలా పలుచనైన.. ఫ్లాట్ గా సాగిపోయే కథ సినిమాకు మైనస్ అయింది. ఉమెన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో కథను ఎంచుకోవడం బాగానే ఉంది కానీ.. ఆ కథను ఆసక్తికరంగా చెప్పలేకపోయాడు దర్శకుడు గాంధీ. అసలు కథలోకి వెళ్లడానికంటే ముందు వరకు కృష్ణ పాత్ర చుట్టూ నడిచే కథనంతో చాలా సరదాగా సాగిపోయే ‘కృష్ణార్జున యుద్ధం’.. ఆ తర్వాతే గాడి తప్పుతుంది. వినోదం పాళ్లు తగ్గి.. యాక్షన్ ప్రధానంగా సాగే ద్వితీయార్ధం సినిమా గ్రాఫ్ ను తగ్గించేస్తుంది. కృష్ణ పాత్ర సైతం దాన్ని నిలబెట్టలేకపోయింది.

సామాన్యమైన పాత్రల్ని అసామాన్య రీతిలో పండించడంలో నాని దిట్ట. అతడిని చూడగానే మనలో ఒకడిగా.. పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. నాని అలాంటి పాత్రల్లో కనిపిస్తే చాలా ఈజీగా కనెక్టవుతాం. కానీ నానిని రాక్ స్టార్ పాత్రలో అంటే ఊహించుకోవడానికే ఏదోలా అనిపిస్తుంది. ఐతే నాని మామూలోడు కాదు కదా.. ఆ పాత్రను కూడా రక్తి కట్టించే ఉంటాడులే అనుకుంటాం కానీ.. అర్జున్ పాత్రలో నాని ఏ ప్రత్యేకతా చూపించలేకపోయాడు. విగ్గు పెట్టి హేర్ స్టైల్ మార్చడం మినహాయిస్తే ఆ పాత్రలో నాని వైవిద్యం చూపించలేకపోయాడు. ఆ పాత్రకు అతను మిస్ ఫిట్ అనిపిస్తాడు. దీంతో ఆ పాత్ర చుట్టూ సాగే సన్నివేశాలు కూడా అంతంతమాత్రంగా అనిపిస్తాయి. ప్రథమార్ధంలో సమాంతరంగా చిత్తూరులో కృష్ణ కథను.. యూరోప్ లో అర్జున్ కథను చూపిస్తూ కథనాన్ని నడిపించాడు గాంధీ. ఐతే కృష్ణ పాత్ర కనిపించినపుడల్లా ఉత్సాహం వస్తుంది. చిత్తూరు యాసను అద్భుతంగా పలుకుతూ ప్రతి సీన్లోనూ నవ్విస్తాడు నాని. ఆ పాత్రలోని అమాయకత్వం.. మొరటుతనం ఆకట్టుకుంటాయి. కృష్ణ స్నేహితుల పాత్రలు కూడా వినోదం పంచుతాయి. ఐతే అక్కడ కట్ చేసి అర్జున్ పాత్రను చూపించినపుడల్లా డల్లయిపోతాం. కొంతవరకు బ్రహ్మాజీ వినోదం పండించినా.. అంతకుమించి ప్రత్యేకత ఏమీ కనిపించదు.

ప్రథమార్ధమంతా ఇటో ప్రేమకథను.. అటో ప్రేమకథను నడిపించిన దర్శకుడు.. ఇంటర్వెల్ దగ్గర కథను మలుపు తిప్పాడు. కనిపించకుండా పోయిన తమ ప్రియురాళ్లను కృష్ణ.. అర్జున్ కలిసి వెతికి పట్టుకుంటారన్నదే ద్వితీయార్దం. ఇందులో కొత్తదనం ఏమీ కనిపించదు. సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్.. మలుపులు ఏమీ లేకుండా చాలా ఫ్లాట్ గా సాగిపోవడంతో ద్వితీయార్ధం క్రమ క్రమంగా బోర్ కొట్టించేస్తుంది. ఏదో సన్నివేశాలు అలా పేర్చుకుంటూ పోయాడు కానీ.. స్క్రీన్ ప్లే పరంగా విశేషాలేమీ లేవు. ద్వితీయార్ధంలో కృష్ణ పాత్ర నుంచి వినోదం కూడా ఏమీ లేకపోయింది. ఆ పాత్ర యాక్షన్ మోడ్ లోకి వెళ్లిపోవడంతో దాని ప్రత్యేకతను కోల్పోయింది. నాని గతంలో నటించిన ‘పైసా’ను గుర్తుకు తెచ్చేలా ఒక అలజడితో సాగే ద్వితీయార్ధం.. ప్రథమార్ధంలో ఉన్న మూడ్ ను కూడా చెడగొట్టేస్తుంది. తన బలమైన వినోదాన్ని వదిలేసి నాని..  ఎందుకీ యాక్షన్ బాట పట్టాడన్న భావన కలుగుతుంది చివరికొచ్చేసరికి. ఓవరాల్ గా చూస్తే ‘కృష్ణార్జున యుద్ధం’లో చెప్పుకోదగ్గ విశేషం.. కృష్ణ పాత్ర.. దాని చుట్టూ పండించిన వినోదమే. అర్జున్ పాత్రలో కానీ.. ఆ ‘యుద్ధం’లో కానీ ప్రత్యేకత ఏమీ లేదు.

