35.66ల‌క్ష‌లు చెల్లించిన మ‌హేశ్ బాబు మ‌ల్టీఫ్లెక్స్!

Update: 2019-02-22 05:18 GMT
ఎప్పుడూ లేని విధంగా ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌ముఖ సినీన‌టుడు మ‌హేశ్ బాబు ఆర్థిక అంశాల‌కు సంబంధించిన వార్త‌ల్లో ద‌ర్శ‌న‌మిస్తున్నారు. ఈ మ‌ధ్య‌నే ప‌న్ను చెల్లింపుల‌కు సంబంధించి మ‌హేశ్ పేరు తెర మీద‌కు రావ‌టం ఒక ఎత్తు అయితే.. రెండు రోజుల క్రితం ఆయ‌న‌కు చెందిన ఏఎంబీ మ‌ల్టీఫ్లెక్స్ జీఎస్టీ మొత్తాన్ని చెల్లించాలంటూ పేర్కొన్న విష‌యం తెలిసిందే.

ఇటీవ‌ల కాలంలో సినిమా థియేట‌ర్లు.. మల్టీఫ్లెక్సుల‌కు సంబంధించి విదించే జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ త‌గ్గించిన మొత్తాన్ని జ‌న‌వ‌రి ఒక‌టి నుంచి అమ‌ల్లోకి వ‌చ్చేలా నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే.. కొన్ని మ‌ల్టీఫ్లెక్సులు త‌గ్గించిన జీఎస్టీ మొత్తాన్ని వ‌సూలు చేయ‌కుండా.. పాత మొత్తాన్నే వ‌సూలు చేస్తున్నాయి.

దీనికి సంబంధించిన ఫిర్యాదులు అధికారుల దృష్టికి రావ‌టంతో వారు దాడులు నిర్వ‌హించారు. ఇందులో భాగంగా మ‌హేశ్ బాబుకు చెందిన ఏఎంబీ మాల్ లోనూ ఇదే విధానాన్ని అనుస‌రించిన‌ట్లు గుర్తించి.. నోటీసులు జారీ చేశారు. ఈ వార్త ప‌లు వార్తాప‌త్రిక‌ల్లో ప్ర‌ముఖంగా వ‌చ్చింది.

ఇదిలా ఉంటే.. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ‌సూలు చేస్తున్న జీఎస్టీ మొత్తానికి సంబంధించి జీఎస్టీ శాఖాధికారులు విధించిన ఫైన్ ను ఏఎంబీ మాల్ యాజ‌మాన్యం చెల్లించిన‌ట్లుగా అధికారులు పేర్కొన్నారు. ప్రేక్ష‌కుల నుంచి అద‌నంగా వ‌సూలు చేసిన రూ.35.66 ల‌క్ష‌ల మొత్తాన్ని తాజాగా త‌మ‌కు చెల్లించిన‌ట్లు వారు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని వినియోగ‌దారుల సంక్షేమ నిధికి జ‌మ చేయ‌నున్నారు. ఇదిలా ఉండ‌గా.. టికెట్ల అంశం రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ శాఖ ప‌రిధిలో ఉండ‌టంతో తాము త‌గ్గించిన జీఎస్టీ మొత్తాన్ని త‌గ్గించ‌లేన‌ట్లుగా ఏఎంబీ మాల్ పేర్కొంది. అయితే.. ఈ వాద‌న స‌రికాద‌న్న అభిప్రాయం సోష‌ల్ మీడియాలో వ్య‌క్త‌మ‌వుతోంది. కాస్త‌.. ఆర్థిక విష‌యాల్లో క‌న్నేయండి మ‌హేశ్ జీ.
Tags:    

Similar News