బ‌రిలోకి మ‌హిమా చౌద‌రి న‌ట‌వార‌సురాలు..?

Update: 2022-11-11 00:30 GMT
బాలీవుడ్ లో న‌ట‌వార‌సుల వెల్లువ కొన‌సాగుతోంది. శ్రీ‌దేవి- షారూక్ ఖాన్ - అమితాబ్ బ‌చ్చ‌న్- సైఫ్ ఖాన్- అనీల్ క‌పూర్- శ‌క్తి క‌పూర్-  వంటి అగ్ర‌తార‌ల కుటుంబాల నుంచి వ‌రుస‌గా న‌ట‌వార‌సులు బ‌రిలో దిగి స‌త్తా చాటుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ మహిమా చౌదరి కుటుంబం నుంచి న‌ట‌వార‌సురాలు బ‌రిలోకి దిగుతోంద‌న్న గుస‌గుస వినిపిస్తోంది. యుక్తవయసులో ఉన్న మ‌హిమా కుమార్తె అరియానా ముఖర్జీ ఇప్ప‌టికే  నెటిజనుల దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

క్యాన్సర్‌ నుంచి బయటపడిన మహిమా చౌదరి కుమార్తె 15 ఏళ్ల అరియానా ముఖర్జీ తన అందంతో మీడియాను స్పెల్ బౌండ్ చేస్తోంది. మహిమా చౌదరి ఇటీవల సూరజ్ బర్జాత్యా `ఉంచై` స్టార్-స్టడెడ్ స్క్రీనింగ్ కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మ‌హిమ‌ తన కుమార్తె అరియానా ముఖర్జీతో కలిసి అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈవెంట్ నుండి ఈ జోడీ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో కనిపించిన వెంటనే నెటిజన్లు అరియానాపై ప్రేమ‌ను కురిపిస్తూ అభినందనలు తెలిపారు. త్వ‌ర‌గా సినీరంగంలోకి రావాల‌ని పిలుపునిచ్చారు.

యార్ యే బిల్కుల్ అప్నీ మామా కి కాపీ హై బ్యూటిఫుల్... అని ఒక నెటిజ‌నుడు వ్యాఖ్యానించ‌గా.. ఆమె తన తల్లిలా చాలా ముద్దుగా ఉంది! ఇత్నీ సుందర్ బేటీ అంటూ కీర్తించారు.

తరచుగా సెలబ్రిటీలు మళ్లీ తెరపైకి రావడానికి కెరీర్ ని మళ్లీ ప్రారంభించే ముందు చాలా సంవత్సరాల పాటు కొన్ని ర‌కాల ప‌రీక్ష‌ల‌కు గురవుతారు. అంద‌రిలానే వారి పట్టుదలను నిరూపించుకునేందుకు జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. 1997లో సుభాష్ ఘాయ్ `ప‌ర్ధేశీ` (ప‌ర‌దేశీ) చిత్రంతో రంగప్రవేశం చేసిన మహిమా చౌదరి చాలా గ్యాప్ త‌ర్వాత ఇలా ఉంచై స్క్రీనింగ్ లో తన కుమార్తె ఆర్యానాతో కలిసి కనిపించింది.

రొమ్ము క్యాన్సర్ తో పోరాడిన 49 ఏళ్ల మ‌హిమ‌కు స‌హ‌న‌టులు అన్నివేళ‌లా అండ‌గా నిలిచారు. తన స్నేహితుడు అనుపమ్ ఖేర్ `ది సిగ్నేచర్‌`లో కీలక పాత్రతో తిరిగి కంబ్యాక్ కోసం మ‌హిమ సిద్ధంగా ఉన్నారు. వాస్తవానికి మ‌హిమ‌ క్యాన్సర్ నిర్ధారణను ఈ సంవత్సరం ప్రారంభంలోనే అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. జీవితం స‌వాళ్లు విసిరినా కానీ మ‌హిమ ఎగరడానికి సిద్ధంగా ఉంది! అంటూ త‌న‌దైన శైలిలో ఆయ‌న మ‌ద్ధ‌తుగా నిలిచారు. మ‌హిమ క్యాన్స‌ర్ చికిత్స అనంత‌రం సెట్ కి తిరిగి వచ్చిందని చెప్పారు. అలాగే కంగనా రనౌత్ `ఎమర్జెన్సీ`లో పుపుల్ జయకర్ పాత్రలో మహిమా చౌదరి న‌టిస్తున్నారు.

