లారెన్స్ 'లక్ష్మిబాంబ్' 'ఓటిటి'లో పేలనుందా..?

Update: 2020-05-08 08:50 GMT
లాక్ డౌన్ కారణంగా దేశంలో ఓటిటి ప్లాట్ ఫామ్ ల హవా ఎక్కువగా నడుస్తుంది. ఈ కరోనా పుణ్యమా అని జనమంతా ఇళ్లలో కూర్చొని టీవీ, మొబైల్ లతో కాలక్షేపం చేస్తున్నారు. అయితే లాక్ డౌన్ వలన సినిమా షూటింగ్స్ నిలిచిపోయి దాదాపు నెల పైనే అవుతుంది. ఎన్నో సినిమాలు విడుదలకు సిద్ధమై నిలిచిపోయిన విషయం తెలిసిందే. అలా షూటింగ్ ఆగిపోయి విడుదల కాకుండా ఉన్న సినిమాల్లో కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ లారెన్స్ సినిమా ఒకటి. లారెన్స్ కాంచన3 విజయం తర్వాత బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా కాంచన సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఆ సినిమాకు 'లక్ష్మిబాంబ్' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ విషయంలో వివాదమై లారెన్స్ సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. అయితే తాజా కథనాల ప్రకారం.. లక్ష్మిబాంబ్ సినిమాను లారెన్స్ పూర్తిచేసాడట. సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలిపోయాయట.

కేవలం విఎఫ్ఎక్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ మిగిలిందని సమాచారం. అయితే ఈ సినిమాను లాక్ డౌన్ అనంతరం థియేటర్లలోనే విడుదల చేస్తామని చిత్రయూనిట్ తెలిపారు. కానీ తాజాగా ఈ సినిమాను ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ లో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. మొదట్లో ఓటిటి రిలీజ్ కి నో చెప్పిన చిత్రయూనిట్.. ఇప్పుడు ఓటిటి లోనే భారీ రేంజ్ లో రిలీజ్ చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఈ లక్ష్మిబాంబ్ సినిమాను జూన్ నెలలో డిజిటల్ రిలీజ్ గురించి చర్చలు జరుపుతున్నారట. మరి మొదట్లో థియేటర్లోనే రిలీజ్ చేస్తామని చెప్పిన లారెన్స్ టీమ్ ఇప్పుడెందుకు ఓటిటి వైపు మొగ్గుచూపుతున్నారని నెటిజన్లు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుత లాక్ డౌన్ ఇప్పట్లో ముగిసేలా లేదని భావించే ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. చూడాలి మరి ఏదైనా అధికారిక ప్రకటన చేస్తారేమో..!
Tags:    

Similar News