అందగత్తె అదృష్టం పతాకస్థాయికి చేరుకున్నట్టే!

Update: 2022-03-07 23:30 GMT
అందం ఎందుకు .. అద్దంలో చూసుకుని మురిసిపోవడానికి తప్ప అనుకుంటే పొరపాటే. ఆ అందానికి కాస్తంత అదృష్టం తోడైతే పూజ హెగ్డే మాదిరి డబ్బు - పేరు వడగళ్లలా వచ్చిపడతాయి. పూజ హెగ్డేను చూసినవాళ్లంతా ఏదో కాడమల్లె పూవులాగా బాగానే ఉందిలే అనుకున్నారుగానీ, ఇంత స్టార్ డమ్ ను అందుకుంటుందని మాత్రం అస్సలు అనుకోలేదు. ఇంతకంటే ముద్దుగా బొద్దుగా ఉన్నవాళ్లు చాలామందే ఉన్నారు .. వాళ్లందరిని తట్టుకుని ఏం నిలబడుతుందో అనుకున్నారు. కానీ నాజూకుతనంలో నా తరువాతనే ఎవరైనా అంటూ పూజ హెగ్డే వరుస అవకాశాలను అందుకుంటూ వెళుతోంది.

అవకాశాలు రావడం ఒక ఎత్తయితే .. అవన్నీ సక్సెస్ లు గా మారడం మరో ఎత్తు. ఒకదానికి మించి మరొకటిగా ఆమె సినిమాలు రికార్డుస్థాయి వసూళ్లను నమోదు చేస్తూ వెళుతున్నాయి. 'పూజ హెగ్డేను ట్రై చేయండి సార్ .. ఆమె ఉంటే సగం సక్సెస్ వచ్చేసినట్టే' అనే టాక్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించడం మొదలైంది.

 అలాంటి పూజ హెగ్డే కథానాయికగా నటించిన 'రాధే శ్యామ్' ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఓపెనింగ్స్ దగ్గర నుంచే కొత్త రికార్డులను కొల్లగొట్టడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.

ఇక ఈ సినిమా సృష్టించే ప్రకంపనలు తగ్గకముందే విజయ్ సరసన నాయికగా ఆమె చేసిన 'బీస్ట్' ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంతో పాటు అదే రోజున .. అదే టైటిల్ తో ఈ సినిమాను తెలుగులోను రిలీజ్ చేయనున్నారు. చాలా గ్యాప్ తరువాత తమిళంలో చేసిన ఈ సినిమా అక్కడ కూడా తనకి స్టార్ డమ్ ను తెచ్చి పెడుతుందని పూజ హెగ్డే భావిస్తోంది.

 నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ అమాంతంగా అంచనాలు పెంచేస్తున్నాయి. అనిరుధ్ పాటలు ఉత్సాహంతో ఊపేస్తున్నాయి.

ఆ తరువాత కొన్ని రోజుల గ్యాప్ లోనే పూజ హెగ్డే చేసిన 'ఆచార్య' ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన థియేటర్లకు రానుంది. చిరంజీవి సరసన కాజల్ కనిపించనుండగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే అలరించనుంది. ఈ సినిమాలో 'నీలాంబరి'గా ఆమె పాత్రకి .. పాటకి .. లుక్ కి మంచి మార్కులు పడిపోయాయి.

నిరంజన్ రెడ్డి - చరణ్ నిర్మించిన ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది ఈ మూడు సినిమాలు పూజ రేంజ్ ను మరింత పెంచేలానే కనిపిస్తున్నాయి. ఇక ఆ తరువాత ఆమె పవన్ కల్యాణ్ .. మహేశ్ బాబు ప్రాజెక్టులను ఒప్పుకున్న విషయం తెలిసిందే.    


Tags:    

Similar News