మహిమ కొన్ని నెలల క్రితం క్యాన్సర్ నుండి బయటపడింది. ఆమె ఇంతకుముందు బాబీ ముఖర్జీని వివాహం చేసుకుంది. కానీ 2013లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. పున‌రారంగేట్రంలో `ది సిగ్నేచర్‌`తో పాటు ఎమర్జెన్సీలో కంగనా రనౌత్ తో క‌లిసి న‌టిస్తోంది. ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కంగనా దివంగత ప్రధాని పాత్రలో కనిపించనుండగా మహిమ ఆమెకు అత్యంత సన్నిహితురాలు అయిన ప్ర‌పుల్ గా క‌నిపించ‌నుంది. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు.

ఇటీవ‌ల మహిమా చౌదరి షోబిజ్ లో యాక్టివ్ గా ఉండకపోవచ్చు కానీ ఆమె తన ఇన్ స్టా ఫ్యామ్ లో తన జీవితం గురించి అప్ డేట్స్ తో అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. తన టీనేజ్ కుమార్తె అరియానా ముఖర్జీతో క‌లిసి ఉన్న వీడియోలను త‌ర‌చుగా షేర్ చేస్తోంది. నెటిజనుల స్పంద‌న‌లు అనూహ్యంగా ఉంటాయి. తల్లీ-కూతుళ్ల మధ్య ఉన్న అద్భుతమైన పోలికను నెటిజ‌నులు గుర్తు చేయ‌డం విశేషం.

మహిమా - అరియానా జోడీ ఇటీవలి కొన్ని వీడియోలను షేర్ చేయ‌గా వాటికి అభిమానులు చేసిన కొన్ని వ్యాఖ్యలు ప‌రిశీలిస్తే..``కుమార్తె సరిగ్గా తన తల్లి లా ఉంది. కానీ ఆమె వయస్సు కంటే ఎక్కువ పరిణతి చెందింది`` అని  .. `తల్లి ప్రతిరూపం` అని అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. త్వ‌ర‌లోనే అరియానా సినిమాల్లోకి రావాల‌ని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు.

మోడ‌ల్ .. మాజీ మిస్ ఇండియా.. బాలీవుడ్ న‌టి మ‌హిమా చౌద‌రి తెలుగు ప‌రిశ్ర‌మ‌కు సుప‌రిచితం. టాలీవుడ్ లో ఆరంగేట్రం `మ‌న‌సులో మాట` అనే చిత్రంలో న‌టించింది. అందానికి అందం ప్ర‌తిభ‌తో ఆక‌ట్టుకున్న ఈ న‌టి అనంత‌ర కాలంలో బాలీవుడ్ లోనే సెటిలైంది. చిరంజీవి - ర‌జ‌నీ కాంత్ ల‌ను అమితంగా అభిమానిస్తాన‌ని మ‌హిమ ప‌లుమార్లు పేర్కొంది. ఇక సినిమాల‌తో కంటే ఎఫైర్ తోనే ఈ అమ్మ‌డి పేరు దేశ‌వ్యాప్తంగా మార్మోగింది. ప్ర‌ఖ్యాత టెన్నిస్ ఆట‌గాడు... లియాండర్ పేస్ తో సుదీర్ఘ కాలం ప్రేమాయ‌ణం సాగించి చివ‌రికి బ్రేక‌ప్ అవ్వ‌డం అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది అప్ప‌ట్లో. లియాండ‌ర్ తనను మోసం చేశాడ‌ని వ‌దిలించుకున్నాడ‌ని ప‌లుమార్లు బ‌హిరంగ వేదిక‌ల‌పైనే మ‌హిమ వాపోయింది. రియా పిళ్ళై అనే వేరొక యువ‌తిని పెళ్లాడి త‌న‌ని మోసం చేశాడ‌ని లియాండ‌ర్ పై ప‌లుమార్లు విరుచుకుప‌డింది. కార‌ణం ఏదైనా వ్య‌క్తిగ‌త జీవితంలో క‌ల్లోలం సినీకెరీర్ పైనా ప‌డింది. అప్ప‌ట్లో అగ్ర క‌థానాయిక‌గా ఓ వెలుగు వెలిగీ కెరీర్ ప‌రంగా చివ‌రికి ఇబ్బందులు ఎదుర్కొంది.

