‘మెగా’ బలమే ప్రకాశ్ రాజ్ కు శాపమైందా?

Update: 2021-10-11 04:30 GMT
‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించటం తెలిసిందే. తిప్పి కొడితే వెయ్యి మంది కూడా లేని ఒక అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధిస్తే అంతలా చెప్పుకోవాల్సిందేముందన్న మాట మాట్లాడితే.. దానికి అర్థం లేదనే చెప్పాలి. ఎందుకంటే.. ‘మా’ ఎన్నికల్లో విజయం సాధించటం అంత మామూలు విషయం కాదు. దాని వెనుక చాలానే లెక్కలు ఉంటాయి. పైకి కనిపించేది వెయ్యి ఓట్లు ఉన్న అసోసియేషన్ అనే కానీ.. తెర వెనుక ఉన్న వ్యక్తులు.. వారి ప్రమేయం లాంటివెన్నో ఈ ఎన్నికల్లో కీలకభూమిక పోషిస్తాయి.

ఇంతకాలం మెగా కాంపౌండ్ ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసే వారికి తమ వంతుగా దన్నుగా నిలవటం.. సీన్ మీదకు రాకుండా ఉంటూ.. తాము డిసైడ్ చేసిన వారు గెలిచేలా అంతర్గత లాబీయింగ్ చేసేవారన్న మాట ఉంది. అందుకు భిన్నంగా ప్రకాశ్ రాజ్ కు తమ ఓపెన్ సపోర్టు ఇచ్చేయటమే కాదు.. వారి తరఫున నాగబాబు బయటకు వచ్చి నానా హడావుడి చేయటం తెలిసిందే. ప్రకాశ్ రాజ్ కు మెగా కాంపౌండ్ సపోర్టు ఉందని.. ఆయన గెలుపు సునాయాసమని లెక్కలు వేసుకున్నోళ్లకు షాకులు తగిలేలా తుది ఫలితం రావటం తెలిసిందే. ఎందుకిలా జరిగింది? ఇంతకాలం మెగా బలం అంటూ చెప్పిన గొప్పలు ఈసారి ఎందుకు వర్కువుట్ కాలేదు? అన్నది ప్రశ్నగా మారింది.

అదే సమయంలో ప్రకాశ్ రాజ్ కు అనుకూలంగా మెగా కాంపౌండ్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. నాగబాబు స్వయంగా బయటకు రావటం ఒక ఎత్తు అయితే.. స్వతంత్రంగా పోటీ చేస్తానని చెప్పిన జీవిత రాజశేఖర్ ప్రకాశ్ రాజ్ వైపు నిలబడి పోటీ చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఈసారికి ప్రకాశ్ రాజ్ కు వదిలేయాలని మోహన్ బాబుకు చిరంజీవి స్వయంగా ఫోన్ చేసినట్లుగా ప్రచారం సాగింది. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేసిన తర్వాత కూడా ప్రకాశ్ రాజ్ ఓడిపోవటం వెనుక కారణాలకు సంబంధించి పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వాటిల్లో కొన్నింటిని చూస్తే..

- సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు మీద నటుడు నాగబాబు నోరు పారేసుకున్న వైనం కీలకమైంది. ఓపెన్ డయాస్ మీద రెడ్లు.. రెడ్లు అంటూ పవన్ చేసిన రాజకీయ వ్యాఖ్యల ఎఫెక్టు కూడా ఉండటం.

- మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న హీరోల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ.. ఇప్పుడు దగ్గర దగ్గర డజన్ వరకు వెళ్లిపోవటం

- మెగా కాంపౌండ్ అన్నంతనే ఒక సామాజిక వర్గానికి చెందిన వారన్న భావన.

- మెగా కాంపౌండ్ సపోర్టు ఉందన్న ప్రకాశ్ రాజ్ కు బయటకు వచ్చి మద్దతు తెలిపింది నాగబాబు మాత్రమే. మెగాస్టార్ చిరంజీవి మాత్రం బయటకు రాలేదు. తమ మద్దతు గురించి చెప్పకపోవటం. మంచు విష్ణుకు మద్దతు ఇచ్చిన వారంతా ఓపెన్ గా సపోర్టు చేసిన వారే. అందుకు భిన్నంగా మెగాస్టార్ తీరు ఉండటం కూడా కారణం.

-  ప్రకాశ్ రాజ్ కు మెగాస్టార్ సపోర్టు ఉందని తెలిసి బన్నీ.. అల్లు శిరీశ్.. నాగబాబు కుమార్తె.. కుమారులైన నిహారిక.. వరుణ్ తేజ్ లు రాకపోవటం.. మంచుకు సపోర్టు చేసిన జెనీలియా లాంటి వారు ముంబయి నుంచి రావటం లాంటివి చూస్తే.. పోల్ మేనేజ్ మెంట్ విషయంలో ప్రకాశ్ రాజ్ ఫెయిల్ అయ్యారు.

- ఎన్నికల బరిలో నిలబడిన నాటి నుంచి పోలింగ్ వరకు ఎక్కడా.. ఎవరికి.. ఎలాంటి అవకాశం ఇవ్వకుండా.. గెలుపునకు ఎన్ని మార్గాలు ఉంటాయో.. అన్నింటిని వినియోగించుకుంటూ.. ప్రకాశ్ రాజ్ వ్యతిరేకుల్ని ఒకచోటుకు చేర్చటం విజయానికి కీలకమైంది. ఫోన్లో మాట్లాడాల్సిన వారితో మాట్లాడటం.. తెర వెనుక కథ నడపటంలో మోహన్ బాబు కీ రోల్ ప్లే చేయటం.. ఫ్లైట్ టికెట్లు బుక్ చేయటం దగ్గర నుంచి.. పోస్టల్ ఓట్ల కోసం చేసిన ప్రయత్నాల్ని మంచువిష్ణు చేస్తే.. ప్రకాశ్ రాజ్ విషయంలో అలాంటివి పెద్దగా జరగకపోవటం ఒక కారణం.
Tags:    

Similar News