'మా' గొడవలు సమసినట్లేనా?

Update: 2015-07-04 11:30 GMT
మా ఎన్నికల సందర్భంగా ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. మా అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్‌ ఎన్నికైనప్పటికీ కార్యవర్గంలో ప్రత్యర్థి వర్గీయులు కూడా చోటు దక్కించుకున్నారు. జయసుధ వర్గంలోని సీనియర్‌ నటుడు నరేష్‌ కూడా 'మా'లో కీలక పదవి దక్కింది. దీంతో రాజేంద్రుడి పని అంత తేలికేమీ కాదని అర్థమైంది. ఎన్నికల తర్వాత రెండు మూడుసార్లు రాజేంద్రుడిపై విమర్శలు కూడా గుప్పించాడు నరేష్‌. రాజేంద్రప్రసాద్‌ తమనెవరినీ సంప్రదించకుండా సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌లను కలవడంపై విరుచుకుపడ్డారు నరేష్‌. ఐతే ఇప్పుడు పరిస్థితి కొంచెం సద్దుమణిగినట్లు తెలుస్తోంది.

పేద కళాకారుడు 'వేదం' నాగయ్యను ఆదుకునే విషయంలో ముందుగా నరేష్‌ స్పందిస్తే.. ఆ తర్వాత రాజేంద్రుడు 'మా' తరఫున చేయాల్సిందల్లా చేశారు. నాగయ్యతో పాటు లవకుశ ఫేమ్‌ నాగసుబ్రమణ్యంలకు మా తరఫున చెరో రూ.25 వేల రూపాయలు అందజేశారు రాజేంద్రప్రసాద్‌. దీంతో పాటు వీరికి నిత్యావసర వస్తువుల కోసం సంపూర్ణ మార్కెట్‌ తరఫున చెరో రూ.12 వేల చెక్కులు కూడా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేందప్రసాద్‌, నరేష్‌ చాలా సఖ్యతతో మెలిగారు. ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. నరేష్‌ను వెల్ఫేర్‌ కమిటీ అధ్యక్షుడిగా కూడా నియమించారు రాజేంద్రప్రసాద్‌. 'మా'లో సభ్యత్వం లేని ఆర్టిస్టులకు కూడా ఆర్థిక సాయం అందించడానికి సన్నాహాలు చేస్తున్నామని.. మా సభ్యత్వ రుసుమును ఎక్కువన్న అభిప్రాయాల నేపథ్యంలో వాయిదాల పద్ధతిలో ఆ డబ్బు చెల్లించే అవకాశం కల్పించాలని నిర్ణయించామని ఈ సందర్భంగా కాదంబరి కిరణ్‌కుమార్‌ తెలిపారు.

Tags:    

Similar News