మహిమా 2006 లో ఆర్కిటెక్ట్ కం వ్యాపారవేత్త బాబీ ముఖర్జీని వివాహం చేసుకుంది. ఈ జంట‌కు జ‌న్మించిన‌ అందమైన కుమార్తె అరియానా. అయితే విభేదాల కారణంగా ఆ జోడీ 2011 లో విడిపోయారు. అయితే అప్ప‌టికే మహిమా లియాండర్ పేస్ ‌తో ఎఫైర్ సాగించింద‌న్న ప్ర‌చారం ఉంది. అనంత‌ర కాలంలో ఓ ఇంట‌ర్వ్యూలో మ‌హిమ మాట్లాడుతూ-``లియాండ‌ర్ మంచి టెన్నిస్ ప్లేయర్ కావచ్చు.. కానీ అతను నాతో ఫెయిర్ గేమ్ ఆడలేదు. అతను వేరొకరి(మోడ‌ల్ రియా)తో షికార్లు చేస్తున్నాడ‌ని తెలిసిన‌ప్పుడు నిజంగా షాక్ తగ‌ల్లేదు.. అత‌డు అంతే. నా జీవితం నుంచి అత‌డి నిష్క్రమణ నాపై ఎలాంటి ప్రభావం చూపలేదు. వాస్తవానికి నేను ఒక వ్యక్తిగా మరింత పరిణతి చెందాను. అతను రియా (పిళ్ళై) తో కూడా అదే పని చేశాడని నేను భావిస్తున్నాను`` అని తెలిపింది. అనంత‌ర కాలంలోనే  రియా నుంచి లియాండ‌ర్ విడిపోయాడు. ఇది చాలా వ‌ర‌స్ట్ బ్రేక్-అప్ ల‌లో ఒక‌టిగా నిలిచిపోయింది. లియాండర్ తాను రియాను ఎప్పుడూ వివాహం చేసుకోలేదని వాదిస్తే.. తాను మాత్రం ఓ హిందూ దేవాలయంలో వివాహం చేసుకున్నారని రియా వాదించింది.

కార‌ణం ఏదైనా అనంత‌ర కాలంలో మహిమాకు క్యాన్స‌ర్ అని తెలియ‌డం బిగ్ షాక్. త‌న‌ను పరిశ్రమకు తీసుకువచ్చిన సుభాష్ ఘాయ్.. ఆమె పేరు మార్పు చేయ‌డ‌మే గాక‌.. రాబోయే కొన్ని తరాల పాటు ప్రజలు త‌న‌ను గుర్తుంచుకునేంత‌టి గొప్ప సినిమాని చేసే అవ‌కాశం ఇచ్చారు. అయితే అందుకు మహిమా ఒకానొక సంద‌ర్భంలో మూల్యం చెల్లించాల్సి వచ్చింది. మ‌హిమ సంపాద‌న‌లో 35 శాతం త‌న‌కు చెందిన ఓ ట్ర‌స్ట్ కి అందేలా సుభాష్ ఘాయ్ ఒప్పందం కుదుర్చుకున్నారు.

అయితే ఆ విష‌యంలో మ‌హిమ మాట‌పై నిల‌బ‌డ‌లేద‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంది. కోర్టుల వ‌ర‌కూ గొడ‌వ వెళ్లినా.. ఆ త‌ర్వాత సెటిల్ చేసుకున్నారు. అలా త‌న‌కు తొలి ఆఫ‌ర్ ఇచ్చిన గురువుతోనూ మ‌హిమ గొడ‌వ‌కు దిగ‌డం సంచ‌ల‌న‌మైంది. ఇన్ని ప‌రిణామాల త‌ర్వాత త‌న హోప్స్ అన్నీ కుమార్తె అరియానాపైనే. ఈ అందాల రాకుమారి క‌థానాయిక‌గా ఏమేర‌కు రాణిస్తుందో వేచి చూడాలి. ప్ర‌స్తుతం చ‌బ్బీగా క్యూట్ గా క‌నిపిస్తున్నా క‌థానాయిక‌గా రంగ ప్ర‌వేశానికి ముందు చాలా మేకోవ‌ర్ ని త‌న నుంచి ఆశించ‌వ‌చ్చు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News