దివికేగిన సంగీత దిగ్గజం

Update: 2015-07-14 01:22 GMT
దక్షిణాది సంగీత దర్శక దిగ్గజం ఎం.ఎస్.విశ్వనాథన్ కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథన్‌ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

1970-90 మధ్య తమిళంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు సంగీతాన్నందించిన విశ్వనాథన్.. బాలచందర్ ఆస్థాన సంగీత దర్శకుడిగా తెలుగు సంగీత ప్రియులనూ తన సంగీతంతో అలరించారు. మరోచరిత్ర, అంతులేని కథ, ఇది కథ కాదు, ఆకలి రాజ్యం, అందమైన అనుభవం, కోకిలమ్మ, గుప్పెడు మనసు లాంటి సినిమాలకు అద్భుతమైన సంగీతాన్నందించారు.

1928వ సంవత్సరం జూన్‌ 24న కేరళలోని పాలక్కాడ్‌ సమీపంలోని ఇలప్పులలో జన్మించారు. 13 ఏళ్ల వయసులోనే సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు. సీఆర్‌ సుబ్బరామన్‌తో కలిసి దేవదాసు, లైలామజ్నూ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. దేవదాసు సినిమాలోని జగమే మాయ బతుకే మాయ పాటను స్వరపర్చారు. చండీరాణి, సిపాయి చెన్నయ్య తదితర చిత్రాలకు సంగీతాన్ని అందించారు. విశ్వనాథన్ మృతి వార్త విని దక్షిణాది సినీ పరిశ్రమ అంతా దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది.
Tags:    

Similar News