నటీనటులు:

ఎప్పట్లాగే నాని తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఐతే అతడి మెరుపులు కృష్ణ పాత్రకే పరిమితం. ఆ పాత్రలో నాని అభినయం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. చిత్తూరు యాసను.. అక్కడి కుర్రాళ్ల  తీరును ఆకలింపు చేసుకుని కృష్ణ పాత్రను పండించాడు నాని. గెటప్.. బాడీ లాంగ్వేజ్.. డైలాగ్ డెలివరీ.. అన్నీ ఆకట్టుకుంటాయి. అర్జున్ పాత్రలో నాని చాలా మామూలుగా కనిపిస్తాడు. తన ప్రత్యేకతను చాటుకునే అవకాశం లేకపోయింది. హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ కనిపించినంతసేపు తన అందంతో - హావభావాలతో ఆకట్టుకుంటుంది. కానీ ఆమె పాత్ర పరిధి తక్కువ. మరో హీరోయిన్ రుక్సార్ దిల్లాన్ అందంగా ఉంది కానీ.. నటన పరంగా చెప్పుకోవడానికేమీ లేదు. కృష్ణ స్నేహితులుగా మహేష్.. సుదర్శన్ నవ్వించారు. బ్రహ్మాజీ కూడా ఆకట్టుకుంటాడు. మిగతా పాత్రధారులంతా మామూలే.

సాంకేతికవర్గం:

హిప్ హాప్ తమిళ సంగీతం పాటలు ఆకట్టుకుంటాయి. ఒక కొత్త ఫీల్ ఇస్తాయి. ముఖ్యంగా దారి చూడు పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మిగతా పాటలు కూడా బాగున్నాయి. కానీ సినిమాలో.. ముఖ్యంగా ద్వితీయార్ధంలో పాటలు కథనానికి అడ్డం పడతాయి. హిప్ హాప్ నేపథ్య సంగీతం కూడా వైవిధ్యంగానే ఉంది కానీ.. కొన్ని చోట్ల అది మరీ లౌడ్ గా ఉండి సినిమాలో సింక్ అవ్వలేదనిపిస్తుంది. కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం సినిమాకు మరో పెద్ద ఆకర్షణ. అటు యూరోప్ నేపథ్యం సాగే సన్నివేశాల్ని ఎంత రిచ్ గా తీశాడో.. ఇటు చిత్తూరు పల్లెటూరి నేటివిటీని అంత బాగా చూపించాడు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. కొత్త నిర్మాతలైనా రాజీ పడకుండా.. తమ అభిరుచిని చాటుకుంటూ సినిమాకు బాగా ఖర్చు పెట్టారు. రైటర్ కమ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ తన గత సినిమాల్లోని మ్యాజిక్ ను ఇందులో కొంత వరకే రిపీట్ చేయలేకపోయాడు. తాను పుట్టి పెరిగిన చిత్తూరు జిల్లాలోని నేటివిటీని తెరమీదికి తీసుకురావడంలో.. కృష్ణ పాత్రను ఎంటర్టైనింగ్ గా తీర్చిదిద్దడంలో.. ప్రథమార్ధాన్ని వేగంగా నడిపించడంలో అతను ప్రతిభ చాటుకున్నాడు. ఉమెన్ ట్రాఫికింగ్ నేపథ్యం ఎంచుకున్న కథ ఓకే కానీ.. దాని నేపథ్యంలో కథనాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో విఫలమయ్యాడు. ద్వితీయార్ధంలో ఏ ప్రత్యేకతా చూపించలేకపోయాడు. కృష్ణ పాత్ర.. ప్రథమార్ధంలో కామెడీ వరకే గాంధీకి మార్కులు పడతాయి.

చివరగా: కృష్ణార్జున యుద్ధం- వినోదం ఓకే.. యుద్ధమే తేలిపోయింది

రేటింగ్- 2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News