`దొర‌సాని`కి `సైరాఠ్` పోలికేంటి?

Update: 2019-07-13 17:30 GMT
ప్రేమ‌క‌థ‌లో కులం గురించి దొర‌ల వ్య‌వ‌స్థ గురించి ప్ర‌స్థావిస్తే మ‌రాఠా మూవీ `సైరాఠ్‌` తో పోల్చేయ‌డం క‌రెక్టేనా? అస‌లు సైరాఠ్ కి `దొరసాని`కి పోలికేంటి?  నైజాం కాలంలో దొర‌ల‌ వ్య‌వ‌స్థ‌ ఎలా ఉండేది.. ఆ రోజుల్లో అమ్మాయిల్ని బ‌య‌టికి క‌నిపించ‌కుండా ఎలా దాచి పెట్టేవారు?  సాంఘీక దురాచారాలు.. మూడ న‌మ్మ‌కాలు ఎలా ఉండేవి? అన్న‌ది దొర‌సాని చిత్రంలో చూపించారు. ఇంట‌ర్వెల్ వ‌ర‌కూ అస‌లు హీరో హీరోయిన్ల‌కు అస‌లు త‌మ పేర్లేమిటో కూడా తెలీదు. ఒక‌రినొక‌రు చూసుకోవ‌డం మూగ ప్రేమాయ‌ణం త‌ప్ప‌.

అలాంటి `దొర‌సాని`కి `సైరాఠ్` పోలిక ఏంటి? అని ప్ర‌శ్నించారు య‌శ్ రంగినేని- మ‌ధుర శ్రీ‌ధ‌ర్ డ్యూయో. ఆనంద్ దేవ‌ర‌కొండ‌- శివాత్మిక రాజ‌శేఖ‌ర్ జంట‌గా మ‌హ‌దేవ్ ద‌ర్శ‌క‌త్వంలో ఆ ఇద్ద‌రూ క‌లిసి నిర్మించిన దొర‌సాని ఇటీవ‌లే రిలీజైన సంగ‌తి తెలిసిందే. సైరాఠ్ నే తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో చూపించారా? అన్న ప్ర‌శ్న‌కు వీళ్లు పైవిధంగా స్పందించారు. ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా నేడు హైద‌రాబాద్ మీడియాతో ముచ్చ‌టించిన నిర్మాత‌లు .. అస‌లు త‌మ సినిమాకి సైరాఠ్ తో పోల్చ‌డం స‌రికాద‌ని అన్నారు. మ‌రాఠా సినిమా సైరాఠ్ క‌థ వేరు. దొర‌సాని క‌థ వేరు. అందులో మూగ ప్రేమ క‌నిపించ‌దు. సైరాఠ్ లో అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటారు.. పిల్ల‌లు పుట్టేస్తారు.. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ‌లు ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇవ‌న్నీ చూపించారు. అస‌లు దొర‌సానిలో అలాంటివేవీ ఉండ‌వు.  ఆ కాలంలో ప్రేమ‌క‌థ‌ ఎలా ఉండేదో తెర‌పై చూపాం. ఆనంద్ - శివాత్మిక ఇమిడిపోయి న‌టించారు. శివాత్మిక 18 ఏళ్ల కిడ్. అంత‌గా ఒదిగిపోయి న‌టిస్తుంద‌ని అనుకోలేదు.. అని అన్నారు.

దొర‌సాని కొత్త క‌థ అని మేం ఎక్క‌డా చెప్ప‌లేదు. పాత క‌థ‌నే కొత్త నేప‌థ్యంలో చూపించాం అంతే. అది జ‌నాల‌కు క‌నెక్ట‌వుతోంది అని నిర్మాత‌లు అన్నారు. క‌మ‌ర్షియ‌ల్ అంశాలు లోపించాయ‌ని విమ‌ర్శ‌లొచ్చాయి క‌దా? అని ప్ర‌శ్నిస్తే.. అది కొంద‌రి ఒపీనియ‌న్ మాత్ర‌మే. 40 శాతం జ‌నాలు వేరుగా మాట్లాడొచ్చు. ఎవ‌రి అభిప్రాయం వారికి ఉంటుంద‌ని అన్నారు.
    

Tags:    

Similar News